రోజురోజుకు ఆడవారిపై అఘాయిత్యాలు ఎక్కువై పోతున్నాయి. కామ వాంఛలతో రగిలిపోతూ కొంతమంది మగాళ్లు మృగాళ్ళుగా మారి మహిళలను వేధిస్తున్నారు. ఇక ఈ వేధించేవారిలో ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులు ఉండడం సమాజానికి సిగ్గు చేటుగా మారింది. తాజాగా గుంటూరులో ఓ కానిస్టేబుల్ కామ క్రీడలు బయటపడ్డాయి. మహిళను లొంగదీసుకోవడమే కాకుండా ఆమె కూతురిపై కూడా కన్నేసి, ఆమెపై కూడా అత్యాచారానికి పాల్పడడానికి ప్రయత్నించిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది.
వివరాలలోకి వెళితే.. గుంటూరులోని ప్రభుత్వ మహిళా సర్వజన ఆసుపత్రిలో ఒక మహిళ ఆయాగా పనిచేస్తోంది. ఆమె భర్త కొన్నేళ్ల క్రితం మృతి చెందడంతో ఒక కుమార్తె, ఇద్దరు కుమారులతో కలిసి నివాసముంటోంది. ఇక ఈ నేపథ్యంలోనే జీజీహెచ్ కి వచ్చే ఒక కానిస్టేబుల్ తో ఆమెకు పరిచయమయ్యింది. అనంతరం వారిద్దరూ స్నేహితులుగా మారారు. ఒకరోజు కానిస్టేబుల్, ఆయా ఇంటికి వెళ్లి, ఎవరు లేని సమయంలో ఆమెను లొంగదీసుకున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెపితే లేనిపోని కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తానని బెదిరించాడు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆయా, కానిస్టేబుల్ ఆగడాలను బయట ఎక్కడ చెప్పలేదు. దీంతో రెచ్చిపోయిన అతను ఇంకా వారిని వేధించడం మొదలుపెట్టాడు.
ఇంట్లోనే మందు తాగుతూ, మహిళ కూతురిని కూడా అసభ్యంగా మాట్లాడేవాడు. దీంతో విసిగిపోయిన మహిళ.. కానిస్టేబుల్ బాగోతాలను పై అధికారులకు చెప్తానని బెదిరించడంతో.. ఆమెను నమ్మించడానికి రెండేళ్ల క్రితం ఒక గుడిలో ఆమె మెడలో తాళికట్టి పెళ్లి చేసుకున్నాడు. అయినా అతనిలో మార్పు రాలేదు. చివరికి రెండో భార్య కూతురు పై కానిస్టేబుల్ కన్ను పడింది. వరుసకు కూతురు అవుతుంది అన్న విచక్షణ కూడా మరిచి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమెతో అసభ్యంగా మాట్లాడడం, అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఈ విషయాన్ని బాలిక.. తల్లికి చెప్పింది. ఇక అతగాడి ఆగడాలను తట్టుకోలేని మహిళ గుంటూరు అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. ప్రజలను కాపాడాల్సిన పోలీసులే ఇలాంటి పనులు చేయడం ఏంటి..? అని స్థానికులు దుమ్మెత్తిపోస్తున్నారు. కానిస్టేబుల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తున్నారు.
