25 Year Old Woman Arrested For Throwing Acid On Lover Wife: తమ ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో, అమ్మాయిలపై అబ్బాయిలు యాసిడ్ దాడులు చేసిన సంఘటనల్ని మనం ఎన్నో చూశాం. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘటనలో అందుకు భిన్నంగా దాడి చేసింది. ఆల్రెడీ పెళ్లైన ఓ మగాడితో ఎఫైర్ పెట్టుకున్న ఒక యువతి.. అతని భార్య, కొడుకుపై యాసిడ్ దాడి చేసింది. ఈ దాడిలో వాళ్లిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన.. తీవ్ర కలకలం రేపుతోంది.
ఆ వివరాల్లోకి వెళ్తే.. నాగ్‌పూర్‌లోని వినోబా భావే నగర్‌లో శనివారం సాయంత్రం ఓ మహిళ తన రెండున్నరేళ్ల కొడుకుని ఎత్తుకొని, ఇంటి ముందే నడుస్తోంది. అదే సమయంలో ఒక స్కూటీలో బుర్ఖా వేసుకున్న ఇద్దరు మహిళలు వచ్చారు. సరిగ్గా ఆ మహిళ వద్దకు రాగానే.. వెనుక సీట్‌లో కూర్చున్న 25 ఏళ్ల యువతి, తనతో పాటు తెచ్చుకున్న యాసిడ్‌ను ఒక్కసారిగా ఆ తల్లికొడుకులపై పోసింది. ఈ ఘటనలో తీవ్రంగా తల్లికొడుకు తీవ్రంగా గాయపడ్డారు. ఆ యువతి మళ్లీ ఎక్కడా తమపై యాసిడ్ దాడి చేస్తుందన్న భయంతో.. తల్లి తన కొడుకుని తీసుకొని వెంటనే ఇంట్లోకి పరిగెత్తింది. మరోవైపు.. స్కూటీలో వచ్చిన ఆ ఇద్దరు అమ్మాయిలు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
దాడి చేసిన యువతి.. బాధితురాలి భర్త మాజీ ప్రియురాలని తేలింది. పెళ్లికి ముందు ఆ మహిళ భర్తతో ఆ యువతి ప్రేమాయణం కొనసాగించింది. పరిస్థితులు అనుకూలించకపోవడంతో వాళ్లు పెళ్లి చేసుకోలేదు. అయితే.. అతనికి పెళ్లైనా ఆ యువతి అతనితో రిలేషన్‌షిప్ కంటిన్యూ చేసింది. ఈ విషయం భార్యకు తెలియడంతో.. ఆమె యువతిని నిలదీసింది. తన భర్తని కలవొద్దని వార్నింగ్ ఇచ్చింది. ఆ కోపంతోనే ఆ యువతి ఈ దాడికి పాల్పడినట్టు తేలింది. సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ లొకేషన్ ఆధారంగా.. పోలీసులు ఆ యువతిని అరెస్ట్ చేశారు. అయితే.. ఈ యువతికి మద్దతు ఇచ్చిన యువతి మాత్రం పరారీలో ఉంది. ఆమె కోసం గాలిస్తున్నారు.
ఈ ఘటనపై యశోద నగర్ పోలీసులు మాట్లాడుతూ.. ‘‘దాడి చేసిన యువతి, బాధితురాలి భర్తతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయంపై బాధితురాలు, నిందితురాలి మధ్య కొంతకాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం కూడా వీరి మధ్య గొడవ జరగడంతో.. నిందితురాలు పగ పెంచుకుంది. తన స్నేహితురాలి సహాయంతో.. బాధితురాలు, ఆమె కుమారుడిపై యాసిడ్ దాడి చేసింది. బాధితులను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నాం. ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి’’ అని చెప్పుకొచ్చారు.
