ముంబైలోని బోరివాలి రైల్వే స్టేషన్ లో 35 ఏళ్ల వ్యక్తి లోకల్ ట్రైన్ లోని మహిళల కంపార్ట్మెంట్లో విన్యాసాలు చేసి, మహిళలను వేధిస్తున్నాడు. దీంతో రైల్వే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. లోకల్ ట్రైన్ లోని మహిళల కంపార్ట్మెంట్ లో విన్యాసాలు చేస్తూ.. మహిళలను ఇబ్బంది పెడుతున్న నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడు గుజరాత్‌లోని వల్సాద్ నివాసి నాథు గోవింద్ హంసాగా గుర్తించినట్లు బోరివాలి రైల్వే పోలీసులు వెల్లడించారు. లోకల్ రైలులో హంస మహిళలను వేధిస్తున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అతడిని అరెస్ట్ చేశారు పోలీసులు. మహిళల కంపార్ట్‌మెంట్ పక్కన ఉన్న లగేజీ సెక్షన్ ఫుట్‌బోర్డ్‌పై నిందితుడు ప్రయాణిస్తున్నట్లు వీడియో కనిపించింది. ఓ ప్రయాణీకుడు ఈ సంఘటనను తమ మొబైల్ ఫోన్‌లో బంధించాడు, తరువాత ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మహిళా ప్రయాణికుల భద్రత అత్యంత ప్రాధాన్యత అని రైల్వే పోలీసు అధికారులు తెలిపారు. ఇలాంటి ఘటనలను సహించమని నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకునేలా అటువంటి సంఘటనలు ఏవైనా జరిగితే వెంటనే నివేదించాలని వారు ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.
