NTV Telugu Site icon

BMW Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 230 KMPH వేగంతో లారీని ఢీకొట్టిన కారు

Bmw Car Accident

Bmw Car Accident

BMW Accident That Killed Four In Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గంటకు 230 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు.. ఓ కంటైనర్‌ ట్రక్కును ఢీకొట్టింది. అతివేగంతో ఢీ కొట్టడంతో.. కారు మొత్తం తునాతునకలైంది. దీంతో.. అందులో ఉన్న నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌లో గత శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో వెళ్లాలన్న ఉద్దేశంతో.. వేగం పెంచాల్సిందిగా డ్రైవింగ్ సీట్‌లో కూర్చున్న తమ స్నేహితుడ్ని పక్కన కూర్చున్న వ్యక్తి ఒత్తిడి తెచ్చాడు. దీంతో అతడు క్రమంగా వేగం పెంచుకుంటూ పోయాడు. 230 కీలోమీటర్ల వేగానికి బండి వచ్చినప్పుడు.. అదుపు తప్పింది.

ఈ ప్రమాదం సంభవించడానికి ముందు.. కారులో నలుగురు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తొలుత సాధారణ వేగంలోనే డ్రైవింగ్ సీట్‌లో కూర్చున్న వ్యక్తి కారు నడుపుతుండగా.. పక్క సీట్‌లో ఉన్న స్నేహితుడు ‘‘మనం లైవ్‌లో ఉన్నాం. 300 కిలోమీటర్ల వేగంతో డ్రైవ్‌ చేయు’’ అని అన్నాడు. మరీ అంత వేగంతో వెళ్తే, మనమంతా చనిపోతామని మరో వ్యక్తి చెప్పగా.. మీరంతా సైలెంట్‌గా ఉంటే నేను డ్రైవ్ చేయగలనంటూ డ్రైవింగ్ సీట్‌లో కూర్చున్న వ్యక్తి పేర్కొన్నాడు. ఒక దశలో కారు వేగాన్ని తగ్గించగా.. వీడియో తీస్తున్న వ్యక్తి ‘‘ఎందుకు వేగం తగ్గిస్తున్నావ్? మనం మళ్లీ పిక్‌అప్ అవ్వలేము, ఇదిగో ఇప్పుడు దారి మొత్తం ఖాళీగా ఉంది, త్వరగా వేగం పెంచు’’ అంటూ రెచ్చగొట్టాడు. దీంతో.. డ్రైవ్ చేస్తున్న వ్యక్తి చెలరేగిపోయి, 300 కిలోమీటర్ల వేగాన్ని అందుకునేందుకు ప్రయత్నించాడు.

కానీ.. 230 కిలోమీటర్ల వేగానికి చేరుకున్నప్పుడు, బీఎండబ్ల్యూ కారు అదుపు తప్పింది. కంటైనర్ ట్రక్కును ఢీకొట్టగానే.. కారు ఇంజిన్‌ పేలిపోయింది. అందులో కూర్చున్న వ్యక్తులు కొన్ని మీటర్ల దూరంగా ఎగిరిపడి, అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒకరు డాక్టర్‌, మరొకరు ఇంజినీర్‌ కాగా.. మరో ఇద్దరు వ్యాపారులు తేలింది. అయితే.. ఘటన సమయంలో వాళ్లు మద్యం సేవించారా? లేదా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు.. ఘటన తర్వాత కంటైనర్‌ ట్రక్ డ్రైవర్ పారిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.