NTV Telugu Site icon

రివ్యూ: తిమ్మరుసు

Thimmarusu Movie Review

గత యేడాది కరోనా కారణంగా థియేటర్లు మూతపడినప్పుడు ఏ హీరో సినిమాలు ఎక్కువగా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి? అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు సత్యదేవ్. అతను నటించిన ’47 డేస్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, గువ్వ గోరింక’ చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యాయి. అంతేకాదు… ఈ యేడాది ‘పిట్ట కథలు’ ఆంధాలజీలోనూ సత్యదేవ్ నటించాడు. విశేషం ఏమంటే… కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు తెరచుకోగానే విడుదలైన సినిమా కూడా సత్యదేవ్ దే కావడం! లాయర్ రామచంద్రగా సత్యదేవ్ నటించిన ‘తిమ్మరుసు’ చిత్రం శుక్రవారం జనం ముందుకు వచ్చింది.

కథ విషయానికి వస్తే లాయర్ రామచంద్ర (సత్యదేవ్)కు కోర్ట్ అంటే దేవాలయంతో సమానం. అక్కడ సత్యం గెలవాలన్నదే అతని ఆకాంక్ష. ధనార్జన గురించి పట్టించుకోకుండా, ప్రమాదాలను లెక్కచేయకుండా ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా సిద్ధపడతాడు. అలాంటి రామచంద్ర చేతికి ఎనిమిదేళ్ళ క్రితం జరిగిన ఓ యాక్సిడెంట్ కేసు వస్తుంది. బార్ లో పనిచేసే వాసు (అంకిత్) అనే కుర్రాడు ఓ రోజు రాత్రి నడిరోడ్డు మీద క్యాబ్ డ్రైవర్ ను ఒకరు చంపడం చూసి, పోలీసులకు ఫోన్ చేస్తాడు. తీరా పోలీసులు ఆ కుర్రాడే ఈ హత్య చేసినట్టు సాక్ష్యాలు సృష్టించి, దోషిగా కోర్టుబోనులో నిలబెడతారు. ఎనిమిదేళ్ళు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన అతని మెడకు, కొత్త సమస్యలు చుట్టుకుంటాయి. వాసు తల్లి సహాయం అర్థించడంతో ఆ కేసును రామచంద్ర టేకప్ చేస్తాడు. క్యాబ్ డ్రైవర్ ను ఎవరు చంపారు? వాసును ఆ కేసులో ఎందుకు ఇరికించారు? చేయని హత్యను వాసు ఎందుకు అంగీకరించాడు? ఈ కేసు విషయంలో ఎదురైన సమస్యలను రామచంద్ర ఎలా అధిగమించాడు? అన్నదే మిగతా కథ.

కన్నడలో ఎం. జి. శ్రీనివాస్ తెరకెక్కించిన ‘బీర్బల్’ సినిమాకు ఇది రీమేక్. మాతృకతో పోల్చితే తెలుగు వర్షన్ చాలా బెటర్ గా ఉంది. పైగా అక్కడ ఈ సినిమాను మూడు భాగాలుగా తీయాలని ముందే నిర్ణయించుకుని ‘బీర్బల్’ క్లయిమాక్స్ ను అసంపూర్ణంగా వదిలేశారు. కానీ ‘తిమ్మరుసు’ దగ్గరకు వచ్చేసరికీ దీనిని పూర్తి స్థాయి సినిమాలా తీశారు. అనవసరమైన సన్నివేశాలను తొలగించి, కథ చకచకా సాగేలా చేశారు. అక్కడతో పోల్చితే మేకింగ్ వాల్యూస్ ఇక్కడ బాగున్నాయి. ముఖ్యంగా తెలుగుదనం కోసం దర్శక రచయితలు శరణ్ కొప్పిశెట్టి, వేదవ్యాస్ చేసిన కృషి టైటిల్ విషయంలోనే కనిపించింది. ‘బీర్బల్’ తెలుగు వాళ్ళకూ సుపరిచితమైన పేరే అని, దానినే పెట్టేయకుండా ‘తిమ్మరుసు’ అని పెట్టడం అభినందనీయం.

