NTV Telugu Site icon

Review : ఖిలాడి

khiladi

విడుదల తేదీ: 11-02-2022
నటీనటులు: రవితేజ, అర్జున్, రావు రమేశ్, మురళీశర్మ, వెన్నెల కిశోర్, సచిన్ కడేకర్, ఉన్ని ముకుందన్, ముఖేశ్ రుషి, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి, అనసూయ
సినిమాటోగ్రాఫర్: సుజిత్ వాసుదేవ్
సంగీతం: దేవిశ్రీప్రసాద్
నిర్మాత: కోనేరు సత్యనారాయణ
దర్శకత్వం: రమేశ్ వర్మ

గతేడాది క్రాక్తో హిట్ కొట్టిన ర‌వితేజ ఈ సంవత్సరం ఖిలాడిగా జనం ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు రమేశ్ వర్మ దర్శకుడు. దీనిని కోనేరు సత్యనారాయణ నిర్మించారు. ‘క్రాక్’ తర్వాత రవితేజ నటించిన చిత్రం కావటం, ‘రాక్షసుడు’ తర్వాత నిర్మాతలు తీస్తున్న సినిమా కావటంతో మంచి హైప్ వచ్చింది. దీనికి తోడు ట్రైలర్ కి మంచి స్పందన లభించటంతో రిలీజ్ కి ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి శుక్రవారం జనం ముందుకు వచ్చిన ఖిలాడికి ఎలాంటి స్పందన లభిస్తుందో చూద్దాం.

క‌థ విష‌యానికి వ‌స్తే సాధారణ కుటుంబానికి చెందిన గాంధీ (రవితేజ) హత్యానేరం కేసులో జైలుశిక్ష అనుభవిస్తుంటాడు. అతడు ఎందుకు హత్యలు చేశాడనే విషయాన్ని తెలుసుకోవడానికి సైకాలజీ స్టూడెంట్ మీనాక్షి చౌదరి ప్రయత్నిస్తూ ఉంటుంది. సిబిఐ కూడా ఇదే విషయమై వేటాడుతూ ఉంటుంది. హీరో చెప్పిన కథ నమ్మి మీనాక్షి తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి (సినిమాల్లోనే ఇలాంటివి జరుగుతుంటాయి) బెయిల్ ఏర్పాటు చేస్తుంది. సినిమా ఇంటర్వెల్ కి ముందు అది అంతా ఓ నాటకమని తేలుతుంది. ఇటలీ నుంచి ఇండియాకు కంటైనర్ లో వచ్చిన పదివేల కోట్ల కోసమే ఈ డ్రామా అని వెల్లడవుతుంది. గాంధీ డబ్బుకోసం ఏమైనా చేసే ‘ఖిలాడి’గా ఫోకస్ అవుతాడు. హోమ్ మినిస్టర్ (ముఖేశ్ రుషి) ని రాష్ట్రముఖ్యమంత్రి ని చేయటానికి ఉపయోగించవలసిన ఆ డబ్బు చేతులు మారుతుంది. అసలు ఆ డబ్బు ఎవరిది? హీరో ఎందకు ఆ కంటైనర్ వెనుక పడతాడు? చివరకు ఎవరు ఆ డబ్బును చేజిక్కించుకుంటారన్నదే కథాంశం.

ఈ తరహా పాత్రలు రవితేజకు కొట్టిన పిండి. దర్శకుడు రవితేజ పాత్రను డిజైన్ చేయటంలో తడబాటుకు గురయ్యాడు. ద్వితీయార్థంలో ఒక్క డైలాగ్ తో హీరోలోని పాజిటీవ్ యాంగిల్ ని చూపించే ప్రయత్నం చేశాడు. దాంతో ఆ పాత్ర ఔచిత్యం జనాలకు చేరనే లేదు. అసలు రవితేజ ఈ సినిమాలో ఏం కథ ఉందని అంగీకరించాడో అయనకే తెలియాలి. ‘క్రాక్’ తో పెరగిన రవితేజ ఇమేజ్ ఈ సినిమాతో అమాంతం పడిపోతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. వరుసగా ఇలాంటి సినిమాలే చేస్తే మళ్ళీ కెరీర్ ఒడిదుడుకుల్లో పడటం ఖాయం. ఈ సినిమా ప్రచారంలో కూడా రవితేజ పాల్గొనక పోవడం సినిమా ఫలితాన్ని రవితేజ ముందే ఊహించాడేమో అని కూడా అర్థం చేసుకోవచ్చు. మిగిలిన పాత్రధారుల్లో ఏ పాత్రకు తగిన న్యాయం జరగలేదు. ఎవరికి వారు చేశాం అంటే చేశాం అన్నట్లు తమ తమ పాత్రల పోషణ చేశారు.

ఇక దర్శకుడు రమేశ్ వర్మ టేగింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ‘రాక్షసుడు’ సినిమా తీసింది ఇతనేనా అనిపించక మానదు. సినిమా ఎంతకూ పూర్తి కాదే అని పలుమార్లు ప్రేక్షకులు తలలు పట్టుకుంటారు. చాలా సన్నివేశాలు పలు చిత్రాలలో పదే పదే చూసిన ఫీలింగ్ కలుగుతుంది. నిర్మాతలు మాత్రం సినిమా కోసం భారీగానే ఖర్చుపెట్టారు. దేవిశ్రీ సంగీతం కూడా సో… సో. ‘ఫుల్ కిక్, క్యాచ్ మి’ వంటి ఒకటి రెండు పాటలు పర్వాలేదనిపిస్తాయి. కథలో పస లేకపోవడంతో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతగా ఆనలేదు. సినిమాలో ఏ కోశానా వినోదం లేదు. ఇద్దరు హీరోయిన్లు ఉన్నప్పటికీ ఎవరితోనూ హీరో కెమిస్ట్రీ అంతగా వర్కవుట్ అయినట్లు అనిపించదు. అర్జున్ పోషించిన సి.బి.ఐ ఆఫీసర్ పాత్ర కూడా ఆయనకు రొటీన్. కంటైనర్ లో డబ్బు దొంగతనం అనే పాయింట్ మీద గతంలోనూ చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో లేని కొత్తదనం ఏమైనా ఉందా? అంటే శూన్యం అనే చెప్పాలి. పాతికేళ్ళకు ముందు మణిరత్నం తీసిన ‘దొంగ దొంగ’ సినిమా చూస్తే ఇన్నేళ్ళ తర్వాత కూడా రమేశ్ వర్మ ఆ సినిమా దరిదాపుల్లో కూడా తీయలేకపోయాడో అనిపించక మానదు.

ప్లస్ పాయింట్స్:
‘క్రాక్’ తర్వాత ర‌వితేజ సినిమా కావటం
సోలో రిలీజ్ కావటం

మైనస్ పాయింట్స్:
కొత్తద‌నం లేని కథాంశం
ఆకట్టుకోని కథనం
పేవలమైన టేకింగ్

రేటింగ్: 2/5

ట్యాగ్ లైన్ : ఈ ‘ఖిలాడి’ని భరించలేం