ప్రస్తుత సమాజంలో ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో అర్ధం కావడం లేదు. ఎందుకంటే తెలియని వారికంటే ఎక్కువ తెలిసినవారి చేతిలోనే చాలామంది మోసపోతున్నారు. కొద్దీ రోజుల్లో పెళ్లి.. ఎంతో అందమైన జీవితం ఊహించుకున్న ఆ అమ్మాయి జీవితాన్ని వరుసకు అన్న అయ్యే యువకుడు రోడ్డుపాలు చేశాడు. అన్ననే కదా అని కారు ఎక్కిన పాపానికి ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి యువతిని రేప్ చేయడమే కాకుండా, ఆమె నగ్న ఫోటోలను కాబోయే వరుడుకు పంపి ఆమె పెళ్లిని ఆపేందుకు ప్రయత్నించిన ఘటన అస్సాంలో వెలుగు చూసింది.
వివరాలలోకి వెళితే.. అస్సాం రాజధాని దిస్పూర్ కి చెందిన ఒక యువతికి ఇటీవల పెళ్లి చూపులు జరిగాయి. అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి నచ్చడంతో పెళ్లి ఖరారు అయ్యింది. అయితే ఇంతలోనే సడెన్ గా అబ్బాయికి వాట్సప్ లో ఒక ఫొటో వచ్చింది. ఆ ఫొటో చూసి వరుడు ఖంగుతిన్నాడు. తాను 10 నిమిషాల క్రితం చూసిన వధువు ఫొటో నగ్నంగా దర్శనమిచ్చింది. దీంతో ఒక్కసారిగా శుభకార్యం జరుగుతున్న ఇంట విషాదం నెలకొంది. ఆ ఫొటో చూసిన వధువు సైతం కంగారుపడి, కన్నీటి పర్యంతమయ్యింది. తల్లిదండ్రులు ఏమి జరిగిందని అడగడంతో గతంలో తాను చేసిన తప్పును చెప్పుకొచ్చింది.
కాలేజీ చదివే రోజుల్లో ఒకరోజు తాను కాలేజీ నుంచి వస్తుంటే.. వరుసకు సోదరుడు(కజిన్), అతని ఫ్రెండ్స్ కారులో వచ్చారని, అతనే తనను ఇంటికి తీసుకువెళ్తానంటే నమ్మి కారు ఎక్కినట్లు తెలిపింది. ఆ తరువాత వారు తనకు కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి తనకు తాగించారని, అనంతరం తనపై అత్యాచారం చేసినట్లు వివరించింది. అప్పుడే ఈ నగ్న ఫొటోలను తీసి ఉంటారని, తనకు పెళ్లి కాకుండా చేయడానికే ఈ ఫొటోలను బయటపెట్టారని యువతి వాపోయింది. అసలు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
