ఒక మహిళను రక్షించే బాధ్యత.. ఆమెను ఎవరైతే బయటకి తీసుకువెళ్తారో వారిదే అని న్యాయస్థానం తెగేసి చెప్పింది. అమ్మాయి బయటికి ఎవరితో వెళ్తుంది.. తండ్రి, అన్న, స్నేహితుడు, భర్త, బాయ్ ఫ్రెండ్.. ఇలా ఎవరైతే ఆమెను బయటికి తీసుకెళ్లారో.. మళ్లీ ఆమె గమ్యస్థానానికి తిరిగివచ్చేవరకు అమ్మాయి పక్కనున్న వ్యక్తిదే బాధ్యత అని తెలిపింది. సాముహిక అత్యాచారం కేసులో ప్రియుడు వేసిన బెయిల్ పిటిషన్ పై అలహాబాద్ హైకోర్టు ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక అమ్మాయి అంగీకారంతో శృంగారం పాల్గొనడం తప్పు కాదు.. కానీ, అది భారతీయ వ్యవస్దతలో అనైతికం అని పేర్కొన్న కోర్టు.. తమకోసం వచ్చిన అమ్మాయి గౌరవ మర్యాదలను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించాలని తెలిపింది.
గతేడాది ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్ లో మైనర్ బాలికపై అత్యాచారం ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కౌశాంబి జిల్లాకు చెందిన 15ఏళ్ల బాలిక కుట్టు మెషిన్ నేర్చుకోవడానికి వెళ్లి వస్తూ మధ్యలో తన ప్రియుడు రాజును కలిసింది. ఈ నేపథ్యంలోనే వారిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు రాజును కొట్టి, బంధించి బాలికపై అత్యాచారం చేసి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులతో పాటు రాజును కూడా అరెస్ట్ చేశారు. దీంతో రాజు ఈ ఘటనకు, తనకు ఎలాంటి సంబంధం లేదని, తనకు బెయిల్ మంజూరు చేయవలసిందిగా హైకోర్టు ను వేడుకోగా.. నాయస్థానం పై వ్యాఖ్యలు చేసింది. ప్రియురాలిని కాపాడాల్సిన బాధ్యత ప్రియుడికి ఉందని, తన కళ్లముందే అంతటి దారుణం జరుగుతున్నా ప్రియుడు ప్రేక్షక పాత్ర వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం ఇందులో ప్రియుడు తప్పు కూడా ఉందని తెలిపింది. అంతేకాకుండా నిందితులతో ప్రియుడుకు పరిచయం ఉందో, లేదో చెప్పలేని కారణంగా అతడికి బెయిల్ ని నిరాకరిస్తున్నట్లు తెలిపింది.
