Site icon NTV Telugu

Madhyapradesh Bus Accident: ఘోరప్రమాదం.. నదిలో పడిపోయిన బస్సు, 13 మంది దుర్మరణం

Bus Accident

Bus Accident

Madhyapradesh Bus Accident: మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం ఖాల్‌ఘాట్ దగ్గర సంజయ్ సేతుపై నుంచి మహారాష్ట్ర ఆర్టీసీకి చెందిన బస్సు నర్మదా నదిలో పడిపోయిన ఘటనలో దాదాపు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. బస్సు అదుపుతప్పి వంతెన రైలింగ్‌ను ఢీకొని నదిలో పడిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఇండోర్ నుంచి పుణె వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 50 నుంచి 55 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం.

Telangana Rains: తెలంగాణను వీడని వానలు. నేడు భారీ వర్షాలు

సమాచారమందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 13 మృతదేహాలను సిబ్బంది వెలికితీశారు. మిగతా వారి కోసం గాలింపు చేపట్టారు. ఇప్పటివరకు 15మందిని ప్రమాదం నుంచి రక్షించారు. గాయాలపాలైన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 15 మందిని కాపాడినట్లు, మిగతావారి కోసం గాలింపు చేపట్టినట్లు రాష్ట్ర మంత్రి నరోత్తమ్ మిశ్రా వెల్లడించారు.

ఇప్పటి వరకు 13 మృతదేహాలను వెలికి తీశారని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందన్నారు. మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎంతో మాట్లాడానన్నారు. తాము సాధ్యమైనంత వరకు సహాయక చర్యలు చేపట్టామని, ప్రమాదానికి సంబంధించి విచారణకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించాలని మంత్రి కమల్ పటేల్‌ను కూడా ఆదేశించామని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు.

ధార్‌ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వారి బంధువులకు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రమాదం ధార్‌ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం మహారాష్ట ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. తాను జిల్లా కలెక్టర్, అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు.

మరోవైపు ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు జరుగుతున్నాయని.. స్థానిక అధికారులు ఈ ఘటనలో బాధితులకు అన్ని రకాల సాయాన్ని అందిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

 

 

Exit mobile version