ఇక కథలోని అంశాల విషయానికి వెళితే, హీరో రామచంద్ర లాయర్ అనే కంటే డిటెక్టివ్ అనడం కరెక్ట్. డిటెక్టివ్ కు తక్కువ – లాయర్ కు ఎక్కువ అన్నట్టుగా అతని పాత్ర సాగుతుంది. సినిమా కథను నాలుగైదు డైమన్షన్స్ లో చెప్పడం అనేది ఆసక్తికరంగానే ఉన్నా, చూసిన సన్నివేశాలనే మళ్ళీ మళ్ళీ చూడటం కొంత బోర్ కొట్టిస్తుంది. ఇక హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ ఆసక్తికరంగా లేదు. హీరోయిన్ లోని స్వార్థానికి, ఆ తర్వాత ఆమెలో మార్పు రావడానికి బలమైన కారణాలు చూపలేదు. సినిమాలో కాస్తంత రిలీఫ్ అంటే బ్రహ్మాజీ అందించిన కామెడీనే! వైవా హర్ష నుండి కామెడీ ఎక్స్ పెక్ట్ చేసే వాళ్ళకు అతను పోషించిన పాత్ర నిరాశనే కలిగిస్తుంది. పోలీస్ ఆఫీసర్ భూపతిగా అజయ్ ఫిట్ గా లేడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా రవిబాబు, జడ్జిగా జయశ్రీ రాచకొండ నటించారు. మరో పోలీస్ పాత్రలో ప్రవీణ్, వాసుగా అంకిత్, అతని తల్లిగా ఝాన్సీ చక్కగా నటించారు. ’30 వెడ్స్ 21′ ఫేమ్ చైతన్యరావ్ ఇందులో హీరో అన్నయ్య పాత్ర పోషించాడు. హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ లాయర్ పాత్రలో అంతగా నప్పలేదు. క్లోజప్ షాట్స్ లో ఆమెను చూడటం కాస్తంత కష్టమే. ఓవర్ ఆల్ గా సినిమా మొత్తాన్ని సత్యదేవ్ తన భుజాలకెత్తుకుని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేశాడు.

శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం, అప్పు ప్రభాకర్ సినిమాటోగ్రఫీ సన్నివేశాలను ఎలివేట్ చేశాయి. తిమ్మరాజు ఎడిటింగ్ బాగుంది. దర్శకుడు శరణ్‌ కొప్పిశెట్టికి ఇది రెండో సినిమా. చిత్రం ఏమంటే… అతని మొదటి సినిమా ‘కిర్రాక్ పార్టీ’ కూడా కన్నడ చిత్రానికి రీమేకే. తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాలని నిర్మాతలు మహేశ్ కోనేరు, ఎర్రబోలు సృజన్ మంచి ప్రయత్నమే చేసినా, ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ కోర్టు డ్రామాలు కొన్ని ఇప్పటికే రావడంతో ప్రేక్షకులు పూర్తి స్థాయిలో సంతృప్తిని పొందలేదు. ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగానే ఉన్నా, సెకండ్ హాఫ్ కు వచ్చేసరికీ గ్రాఫ్ కొంత డౌన్ అయ్యింది. అయితే క్లయిమాక్స్ లోని ట్విస్ట్ ప్రేక్షకులకు కొంతలో కొంత సంతృప్తిని కలిగించే అంశం. కోర్టు డ్రామాస్, థ్రిల్లర్ జానర్స్ ను ఇష్టపడే వారికి ‘తిమ్మరుసు’ నచ్చుతుంది.

రేటింగ్: 2.5 / 5

ప్లస్ పాయింట్స్
సత్యదేవ్ నటన
ఎంచుకున్న పాయింట్
ప్రొడక్షన్ వాల్యూస్
శ్రీచరణ్ నేపథ్య సంగీతం

మైనెస్ పాయింట్
తేలిపోయిన విలన్ క్యారెక్టర్
బోర్ కొట్టించే ద్వితీయార్థం

ట్యాగ్ లైన్: తికమక పెట్టే ‘తిమ్మరుసు’

Show comments