NTV Telugu Site icon

రివ్యూ : శుక్ర

New Age Thriller Shukra Movie Review

ఆంధ్రప్రదేశ్ లో థియేటర్ల కెపాసిటీ 50 శాతానికి కుదించారు. తెలంగాణాలో రాత్రి కర్ఫ్యూ పెట్టారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కొత్త సినిమాలు అసలు విడుదలవుతాయా అనే సందేహం చాలామందిలో నెలకొంది. ‘వకీల్ సాబ్’ను థియేటర్లలో ఆడిస్తున్నప్పుడు తమ కొత్త సినిమాలను ఎందుకు రిలీజ్ చేయకూడదని ఒకరిద్దరు నిర్మాతలు భావించినట్టుగా ఉంది. అలా జనం ముందుకు శుక్రవారం వచ్చిన సినిమానే ‘శుక్ర’. సుకు పూర్వజ్ దర్శకత్వంలో అయ్యన్న నాయుడు నల్ల, తేజ పల్లె దీనిని నిర్మించారు.

కథ విషయానికి వస్తే… విల్లీ (అరవింద్ కృష్ణ), రియా (శ్రీజితా ఘోష్) భార్యభర్తలు. విల్లీ రకరకాల వ్యాపారాలు చేసి నష్టాల పాలవుతాడు. రియాకు మోడలింగ్, ఫ్యాషన్ షోస్ అంటే ఇష్టం. వీరిద్దరూ కలిసి వైజాగ్ వచ్చి, అక్కడ కొత్త కాపురం పెడతారు. అదే సమయంలో వైజాగ్ ను ఓ దోపిడి దొంగ ముఠా టార్గెట్ చేస్తుంది. ఊరికి దూరంగా ఉండే బంగ్లాలను రిక్కీ చేసి, అందులో వ్యక్తులను దోచుకోవడం, చంపేయడం చేస్తుంటుంది. వృత్తిపరంగా కాస్తంత బిజీ అయిన విల్లీ తన భార్య రియా కోరిక మేరకు ఆమె పుట్టిన రోజున ఇంట్లోనే పూల్ సైడ్ నైట్ పార్టీ ఏర్పాటు చేస్తాడు. వాళ్ళిద్దరి క్లోజ్ ఫ్రెండ్స్ జస్ట్ తొమ్మిది మందే దానికి హాజరవుతారు. కానీ చిత్రంగా మర్నాడు తెల్లవారే సరికీ ముగ్గురు హత్యకు గురవుతారు. అసలు ఆ రాత్రి అక్కడ ఏం జరిగింది? ఆ హత్యలకు కారకులు ఎవరు? విల్లీ ఇంటికి వచ్చి మరీ హత్యలు చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? వైజాగ్ లో తిష్టవేసిన దోపిడి దొంగల ముఠాకు ఈ హత్యలతో ఏమైనా సంబంధం ఉందా? అనేదే మిగతా కథ.

