Tamilnadu: తమిళనాడు బాలికల ఆత్మహత్యలు ఆవేదన కలిగిస్తున్నాయి. తమిళనాడులో కడలూర్ జిల్లాలో మంగళవారం 12వ తరగతి చదువుతున్న మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. రాష్ట్రంలో రెండు వారాల్లోనే ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పన్నెండో తరగతి చదువుతున్న మైనర్ బాలిక మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె రాసిన నాలుగు పేజీల సూసైడ్ నోట్‌లో తాను ఐఏఎస్ చదవాలని తనపై తన తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, అయితే తాను వారి ఆకాంక్షలను నెరవేర్చలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. తల్లి మందలించడంతో బాలిక మనస్తాపానికి గురైందని పోలీసులు తెలిపారు. బాలికకు సంబంధించిన బంధువులు పోలీసులకు సమాచారం అందజేయకుండా ఆమె అంత్యక్రియలను నిర్వహించేందుకు ప్రయత్నించారు. అయితే ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రయత్నాలను ఆపి, ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి పంపించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
ఇటీవల ఇదే రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు రేకిత్తించిన కల్లకురిచ్చి, కిలాచేరి విద్యార్థుల మృతి ఘటనలు మరవకముందే ఇది చోటుచేసుకుంది. పక్షం రోజుల వ్యవధిలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం తమిళనాడులో కలకలం రేపుతోంది. తిరువళ్లూరు జిల్లాలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని సోమవారం ఉదయం ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలోని హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. తిరుత్తణికి చెందిన 17 ఏళ్ల బాలిక తిరువళ్లూరు జిల్లా కిలాచేరి గ్రామంలోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో చదువుతోంది. మప్పేడు పోలీసులు కేసు నమోదు చేసి.. అనంతరం ఈ కేసును సీబీసీఐడీకి బదిలీ చేశారు. మద్రాస్ హైకోర్టు తీర్పు ప్రకారం, విద్యా సంస్థలో ఏదైనా మరణం సంభవించినట్లయితే సీబీ-సీఐడీ ద్వారా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది.
రాష్ట్రంలోని కళ్లకురిచ్చిలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఉపాధ్యాయుల చిత్రహింసలకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కొద్ది రోజులకే ఈ ఘటన చోటు చేసుకుంది. కళ్లకురుచ్చిలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో హాస్టల్‌పై నుంచి దూకి విద్యార్థిని మృతి చెందడంతో జిల్లాలో హింసాత్మక నిరసనలు చోటుచేసుకోవడంతో సేలం పోలీసులు పాఠశాల, ఇతర ప్రాంతాల చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించాల్సి వచ్చింది. హింసను ప్రేరేపించింది ఎవరో తేల్చాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
Farooq Abdullah: మనీలాండరింగ్ కేసులో ఫరూక్ అబ్దుల్లాపై ఛార్జిషీట్ దాఖలు
ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ ఆత్మహత్య ఘటనలపై స్పందించారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలను విడనాడాలని విద్యార్థినులను కోరారు. కష్టాలను విజయాలుగా మార్చుకోవాలని కోరారు. విద్యార్థినులపై లైంగిక, మానసిక, శారీరక వేధింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.