Site icon NTV Telugu

Bride Cancels Wedding: తాళి కట్టే టైంలో వరుడి మెలిక.. పెళ్లికొడుక్కే షాకిచ్చిన వధువు

Untitled Design (15)

Untitled Design (15)

లక్షల కట్నం ఇవ్వాలంటూ తాళి కట్టే వేళ వరుడు మెలిక పెట్టగా, అతడికి ఊహించని రీతిలో వధువు గట్టి షాక్ ఇచ్చింది. బ్రెజ్జా కారు, రూ.20 లక్షల నగదు కట్నంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, లేకపోతే పెళ్లిని ఆపేస్తానని వరుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో వధువు అందరి ముందే పెళ్లి రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే… ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీ నగరంలోని సదర్ బజార్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఘనంగా వివాహ వేడుక జరుగుతోంది. వ్యాపారవేత్త అయిన వరుడు రిషబ్ బారాత్‌తో యుగ్వీనా లైబ్రరీ సమీపంలోని వివాహ మండపానికి చేరుకున్నాడు. అన్నీ సజావుగా సాగుతున్నట్లు కనిపించగా, తాళి కట్టే కొన్ని నిమిషాల ముందు మండపంలో ఒక్కసారిగా కలకలం రేగింది.

వరుడు రిషబ్ తనకు బ్రెజ్జా కారు మరియు రూ.20 లక్షల నగదు కట్నంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తన డిమాండ్లు నెరవేర్చకపోతే పెళ్లిని రద్దు చేస్తానని వధువు కుటుంబాన్ని బెదిరించాడు. ఈ విషయాన్ని వధువు తండ్రి మురళీ మనోహర్ వెల్లడించారు. వరుడిని ఎంతగా ఒప్పించేందుకు ప్రయత్నించినా అతడు వెనక్కి తగ్గలేదని ఆయన తెలిపారు.

ఈ విషయం వధువు ఇంద్రపాల్‌కు తెలియడంతో ఆమె తీవ్రంగా స్పందించింది. తన కుటుంబాన్ని అవమానపరిచే వ్యక్తితో జీవితాన్ని కొనసాగించలేనని స్పష్టం చేస్తూ, అందరి సమక్షంలోనే పెళ్లిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తన కుటుంబ నిస్సహాయతను చూసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపింది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వరుడు రిషబ్‌తో పాటు అతని తండ్రి రామ్ అవతార్, బావమరిది సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Exit mobile version