Chennai: పట్టపగలే దారుణం.. బిర్యానీ సెంటర్‌ క్యాషియర్‌పై కత్తులతో దాడి, నగదు లూటీ..!

Chennai

Chennai

Chennai Crime: చెన్నై నగరంలో పట్టపగలే ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. రాయపేట ప్రాంతంలోని ప్రముఖ చార్మినార్ బిర్యానీ సెంటర్‌లోకి చొరబడిన దుండగులు కత్తులతో విరుచుకుపడ్డారు. కౌంటర్‌లో ఉన్న క్యాషియర్‌పై విచక్షణారహితంగా, అత్యంత క్రూరంగా దాడికి పాల్పడ్డారు. అనంతరం క్యాష్ కౌంటర్‌లోని నగదును దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు. పట్టపగలు బహిరంగంగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది.

అయితే ఈ దారుణ దాడికి దారితీసిన కారణాలు విస్మయం కలిగిస్తున్నాయి. హోటల్‌లో సర్వ్ చేసిన బ్రెడ్ హల్వా రుచి బాగాలేదంటూ సదరు యువకులు సిబ్బందితో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఆ చిన్నపాటి గొడవ చిలికి చిలికి గాలివానలా మారి, చివరకు ప్రాణాంతక దాడికి దారితీసిందని తెలుస్తోంది. మాటమాట పెరగడంతో దుండగులు కత్తులు తీసి నేరుగా క్యాషియర్‌పై దాడి చేసి, దుకాణంలోని నగదును లూటీ చేశారు.

ఈ దాడికి సంబంధించిన భయానక దృశ్యాలు రెస్టారెంట్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో నగరవాసులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు.. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.