NTV Telugu Site icon

రివ్యూ: అనుభవించు రాజా

Anubhavinchu-Raja

Anubhavinchu-Raja

‘ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్’తో హ్యాట్రిక్ సాధించిన రాజ్ తరుణ్ కు ఆ తర్వాత ఆ స్థాయి విజయాన్ని మరే చిత్రమూ అందించలేకపోయింది. వైవిధ్యమైన కథలు చేస్తూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న రాజ్ తరుణ్‌ తాజా చిత్రం ‘అనుభవించు రాజా’. గతంలో అతనితోనే ‘సీతమ్మ అందాలు – రామయ్య సిత్రాలు’ సినిమాను రూపొందించిన శ్రీను గవిరెడ్డి ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి యార్లగడ్డ సుప్రియ నిర్మాత.

రాజు (రాజ్ తరుణ్) కోనసీమలో బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన కుర్రాడు. అతని కుటుంబ సభ్యులు అంతా చిన్నతనంలోనే ఓ యాక్సిడెంట్ లో చనిపోతారు. కడుపు కట్టుకుని కోట్లు సంపాదించిన అతని తాతయ్య కన్నుమూస్తూ ఓ జీవిత సత్యాన్ని రాజుకు బోధిస్తాడు. ధనార్జనే జీవితం కాకుండా దానిని ఎంచక్కా అనుభవించమని సలహా ఇస్తాడు. దాని పర్యావసానం ఏమిటీ? ఈ కోనసీమ కుర్రాడు పల్లెను వదిలి హైదరాబాద్ వచ్చి సెక్యూరిటీ గార్డ్ గా ఎందుకు పనిచేశాడు? ఈ మధ్యలో జరిగిన మర్డర్ కు రాజుకు సంబంధం ఏమిటీ? అనేది మిగతా కథ.

గ్రామీణ నేపథ్యంలో మొదలయ్యే ఈ సినిమా ఆ తర్వాత హైదరాబాద్ బాట పట్టింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రారంభమై, మధ్యలో ఓ ఊహించని హత్యతో థ్రిల్లర్ గా మారి హీరోను జైలుకూ పంపింది. ఆ హత్యకు సంబంధించిన అసలు నిజాలను హీరో బయటపెట్టి, తాను నిర్దోషినని నిరూపించడంతో శుభం కార్డు పడుతుంది. ఈ మధ్య కాలంలో రాజ్ తరుణ్ నటించిన సినిమాలతో పోల్చితే, ‘అనుభవించు రాజా’ బెటర్ మూవీ. హీరో పైలా పచ్చీస్ గా తిరగడానికి, అతని ప్రవర్తనకు ఓ బలమైన కారణాన్ని దర్శకుడు చూపించాడు. దానితో పాటు అతని జైలుశిక్ష, హైదరాబాద్ ప్రయాణం ఇవన్నీ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తాయి. అయితే ద్వితీయార్థంలో ప్రతినాయకుడు, అతని పగ పరమ రొటీన్ గా ఉండటంతో మూవీ గ్రాఫ్ పడిపోయింది. ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఫ్రెష్ నెస్ సెకండ్ హాఫ్ లో కరువైంది. నటీనటుల నటన, సాంకేతిక నిపుణుల పనితనం, ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాను ఓ మాదిరిగా నిలబెట్టాయి.

ఆర్టిస్టుల విషయానికి వస్తే రాజ్ తరుణ్‌ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో చక్కగా ఇమిడిపోయాడు. పల్లెటూరిలో దసరా బుల్లోడి తరహాలోనూ, సిటీలో సెక్యూరిటీ గార్డ్ గానూ మెప్పించాడు. అతను చేసిన పోరాటలు (రియల్ సతీశ్) సైతం సహజంగా ఉన్నాయి. హీరోయిన్ కశిష్‌ ఖాన్ కు ఇదే ఫస్ట్ ఫిల్మ్. తెర మీద అందంగా కనిపించింది. ఇతర ప్రధాన పాత్రలను అజయ్, భూపాల్, సుదర్శన్, పోసాని, ‘ఆడుకాలం’ నవీన్, బిగ్ బాస్ ఫేమ్ రవికృష్ణ, అరియానా, ‘టెంపర్’ వంశీ, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు పోషించారు. జబర్దస్త్ ఆర్టిస్టులూ తెర మీద మెరుపులా మెరిశారు. సంభాషణలు ఆకట్టుకున్నాయి. భాస్కరభట్ల రవికుమార్ రాసిన పాటలు అర్థవంతంగా ఉన్నాయి. గోపీసుందర్ స్వరాలు, నేపథ్యం సంగీతం బాగుంది. నగేశ్‌ బానెల్ సినిమాటోగ్రఫీ కనుల పండగలా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కు వంక పెట్టడానికి లేదు. జీవితాన్ని అనుభవించడం అంటే కేవలం తాను ఎంజాయ్ చేయడం కాదని, చుట్టుపక్కల ఉన్నవారిని సంతోషపెట్టాలనే సందేశాన్ని ఈ సినిమా ద్వారా దర్శకుడు ఇచ్చాడు. కానీ ఎంచుకున్న పాయింట్ ను కన్వెన్సింగ్ గా, బలంగా చూపించడంలో మాత్రం పూర్తి స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాడు. థియేటర్ నుండి బయటకు వచ్చే ప్రేక్షకుడికి ఏదో మిస్ అయ్యామనే భావనైతే కలుగుతుంది.

ప్లస్ పాయింట్స్
ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్
టెక్నీషియన్స్ పనితనం

మైనెస్ పాయింట్స్
పేలవమైన పతాక సన్నివేశం
ఉత్కంఠ రేపని ద్వితీయార్థం

రేటింగ్: 2.75/ 5

ట్యాగ్ లైన్: మరీ అంతలేదు!