NTV Telugu Site icon

Review : డి.జె. టిల్లు

Dj-Tillu

ప్రవీణ్ సత్తార్ ‘లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ (ఎల్.బి.డబ్ల్యూ’)’ తో టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ మీద అందరి దృష్టీ పడింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలోనే వచ్చిన ‘గుంటూరు టాకీస్’తో సిద్ధూ మాస్ హీరోగా జనంలోకి వెళ్ళిపోయాడు. ఇక రెండేళ్ళ క్రితం రిలీజ్ అయిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’తో అతనిలోని అదర్ క్వాలిటీస్ కూడా బయట పడ్డాయి. ఇప్పుడు మరోసారి మల్టీటాలెంట్ ను ప్రదర్శిస్తూ సిద్ధు చేసిన సినిమా ‘డీజే టిల్లు’. నిజానికి ఈ సినిమాకు మొదట ‘నరుడి బ్రతుకు నటన’ అనే పేరు పెట్టారు బట్ ట్రెండీగా ఉండాలని ‘డీజే టిల్లు’గా మార్చారు. అది తెలివైన నిర్ణయం అనిపిస్తోంది. ఈ మూవీ శనివారం జనం ముందుకొచ్చింది.

డీజే టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ) పేరుకు తగ్గట్టే డీజే. మనవాడి చేష్టలంటే తండ్రికి పరమ చిరాకు. ఎప్పుడూ కొడుకును తిడుతూనే ఉంటాడు. ఒక రోజు క్లబ్ లో పాటలు పాడే సింగర్ రాధిక (నేహాశెట్టి)తో టిల్లుకు పరిచయం అవుతుంది. ఆమె అందచందాలకు టిల్లు ఫ్లాటైపోతాడు. కానీ అప్పటికే రాధికకు రోహిత్ (కిరిటీ దామరాజు) అనే బోయ్ ప్రెండ్‌ ఉంటాడు. అతను తనను మోసం చేస్తున్నాడని గ్రహించిన రాధిక బ్రేకప్ చెప్పాలనుకుంటుంది. కానీ అది కాస్త ఊహించని వయొలెన్స్ కు దారి తీస్తుంది. రాధిక చేసిన ఆ నేరంలో డీజే టిల్లు సైతం సంబంధం లేకుండా ఇరుక్కుంటాడు. అందులోంచి వారిద్దరూ ఎలా బయట పడ్డారు? రాధికను టిల్లు సిన్సియర్ గా లవ్ చేసినట్టు, రాధిక కూడా అతన్నినిజంగా ఇష్టపడుతుందా? టిల్లుని ఎక్కడిక్కడ సమస్యల్లోకి నెట్టిసి, తను తెలివిగా ఎందుకు ఎస్కేప్ అవుతుంది? ఆమె మోసాన్ని టిల్లు గ్రహించాడా? మరి టిట్ ఫర్ ట్యాట్ గా ఏ నిర్ణయం తీసుకున్నాడు? అన్నదే ‘డీజే టిల్లు’ కథ.

గత మార్చిలో వచ్చిన ‘జాతిరత్నాలు’ను మనవాళ్ళు అంత తేలిగ్గా మర్చిపోరు. అంతగా ఆ సినిమా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసింది. లాజిక్కులు పక్కన పెట్టి రెండున్నర గంటల పాటు ఆ సినిమాను జనం ఎంజాయ్ చేశారు. ఇది కూడా ఓ రకంగా అలాంటి కాన్సెప్ట్ తోనే సాగింది. ఒకరిపై ఒకరికి నమ్మకంలేని ఓ ప్రేమజంట, అనుకోకుండా జరిగే హత్య, శవాన్ని దాచడానికి పడే తంటాలు, మధ్యలో వచ్చే బ్లాక్ మెయిలర్, పోలీసుల ఛేజింగ్… ఇవన్నీ ఆసక్తికరంగా ఉన్నాయి. అయితే ఆ సినిమాలోలా ఇందులోనూ ఓ కోర్టు సీన్ పెట్టారు. అక్కడ బ్రహ్మానందం జడ్జి పాత్ర పోషించి, వినోదాన్ని పండించే ప్రయత్నం చేస్తే… ఇక్కడ ప్రగతి ఆ బాధ్యతలు తీసుకుంది. కానీ న్యాయమూర్తులను, న్యాయస్థానాలను కించపరిచేలా సంభాషణలు ఉండటం బాధాకరం. ఎంత కామెడీ చిత్రమైనా, ప్రజలలో గౌరవాన్ని పెంచాల్సిన న్యాయ వ్యవస్థను తక్కువ చేసి చూపడం సబబు కాదు. ఇక సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ రేసీగా సాగింది. అయితే ద్వితీయార్థంలో మాత్రం కథ కాస్తంత అదుపు తప్పింది. ముగింపు కూడా హడావుడిగా తీసేసినట్టు అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఈ సినిమా విజయాన్నిదృష్టిలో పెట్టుకుని సీక్వెల్ కూడా తీసేలా ముగింపు ఇచ్చారు. మరి దానిని ప్రారంభించడమే తరువాయి.

