Looting bride: వరసగా పెళ్లిళ్లు చేసుకుంటూ, యువకుల్ని మోసం చేస్తున్న ఓ కిలాడీ లేడీ పట్టుబడింది. ఇప్పటివరకు ఈమె మొత్తం 25 పెళ్లిళ్లు చేసుకున్నట్లు తేలింది. అనురాధ పాశ్వాన్(32) అనే మహిళ నిత్య పెళ్లికూతురుగా మారింది. పెళ్లిళ్లు చేసుకుంటూ, వరుల వద్ద నుంచి విలువైన ఆభరణాలు, నగదు దొంగలించి ఉడాయించడం ఈమె స్టైల్. మొత్తం 25 మంది పురుషులను వివాహాలు చేసుకుని మోసగించినట్లు తేలింది. ఒక పెళ్లి చేసుకున్న తర్వాత, మరో పెళ్లి సమయానికి ఆమె తన పేరును, ఐడెంటిటీని మార్చుకుంటుంది.
Read Also: Jyoti Malhotra: “భారత్ ఏజెంట్ల”ను గుర్తించేందుకు పాకిస్తాన్‌కి సాయం చేసిన జ్యోతి మల్హోత్రా.!
అయితే, రాజస్థాన్ సవాయ్ మాధోపూర్ పోలీసులు అనురాధ పాశ్వాన్‌ని పట్టుకునేందుకు ఆమె స్టైల్‌లోనే ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. ముందుగా, ‘‘తమది పేద కుటుంబం అని, తనకు నిరుద్యోగ సోదరుడు ఉన్నాడని, తాను వివాహానికి సిద్ధంగా ఉన్నానని, కానీ ఆర్థిక పరిస్థితులు బాగాలేవు’’ అని నటిస్తుంది. ఈ మొత్తం మోసంలో ఈమెకు పెద్ద ముఠానే ఉంది. ఈ ముఠానే ముందుగా వరుడు వద్దకు అనురాధ ఫోటోలను తీసుకుని వెళ్తారు. ఈ ముఠాలో బ్రోకర్‌గా నటించే వ్యక్తి, పెళ్లి సెట్ చేయడానికి రూ. 2 లక్షలు వసూలు చేస్తాడు, ఆ తర్వాత నుంచి అనురాధ నటనతో పెళ్లికొడుకు, వారి తల్లిదండ్రుల నమ్మకాన్ని పొందుతుంది. ఆ తర్వాత ఆ కుటుంబంలోని ప్రతీ వ్యక్తితో పరిచయాన్ని పెంచుకుంటుంది.
కొన్ని రోజుల తర్వాత ఆమె తన ప్రణాళికలో భాగంగా ఆహారంలో మత్తు మందు కలిపి, ఆ ఇంటి నుంచి నగలు, నగదు, ఇతర విలువైన వస్తువులతో పారిపోతుంది. 25 మంది బాధితుల్లో ఒకరైన విష్ణు శర్మ కూడా ఒకరు. ఏప్రిల్ 20న, సవాయి మాధోపూర్ నివాసి విష్ణు శర్మ, మధ్యప్రదేశ్‌కు చెందిన అనురాధ పాశ్వాన్‌ను వివాహం చేసుకున్నాడు. బ్రోకర్ పప్పూ మీనాకు రూ. 2 లక్షలు చెల్లించాడు. వివాహం చేసుకున్న రెండు వారాల్లోనే అనురాధ రూ. 1.25 లక్షల విలువైన ఆభరణాలు, రూ. 30,000 నగదు, విలువైన సెల్‌ఫోన్‌తో పారిపోయింది. పోలీసులకు విష్ణు శర్మ ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సవాయ్ మాధోపూర్ పోలీసులు, ఒక కానిస్టేబుల్‌కి వరుడిగా నటింపచేసి, అనురాధను పట్టుకున్నారు. భోపాల్‌లో ఆమెను అరెస్ట్ చేశారు.
