A Child Died In Road Accident In Ranga Reddy: ఈమధ్య తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. డ్రైవర్లు నిర్లక్ష్యంగా, అతివేగంగా నడుపుతుండడం వల్లే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ శేరిగూడలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక చిన్నారి బలి అయ్యింది. ఇద్దరు చిన్నారులు నడుచుకుంటూ వెళ్తుండగా.. ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు వారిపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో కాజల్ (12) అనే అమ్మాయి మృతి చెందగా.. అభిషేక్ (08) అనే మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన చిన్నారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ఆ ఇద్దరు చిన్నారులు కిరాణా షాప్‌కు వెళ్తుండగా.. ఒక్కసారిగా ఆ ప్రైవేట్ స్కూల్ బస్సు దూసుకొచ్చి, వారిని ఢీకొట్టింది. దీంతో.. కాజల్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ చిన్నారి.. పొట్టి కూటి కోసం ఇక్కడికొచ్చి ఒక రైస్ మిల్‌లో పని చేస్తోన్న వలస కార్మికుల కుటుంబానికి చెందినదిగా తేలింది. చిన్నారి మృతితో వలస కార్మికుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారి కుటుంభ సభ్యులు, బంధువులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. బాధితుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో.. రోడ్డుపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