సిన్సియర్ గా ప్రేమించిన అమ్మాయి చేతిలో వెధవను అవుతున్నానని తెలిసీ, సహకరించే ఫ్రస్ట్రేటెడ్ లవర్ గా సిద్ధు జొన్నలగడ్డ ఆ పాత్రకు జీవం పోశాడు. మరీ ముఖ్యంగా అతను నోటి నుండి వచ్చిన తెలంగాణ యాస అదిరిపోయింది. అతను చెప్పే ప్రతి డైలాగ్ థియేటర్లలో కుర్రకారుతో ఈలలు వేయించేలా ఉంది. కొన్ని సందర్భాలలో ఆ మాటలు హద్దులు మీరాయి. వినడానికి కాస్త ఇబ్బందినీ కలిగించాయి. యూత్ పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయొచ్చు కానీ ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఇందులో కొన్ని సన్నివేశాలు, సంభాషణలు ఇబ్బందికి గురి చేస్తాయి. వాటిని ఇంకొంచెం పాలిష్డ్ గా చూపించి ఉండాల్సింది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సొంత బ్యానర్ ‘ఫార్చ్యూన్ 4 సినిమాస్’ సైతం ఇందులో నిర్మాణ భాగస్వామి కాబట్టి… కాస్తంత సంస్కారాన్ని ప్రేక్షకులు ఆశించే ఆస్కారం ఉంది.

నటీనటుల విషయానికి వస్తే… ఇది సిద్దూ జొన్నలగడ్డ వన్ మ్యాన్ షో. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ తన భుజాల కెత్తుకుని మూవీని తీసుకెళ్లాడు. అతని హావభావాలతో పాటు డైలాగ్ మాడ్యులేషన్ సూపర్ గా సెట్ అయ్యింది. ఈ మధ్య కాలంలో ఇలా అలవోకగా సంభాషణలను చెబుతోంది ఒక్క ‘వెన్నెల’ కిశోర్ మాత్రమే. మళ్ళీ అంత అద్భుతమైన టాలెంట్ సిద్ధూలో కనిపించింది. కొన్ని సన్నివేశాలలో సిద్ధు జోర్దార్ గా డైలాగ్స్ చెబుతుంటే, ఓ రకంగా నేహాశెట్టి పాపం ఫ్రీజ్ అయినట్టే కనిపించింది. అయితే… ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఇక కిరిటీ దామరాజు, ప్రిన్స్, బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్, హీరో తల్లిదండ్రుల పాత్రలు పోషించిన వారూ చక్కగా డ్రామాను రక్తి కట్టించారు. శ్రీచరణ్‌ పాకాల, రామ్ మిర్యాల పాటలు మూవీ ఓపెనింగ్స్ కు బాగా హెల్ప్ అయ్యాయి. అలానే థియేటర్ కు వచ్చిన ఆడియెన్స్ ను తన నేపథ్య సంగీతంతో ఎస్. తమన్ మెస్మరైజ్ చేశాడు. సినిమాటోగ్రఫీ సైతం బాగుంది. తొలి చిత్రంతోనే దర్శకుడు విమల్ కృష్ణ తన సత్తా చాటుకున్నాడు. అందుకు సిద్ధూ రాసిన సంభాషణలూ ఎంతో తోడ్పడ్డాయి.

గత యేడాది సితార ఎంటర్ టైన్ మెంట్స్ నుండి వచ్చిన ‘రంగ్ దే’, ‘వరుడు కావలెను’ చిత్రాల టాక్ బాగున్నా, కరోనా కారణంగా ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు రాకపోవడంతో అనుకున్న విధంగా కమర్షియల్ సక్సెస్ కాలేదు. ఆ కసితోనే యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈసారి యూత్ ను టార్గెట్ చేస్తూ, కాస్తంత ఎక్కువ మసాలా యాడ్ చేసి ఈ నాన్ వెజ్ బిర్యానీ సర్వ్ చేసినట్టుగా ఉంది. అదే ఆయన ఆలోచన అయితే, ఆ విషయంలో టార్గెట్ రీచ్ అయినట్టే. లాజిక్కుల జోలికి పోకుండా ‘డీజే టిల్లు’ను చూస్తే, ఫన్ రైడ్ చేసిన అనుభూతి కలుగుతుంది.

రేటింగ్: 3.25 / 5

ప్లస్ పాయింట్స్
సిద్ధూ వన్ మ్యాన్ షో
ఆకట్టుకున్న డైలాగ్స్
రేసీ టేకింగ్
ప్రొడక్షన్ వాల్యూస్

మైనెస్ పాయింట్స్
బలహీనమైన కథ
టెంపో తగ్గిన ద్వితీయార్థం

ట్యాగ్ లైన్: టిల్లుగాడు ఫుల్ మాస్ గురూ!