A Minor Girl In Hyderabad Died For Mobile Phone After Fight With Her Sister: సెల్‌ఫోన్.. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇది నిత్యవసరం అయిపోయింది. ఇది లేకపోతే రోజు గడవదన్నట్టుగా పరిస్థితులు మారాయి. చాలామంది ముఖ్యమైన పనుల కోసం మొబైల్ ఫోన్లను వాడుతారు. అయితే.. యువత మాత్రం కాలక్షేపం కోసమే వీటిని వినియోగిస్తారు. షార్ట్ వీడియోలు చేసుకోవడం.. సోషల్ మీడియాలో న్యూస్ ఫీడ్ చూసుకోవడం లాంటివి చేస్తుంటారు. ఒక్కసారి అలవాటు పడితే, ఇక అంతే సంగతులు. పూర్తిగా అడిక్ట్ అయిపోతారు. కాసేపు చేతిలో ఫోన్ లేకపోయినా, ఏదో విలువైన వస్తువే పోగొట్టుకున్న భావన కలుగుతుంటుంది. అదే ఓ మైనర్ బాలిక ప్రాణాల్ని తీసింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్‌లోని కుషాయిగూడ కట్టింగ్ కాలనీకి చెందిన ఓ మేస్త్రికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒక అమ్మాయి (17) ఇంటర్ చదివింది. కొన్నాళ్ల క్రితం ఓ ప్రైవేటు ఉద్యోగంలో చేరిన ఆ అమ్మాయి.. తనకొచ్చిన జీతంలో నుంచి కొన్ని డబ్బులు జమ చేసుకొని, ఇటీవల ఒక మొబైల్ ఫోన్ కొనుగోలు చేసింది. ఆమెతో పాటు ఆమె చెల్లెలు కూడా ఆ ఫోన్‌ని వినియోగిస్తుంది. ఇంట్లో ఉన్నది అదొక్క ఫోనే కావడంతో.. అక్కాచెల్లెళ్లు ఇద్దరూ దాన్ని వాడుతున్నారు. అప్పుడప్పుడు ఫోన్ విషయమై గొడవ ఏర్పడేది. సోమవారం మరోసారి వీరి మధ్య ఘర్షణ నెలకొంది. అప్పుడు అక్క ‘నీకెందుకు ఫోన్, అంత అవసరం ఏముంది?’ అంటూ కాస్త గట్టిగానే మందలించింది. దీంతో మనస్తాపం చెందిన చెల్లి.. చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుషాయిగూడ ఠాణాలో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