న్యూ ఏజ్ మూవీగా ప్రమోట్ చేసిన ‘శుక్ర’ నిజానికి థ్రిల్లర్ సినిమా. అంతే కాదు మర్డర్ మిస్టరీ కూడా! ఒకే భవనంలో దాదాపు సినిమా మొత్తం సాగుతుంది. హత్యలకు సంబంధించి ఇంటరాగేషన్, తద్వారా కొత్త పాత్రలు ప్రవేశించడంతో ద్వితీయార్ధం ఆసక్తికరంగా ఉంది. అయితే మూవీ చివరిలో చాలా అంశాలకు దర్శకుడు సమాధానం ఇవ్వకుండా ‘శుక్ర -2’లో చూసుకోండంటూ ముగించేయడం ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. నిజానికి ఇందులోని చాలా సన్నివేశాలు ఇటీవల కొన్ని సినిమాల్లో మనకు కనిపించినవే. థగ్స్ గ్యాంగ్స్ చేసే హత్యలు, అమానవీయ చర్యలపై కొన్ని సినిమాలు వచ్చాయి. అలానే ఇన్ హౌస్ నైట్ పార్టీలలో డ్రగ్స్ చోటు చేసుకోవడం, దాని పరిణామాలను కొన్ని చిత్రాలలో చూశాం. ఆ అంశాలకు కొత్తగా ఇందులో కోట్ల రూపాయల విలువచేసే డైమండ్స్ అంశాన్ని దర్శకుడు జత చేశాడు. సినిమా ప్రారంభం ఆస్తక్తికరంగానే ఉన్నా… ఆ తర్వాత అసలు కథ మొదలయ్యే సరికీ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్టు అవుతుంది. కథ ఎంత సేపటికీ ముందుకు పోదు… దర్శకుడు ముందే దీనిని రెండు భాగాలుగా తీయాలని ఫిక్స్ అయిపోవడం వల్ల కావచ్చు… మూవీ నత్తనడక నడుస్తుంది. అలా కాకుండా తాను చెప్పాలనుకున్న అంశాన్ని షార్ట్ అండ్ స్వీట్ గా ఒకే సినిమాగా దర్శకుడు చెప్పేసి ఉంటే ‘శుక్ర’ ఇంకాస్తంత బెటర్ మూవీ అయ్యి ఉండేది.

‘ఇట్స్ మై లవ్ స్టోరీ, రిషి, అడవి కాచిన వెన్నెల, మన కుర్రాళ్ళే’ వంటి భిన్నమైన కథా చిత్రాలలో నటించిన అరవింద్ కృష్ణకు ఇంకా బ్రేక్ రాలేదు. అయినా అతనిలోని క్రీడాకారుడు నిరాశ చెందనీయకుండా కొత్త ప్రయత్నాలు చేసేలా చేస్తున్నాడు. కాస్తంత గ్యాప్ తీసుకుని అరవింద్ ‘శుక్ర’లో నటించినా, ఇదేమంత గొప్ప ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అలానే హీరోయిన్ గా నటించిన శ్రీజితా ఘోష్ కేవలం గ్లామర్ డాల్ గానే మిగిలిపోయింది. మిగిలిన నటీనటుల నుండి కూడా దర్శకుడు సరైన విధంగా నటనను రాబట్టలేకపోయాడు. ద్వితీయార్థం మొదలైన కొద్ది సేపటికే మనకు మృతుల విషయంలో ఓ క్లారిటీ వచ్చేస్తుంది. జగదీశ్ బొమ్మిడి సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ఆశీర్వాద్ సంగీతం బాగుంది. సినిమాలో ఫ్లాట్ గా ఉన్న చాలా సన్నివేశాలు వీరిద్దరి ప్రతిభ కారణంగా కాస్తంత ఎలివేట్ అయ్యాయి. స్క్రిప్ట్ మీద దర్శకుడు మరికాస్తంత హోమ్ వర్క్ చేసి ఉండాల్సింది. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాల్సింది. కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఉపయోగం లేదు. దర్శకుడు సుకు పూర్వజ్ సీక్వెల్ మీద ఆశలు పెట్టుకున్నా… ఈ తొలి భాగం చూసిన వాళ్ళు, రెండో భాగం చూసే సాహసం చేయరు. ఇదంతా కాదు గానీ, అసలు దర్శకుడు ‘శుక్ర’ కథాంశాన్ని ఎంచక్కా వెబ్ సీరిస్ గా చేసి ఉంటే బాగుండేది!!

రేటింగ్ : 1.5 / 5

ప్లస్ పాయింట్స్
ఆశీర్వాద్ సంగీతం
జగదీశ్ సినిమాటోగ్రఫీ

మైనెస్ పాయింట్
కొత్తదనం లేని కథ
ఆకట్టుకోని కథనం
ఊహకందే క్లయిమాక్స్

ట్యాగ్ లైన్: ‘శుక్ర’ అనుగ్రహం లేదు!