NTV Telugu Site icon

Mumbai: నాన్‌ వెజ్‌ కోసం ప్రియుడితో ఘర్షణ.. సీఎంతో సత్కారం పొందిన మహిళా పైలట్‌ మృతి!

Srishtituli

Srishtituli

వారిద్దరూ పైలట్లు.. ట్రైనింగ్ సమయంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. అలా రెండేళ్ల నుంచి ఇద్దరి మధ్య బంధం కొనసాగుతోంది. ఆమెకు నాన్-వెజ్ అంటే ఇష్టం.. అతడికేమో వెజ్ అంటే ఇష్టం. కానీ అదే వారిని బద్ద శత్రువులుగా చేసింది. చివరికి ఒకరి ప్రాణం తీసింది. ఈ ఘోరం ముంబైలో చోటుచేసుకుంది. అసలేం జరిగింది. ప్రాణాలు ఎందుకు పోయాయి? ఈ వివరాలు తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

ముంబైకి చెందిన సృష్టి తులి (25), ఢిల్లీకి చెందిన ఆదిత్య పండిట్ (27) ఇద్దరూ ప్రేమికులు. కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ (సీపీఎల్‌) కోసం శిక్షణ పొందుతున్న సమయంలో వీరిద్దరూ రెండేళ్ల క్రితం ఢిల్లీలో కలుసుకున్నారు. వారి స్నేహం ప్రేమగా మారింది. శిక్షణ తీసుకుంటున్న సమయంలో సృష్టి తులి ఢిల్లీలోని ద్వారకలో ఉండేది. శిక్షణ తర్వాత ఆమె ఎయిరిండియాలో ఉద్యోగం సంపాదించింది. ఉద్యోగంలో భాగంగా జూన్ 2023లో ముంబైకి వెళ్లింది.

అయితే నాన్-వెజ్ ఫుడ్ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అందరి ముందు.. బహిరంగంగా ఆదిత్య దుర్భాషలాడుతుండేవాడు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యేది. ఇలా పలుమార్లు నాన్ వెజ్ విషయంలో ఘర్షణ జరుగుతూనే ఉండేది. అయితే సోమవారం తెల్లవారుజామున ముంబైలోని అంధేరి (తూర్పు)లోని మారోల్ పోలీస్ క్యాంప్ వెనుక ఉన్న ఇంట్లో సృష్టి తులి శవమై కనిపించింది. తులిని ప్రియుడు ఆదిత్య చంపేశాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మాంసాహారం విషయంలో ప్రియుడు వేధిస్తుంటాడని వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆదిత్య పండిట్ వేధింపుల కారణంగానే ఆమె మానసికంగా కుంగిపోయిందని ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.

ఆదివారం తులి-పండిట్ మధ్య ఇంట్లో తీవ్ర వాగ్వాదం జరిగిందని పోలీసులు తెలిపారు. గొడవ జరిగిన తర్వాత అర్ధరాత్రి ఒంటి గంటకు ఆదిత్య ఢిల్లీ బయల్దేరి వెళ్లాడని.. ఇంతలో తులి ఫోన్ చేసి హెచ్చరించిందన్నారు. భయంతో ఆదిత్య ఇంటికి వచ్చి చూడగా.. తలుపులు వేసి ఉన్నాయని.. వాచ్‌మన్ సాయంతో తలుపులు పగలగొట్టి చూడగా ఆమె ఆత్మహత్య చేసుకుందన్నారు. వెంటనే మరోల్‌లోని సెవెన్స్ హిల్స్ ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. అనంతరం పండిట్.. తులి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు.

తులి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 108 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కింద పండిట్‌ను అరెస్టు చేసినట్లు పోవై పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ జితేంద్ర సోనావానే తెలిపారు. నిందితుడిని మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. నాలుగు రోజుల పోలీసు కస్టడీకి రిమాండ్‌కు తీసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్ చెప్పారు.

గోరఖ్‌పూర్‌లో ఉంటున్న బాధితురాలి కుటుంబ సభ్యులు.. తులి శవమై కనిపించడాన్ని చూసి దు:ఖంలో మునిగిపోయారు. మాంసాహారం విషయంలో బహిరంగంగా ప్రియుడి పెట్టిన వేధింపులకే తులి చనిపోయిందని ఆరోపించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. తులి మరణానికి ఆత్మహత్య కారణమని పోస్టుమార్టం రిపోర్టులో తేలిందని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫోన్‌ను ల్యాబ్‌కు పంపించామని.. కుటుంబ సభ్యుల నుంచి కూడా స్టేట్‌మెంట్లు రికార్డ్ చేస్తామని చెప్పారు.

తులి మేనమామ వివేక్‌కుమార్ మాట్లాడుతూ.. సహోద్యోగులు, స్నేహితుల మధ్య తులిని ప్రియుడు దారుణంగా వేధించేవాడని వాపోయాడు. పండిట్ సోదరి నిశ్చితార్థానికి తులి వెళ్లకపోవడంతో వేధింపులు మరింత ఎక్కువయ్యాయని తెలిపాడు. దాదాపు 10 రోజుల పాటు పండిట్.. తులితో మాట్లాడలేదన్నాడు. తులిని ప్రియుడు మానసికంగా వేధించడం వల్లే ఈ ఘోరం జరిగిందన్నారు. ఓ సారి పార్టీలో మాంసాహార తిన్నందుకు తులిపై దాడికి తెగబడ్డాడని తెలిపాడు. తులి కారును డ్యామేజ్ చేసి మార్గమధ్యలో వదిలేసి వెళ్లిపోయాడని చెప్పారు. తులి.. పండిట్‌ను చాలా ప్రేమించిందని.. కానీ అతడు మాత్రం దారుణంగా వేధించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివేక్ కుమార్ తెలిపాడు.

ఇదిలా ఉంటే తులి ఆదివారం పని ముగించుకుని ఇంటికి వచ్చిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఆమె తల్లితో కూడా ఫోన్‌లో మాట్లాడింది. అప్పుడు కూల్‌గానే ఉంది. ఎలాంటి ఆందోళన కనిపించలేదని.. పండిట్‌తో వాగ్వాదం తర్వాతే తులి చనిపోయిందని వివేక్ కుమార్‌ పేర్కొన్నాడు. తులి గోరఖ్‌పూర్‌కు చెందిన మొదటి మహిళా పైలట్ కావడంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సత్కరించారని గుర్తుచేశారు. బుధవారం గోరఖ్‌పూర్‌లో దహన సంస్కారాలు పూర్తయ్యాయని.. వందలాది మంది నివాళులర్పించారని వివేక్‌కుమార్ అన్నారు.