NTV Telugu Site icon

Exam Chit Took Boys Life: పరీక్ష చిట్టీని లవ్ లెటర్ అనుకున్న అమ్మాయి.. బాలుడి హత్య

Exam Chit Took Boys

Exam Chit Took Boys

Bihar Boy Killed By Brothers Of Girl Who Mistook Exam Chit For Love Letter: బీహార్‌లో ఓ దారుణమైన సంఘటన వెలుగు చూసింది. ఓ పరీక్ష చిట్టీ ఒక బాలుడి ప్రాణాల్ని బలిగొంది. తన అక్కకు సహాయం చేద్దామని పరీక్ష చిట్టీ విసిరిన పాపానికి.. అతడు హత్యకు గురయ్యాడు. ఒక అమ్మాయి ఆ పరీక్ష చిట్టీని లవ్ లెటర్‌గా పొరబడటం వల్లే.. ఈ విషాదం చోటు చేసుకుంది. గత వారం భోజ్‌పూర్ జిల్లాలో జరిగిన ఆ ఘటన ఆ వివరాల్లోకి వెళ్తే..

ఉద్వంత్ నగర్‌కు చెందిన దయాకుమార్ (12) అనే బాలుడు ఐదో తరగతి చదువుతున్నాడు. గత వారం ఆరవ తరగతి చదువుతున్న తన సోదరిని పరీక్ష నిమిత్తం.. పరీక్ష కేంద్రం వద్ద డ్రాప్ చేశాడు. సోదరి సరిగ్గా చదవకపోవడంతో, ఆమెకు సహాయం చేయాలని అనుకున్నాడు. ఆమె పరీక్ష రాస్తుండగా.. ఒక చిట్టీని ఎగ్జామ్ హాల్‌లో విసిరాడు. అయితే.. ఆ చిట్టీ మరో అమ్మాయి వద్ద పడింది. ఆ అమ్మాయి మాత్రం దాన్ని ప్రేమలేఖగా పొరబడింది. తన సోదరులు స్కూల్ వద్దకు రాగానే.. ఆ చిట్టీ చూపిస్తూ, దయాకుమార్ తనకు ప్రేమలేఖ రాశాడని చెప్పింది. వాళ్లు కూడా ఆ చిట్టీలో ఏముందో చూడకుండానే.. తమ సోదరి మాట విని దయాకుమార్‌ను చితకబాదారు.

తాను రాసింది లవ్ లెటర్ కాదని.. అది కేవలం పరీక్ష చిట్టీ అని.. తన సోదరి కోసం విసిరిన ఆ చిట్టీ పొరపాటున మీ సోదరి వద్దకు చేరుకుందని చెప్తున్నా.. ఆ ఇద్దరు పట్టించుకోకుండా ఘోరంగా కొట్టారు. ఆపై అతడ్ని కిడ్నాప్ చేశారు. ఈ ఘటన గురించి దయాకుమార్ సోదరి తన కుటుంబ సభ్యులు తెలిపింది. వాళ్లు అతని కోసం గాలించడంతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. కట్ చేస్తే.. నాలుగు రోజుల తర్వాత ఓ గ్రామస్తుడికి స్థానిక ఆలయం వద్ద తెగిపడి ఉన్న చెయ్యి కనిపించింది. అతడు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటన స్థలానికి చేరుకొని, గాలింపు చర్యలు చేపట్టి, మిగతా భాగాల్ని వెతికిపట్టారు.

అనంతరం.. కుటుంబ సభ్యుల్ని పిలిపించి, ఆ భాగాలను చూపించగా.. అవి తమ దయాకుమార్ మృతదేహమేనని వాళ్లు ధృవీకరించారు. దీంతో అతడు హత్యకు గురైనట్లు వెల్లడైంది. ఈ ఘటనతో బాలుడి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ హత్యకు పాల్పడినట్టుగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో కొందరు బాలురు కూడా ఉండటం గమనార్హం. ఆ చిట్టీని అప్పుడే తెరిచి చూసి ఉంటే, ఇంత ఘోరం జరిగేది కదా!

Show comments