MP Horror: మధ్యప్రదేశ్ ఉమారియా జిల్లాలో దారుణం జరిగింది. వరకట్నం కోసం 7 నెలల గర్భిణిని ఆమె భర్త, అత్తామామలు దారుణంగా చంపేశారు. శుక్రవారం రోజు ఈ ఘటన జరిగింది. నిందితులు బాధితురాలిని కట్నం కోసం గత కొంతకాలంగా వేధిస్తున్నారు. ఆమె భర్తతో పాటు అత్తామామలు, ఇద్దరు ఆడపడచులపై కేసు నమోదు చేశారు.
Read Also: Asteroid: భూమికి సమీపంగా వస్తున్న గ్రహశకలం.. నాసా ఏం చెబుతుందంటే..
మరణించిన బాధితురాలిని ఉమారియాకు చెందిన షాలినీ గౌతమ్‌గా గుర్తించారు. నిందితులను భర్త శ్రీకాంత్ గౌతమ్, అత్తామామలు రామ్ కిషోర్ గౌతమ్, నిర్మలా గౌతమ్, ఆడపడచులు రజనీ, నండోయ్ ఖేమ్‌రాజ్‌గా గుర్తించారు. శుక్రవారం మధ్యాహ్నం 3.27 గంటలకు తమ కూతురు చనిపోయిందని ఫోన్ వచ్చినట్లు షాలినీ తల్లిదండ్రులు తెలిపారు. తాము వారి ఇంటికి వెళ్లి చూసేసరికి తన కూతురి చేతులు, కాళ్లు బిగుసుకుపోయి ఉన్నాయని, మంటల్లో శరీరం మొత్తం కాలిపోయిందని వారు వెల్లడించారు.
బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. షాలినీ అత్తామమాలపై ఫిర్యాదు చేశారు. షాలీనిని వరకట్నం కోసం వేధిస్తున్నారని, వారే ఆమెని తగలబెట్టారని అనుమానం వ్యక్తం చేశారు. నిందితులపై చండియా పోలీస్ స్టేషన్ లో బీఎన్‌ఎస్ సెక్షన్ 103 (1), 80, 85 కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు.