Site icon NTV Telugu

Boyfriend Crime: ప్రియురాలికి బూతు మెసేజ్‌లు.. హత్య కేసులో ప్రియుడు అరెస్ట్

Man Killed Friend

Man Killed Friend

Boyfriend Killed His Friend For Sending Vulgar Messages To His Girlfriend: హైదరాబాద్‌‌లో దారుణం చోటు చేసుకుంది. తన ప్రియురాలికి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిస్తున్నాడని.. తన స్నేహితుడ్నే చంపేశాడు ప్రియుడు. విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడు కానీ, చివరికి పోలీసులకు అతడు అడ్డంగా దొరికిపోయాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. శంకర్, మణికంఠ స్నేహితులు. వీళ్లు కూకట్‌పల్లిలో ఉంటున్నారు. శంకర్ కొంతకాలం నుంచి ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ అమ్మాయితో మణికంఠ కూడా సరదాగా మాట్లాడేవాడు. మెసేజ్‌లు సైతం పంపేవాడు. అయితే.. కొన్ని రోజుల నుంచి అతడు ఆ అమ్మాయికి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపించడం మొదలుపెట్టాడు. తనకు అలాంటి బూతు మెసేజ్‌లు పెట్టొద్దని ఆ యువతి వారించినా.. మణికంఠ వినలేదు.

దీంతో.. చిర్రెత్తుకొచ్చిన యువతి, ఆ మెసేజ్‌ల విషయాన్ని తన ప్రియుడు శంకర్‌కి తెలియజేసింది. ఆ మెసేజ్‌లు చూసి శంకర్‌కి కోసం నషాళానికి ఎక్కింది. స్నేహితుడే ఇలాంటి పని చేస్తాడని అతడు నమ్మలేకపోయాడు. దాంతో.. మణికంఠని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు ఒక పక్కా ప్లాన్ వేసుకున్నాడు. గత శుక్రవారం మందు తాగుదామని మణికంఠని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ కూర్చొని ఇద్దరూ బీర్లు తాగారు. ఈ నేపథ్యంలోనే తన ప్రియురాలికి పంపిన మెసేజ్‌ల గురించి శంకర్ ప్రస్తావించాడు. ఆ అంశంపై మాటామాటా పెరిగి, గొడవ పడ్డారు. అప్పుడు శంకర్ బీర్ బాటిల్‌ని పగలగొట్టి.. దాంతో పొడిచి మణికంఠని చంపేశాడు. అనంతరం తనకేమీ ఎరుగనట్టుగా.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

కట్ చేస్తే.. ఈ హత్య గురించి తెలుసుకున్న పోలీసులు, రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. శంకర్‌తో కలిసి మణికంఠ మద్యం సేవించిన విషయం తెలిసి.. శంకర్‌ని పిలిపించారు. తాము మద్యం సేవిస్తున్న సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడి చేశారని.. తాము ప్రతిఘటించడంతో మణికంఠని చంపేశారని కట్టుకథ అల్లాడు. అయితే.. అతడు పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో, పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించారు. అప్పుడు శంకర్ నేరం అంగీకరించాడు. తన ప్రియురాలికి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపినందుకే మణికంఠని చంపానని ఒప్పుకున్నాడు. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి, రిమాండ్‌కి తరలించారు.

Exit mobile version