చిత్తూరు జిల్లా జీడి నెల్లూరులో గుర్తుపట్టలేని స్థితిలో లభించిన ఓ మృతదేహం తీవ్ర కలకలం రేపుతోంది. మృతి చెందిన వ్యక్తి వయసు 17 నుంచి 20 ఏళ్లలోపు ఉండడం, అదే సమయంలో తిరుపతిలో ఓ విద్యార్థి గత ఐదు రోజులుగా అదృశ్యం అవడంతో, అసలు చనిపోయిన వ్యక్తికి, అదృశ్యమైన విద్యార్థికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. చనిపోయిన వ్యక్తి ఎవరు? అదృశ్యమైన విద్యార్థి ఎక్కడున్నారు? అని ఇటు చిత్తూరు పోలీసులు, అటు తిరుపతి పోలీసులు పెద్ద ఎత్తున కేసును దర్యాప్తు చేస్తున్నారు.
చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు మండలంలోని కొమరగుంట పంచాయతీ మేకలబండ సమీపంలో కాలిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఓ యువకుడి మృతదేహం కలకలం రేపింది. బందార్లపల్లె, పూలవారికండ్రిగ గ్రామానికి వెళ్లే దారిలో మేకలబండపై ఉన్న మూతపడ్డ కంకర క్వారీ సమీపంలో కాలిపోయి గుర్తుపట్టలేని విధంగా ఉన్న మృతదేహాన్ని పశువుల కాపర్లు గుర్తించారు.
విషయం తెలుసుకున్న కార్వేటినగరం పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహం నుంచి సేకరించిన ప్రాథమిక ఆధారాలతో మృతుడు 17 నుంచి 20 ఏళ్లలోపు వయసు కలిగిన యువకుడని నిర్ధారణకు వచ్చారు. గుర్తు తెలియని యువకుడిని ఎక్కడో హత్య చేసి ఇక్కడికి తీసుకువచ్చి రబ్బరు టైర్లు వేసి తగులబెట్టారా? లేక ఇక్కడే హత్య చేసి తగులబెట్టారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. శవపంచనామా అనంతరం మృతదేహాన్ని ఖననం చేశారు.
Also Read:Land Registrations: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ.. పని వేళలు పొడిగింపు..
ఇదే సమయంలో తిరుపతిలో ఓ ఇంటర్ విద్యార్థి అదృశ్యం ఉదంతం సంచలనంగా మారింది. జశ్వంత్ రెడ్డి అనే విద్యార్థి ఎక్కడికి వెళ్ళాడు? 6 రోజులుగా ఆ కుర్రాడి ఆచూకీ ఎందుకు దొరకడం లేదు? తంబళ్లపల్లె నుంచి తిరుపతి అగ్రహారంలోని గీతం కాలేజీకి చదువుకోసం వచ్చిన జశ్వంత్ హాస్టల్ నుంచి బయటకు వెళ్లి మాయమవ్వడం వెనుక ఏదైనా కుట్ర ఉందా? అన్న కోణంలో ఇప్పుడు చర్చ సాగుతోంది. మార్చి 11న వెళ్లిన జశ్వంత్ కనీసం ఫైనల్ ఎగ్జామ్ రాయడానికైనా వస్తాడని భావించిన పోలీసులు, కుటుంబ సభ్యులకు నిరాశే ఎదురైంది. పరీక్షకు కూడా జశ్వంత్ గైర్హాజరు కావడంతో ఈ మిస్టరీ మరింతగా ముదిరింది.
మరోవైపు వెదురుకుప్పం మండలం బంధార్లపల్లి సమీపంలోని మేకల బండ పైన గుర్తు తెలియని శవం కాల్చివేతపై పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తే 16 నుంచి 18 సంవత్సరాల బాలుడి శవంగా గుర్తించారు. గుర్తించలేని స్థితిలో కాల్చి చంపిన బాలుడి శవం వద్ద, శవం కాలిన ప్రదేశంలో నల్లటి పూసలు 10, ఎర్రటి పూసలు ఉన్నాయి. అవి చేతికి ధరించే బ్యాండ్‌గా గుర్తించారు. వీటి ఆధారంగా ఎవరైనా వాటిని గుర్తుపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పత్రికా ప్రకటన విడుదల చేశారు. అయితే ఇప్పటివరకు జీడీ నెల్లూరు హత్య విషయంపై కానీ, తిరుచానూరులో మిస్సింగ్ అయిన యువకుడు కేసు విషయంలో కానీ దర్యాప్తులో ఎలాంటి ముందడుగు పడకపోవడంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
