AP Crime: ఏపీలో బంగ్లా విద్యార్థినిపై అత్యాచారయత్నం.. తప్పించుకునే క్రమంలో నిందితుడు మృతి

Delhirape

Delhirape

AP Crime: ఆంధ్రప్రదేశ్‌లో బంగ్లాదేశ్‌కి చెందిన విద్యార్థినిపై అత్యాచారయత్నం ఘటన విషాదంగా మారింది.. అనకాపల్లి జిల్లా అచ్చుతాపురంలో బంగ్లాదేశ్‌కు చెందిన ఓ విద్యార్థినిపై అత్యాచారయత్నం జరిగిన ఘటన కలకలం రేపింది. బాధితురాలు కాకినాడలో బీఫార్మసీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. గత పది రోజులుగా అచ్చుతాపురంలోని స్నేహితుడి ఇంట్లో ఉంటోంది. స్నేహితుడు ఫార్మా కంపెనీలో విధులకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, అదే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న కమలేష్‌ యాదవ్‌ (43) ఒంటరిగా ఉన్న యువతిపై కన్నేశాడు. బాత్రూమ్‌ క్లీన్‌ చేస్తానని చెప్పి ఆమె ఉంటున్న ఇంట్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. అనంతరం యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడినట్లు సమాచారం.

అయితే యువతి అతడిని తీవ్రంగా ప్రతిఘటించి, అక్కడి నుంచి తప్పించుకుంది. అనంతరం జరిగిన విషయాన్ని స్థానికులకు తెలియజేసింది. దీంతో భయపడిన కమలేష్‌ యాదవ్‌ గోడ దూకి తప్పించుకునేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, నిందితుడి మృతి పరిస్థితులపై కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.