NTV Telugu Site icon

రివ్యూ: నాట్యం

Natyam

సంప్రదాయ నృత్యం ప్రధానాంశంగా తెలుగులో వచ్చిన చిత్రాలు తక్కువనే చెప్పాలి. అందులో ఎక్కువ సినిమాలను కళాతపస్వి కె. విశ్వనాథ్ తెరకెక్కించడం విశేషం. మళ్ళీ ఇంతకాలానికి ఆ లోటును తీర్చుతూ ప్రముఖ నృత్య కళాకారిణి సంధ్యారాజు తానే నటించి, ‘నాట్యం’ చిత్రాన్ని నిర్మించారు. రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం జనం ముందుకు వచ్చింది.

నాట్యం అనే గ్రామానికి చెందిన కథ ఇది! కాదంబరి అనే నర్తకి జీవనగాథ ఇది!! భారతీయ నృత్యాన్ని సజీవంగా ఉంచడం కోసం ప్రాణం త్యాగం చేసిన కాదంబరి జీవితాన్ని నృత్య రూపకంగా అందించాలని నాట్యం గ్రామానికి చెందిన నాట్యాచారుడు (ఆదిత్య మీనన్) భావిస్తుంటాడు. కానీ ఆ ఊరి దేవాలయ ధర్మకర్త (శుభలేఖ సుధాకర్) కారణంగా అది కార్యరూపం దాల్చదు. అయితే గురువు గారి కలను సితార (సంధ్యారాజు) అనే అమ్మాయి ఎలా నెరవేర్చింది? కాదంబరి జీవితంలో మరుగున పడిన వాస్తవాలను, ఊరి జనాలకు తెలియచెప్పే క్రమంలో ఆమెకు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? వాటిని ఆమె ఎలా అధిగమించిందన్నదే ఈ చిత్ర కథ. నమ్మకం కంటే మూఢ నమ్మకం ఎంత బలంగా ఉంటుందో, దేవుడు సైతం ఆ మూఢ నమ్మకాన్ని ఎలా తొలగించలేడో ‘నాట్యం’ చిత్రం ద్వారా దర్శకుడు రేవంత్ తెలిపే ప్రయత్నం చేశాడు.

సినిమా పేరు ‘నాట్యం’ అని పెట్టడంతో ఇది నృత్య ప్రధాన చిత్రమనే విషయాన్ని ప్రజలకు దర్శకనిర్మాతలు తెలిపారు. పైగా సినిమా ప్రమోషన్ లో భాగంగా విడుదలచేసిన టీజర్, ట్రైలర్స్ లో నృత్యానికే ప్రాధాన్యమిచ్చారు. నిజానికి ఈ దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటానికి ప్రాణ త్యాగం చేసిన ఓ నృత్యకారిణికి సంబంధించిన కథ ఇది. అందువల్ల పలు భావోద్వేగాలకూ ఇందులో చోటు దక్కింది. ఈ దేశాన్ని బలహీనపర్చాలంటే ముందుగా ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలను నాశనం చేయాలని బ్రిటీషర్స్ భావించారు. అందుకే కళలను, కళలకు నిలయాలైన దేవాలయాలను ధ్వంసం చేశారు. ఆ క్రమంలో సంప్రదాయ నృత్యాన్ని ఓ గ్రామం నుండే తుడిచి వేయాలని చూసినప్పుడు కాదంబరి అనే యువతి తన ప్రాణాలను అడ్డు పెట్టి వాటిని ఎలా కాపాడింది, ఆ బ్రిటీష్‌ అధికారి మనసును ఎలా దోచుకుంది అనే అంశాన్నిఇందులో హృద్యంగా చూపించారు. విశేషం ఏమంటే దర్శక నిర్మాతలు తాము చెప్పదలుచుకున్న కథను నృత్యం ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.

ఇలాంటి నృత్య ప్రధాన చిత్రాలు అన్ని వర్గాలను ఆకట్టుకోవన్నది వాస్తవం. ‘నాట్యం’ కూడా అదే కోవకు చెందే చిత్రం. కళలపట్ల ఆసక్తి ఉన్న వారికి, నృత్యం లో ప్రవేశం ఉన్నవారికి ఇది నచ్చినట్టుగా మిగిలిన వారికి నచ్చకపోవచ్చు. కథలో కొత్తదనం కానీ ఊహించని మలుపులు కానీ లేవు. దాంతో సగటు ప్రేక్షకుడికి నిరుత్సాహం కూడా కలిగే ఆస్కారం ఉంది. అయితే… సినిమాను చూస్తున్నంత సేపు ఎక్కడా విసుగు మాత్రం పుట్టదు. దానికి ప్రధానకారణం సినిమాటోగ్రాఫర్ కమ్ ఎడిటర్ అయిన డైరెక్టర్ రేవంత్ కోరుకొండ పనితనం. అలానే శ్రవణ్‌ భరద్వాజ్ అందించిన నేపథ్య సంగీతం. ఇక మహేశ్ ఉప్పుటూరి ఆర్ట్ డైరెక్షన్, థండర్ స్టూడియోస్ వి.ఎఫ్.ఎక్స్. సినిమాను మరో స్థాయిలో నిల్చోపెట్టాయి. ప్రతి ఫ్రేమ్ కలర్‌ ఫుల్ గా ఉండటమే కాకుండా చాలా రిచ్ గా కనిపించింది. కరుణాకర్ పాటల సాహిత్యం అర్థవంతం, సందర్భానుసారంగా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఆసమ్!

నటీనటుల విషయానికి వస్తే… బేసికల్ గా నృత్య కళాకారిణి అయిన సంధ్యా రాజు సితార పాత్రలో ఒదిగిపోయారు. ఓ పక్క నిర్మాణ వ్యవహారాలను చూస్తూనే నటన, కొరియోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైనింగ్, కాస్ట్యూమ్ డిజైనింగ్ శాఖలను ఆమె నిర్వహించారంటే మాటలు కాదు. నాట్య కళ పట్ల ఆమెకున్న అంకిత భావమే ఇన్ని పనులు సమర్థవంతంగా చేయగలగడానికి కారణం అనుకోవాలి. ఈ మూవీకి సంబంధించి కమల్ కామరాజ్ ఓ స్పెషల్ సర్ప్రైజ్. గతంలో వైవిధ్యమైన పాత్రలు అతను ఎన్ని చేసినా… సినిమా ప్రారంభంలో వచ్చే అర్థనారీశ్వర నృత్యంలో కొన్ని చోట్ల సంధ్యారాజును సైతం తన నృత్య భంగిమలతో డామినేట్‌ చేశాడు. అతని పాత్రను ఇంకాస్తంత చక్కగా డిజైన్ చేసి ఉండాల్సింది. ఇక రోహిత్ బెహెల్ తెలుగువాడు కాకపోయినా…. పాత్రను అర్థం చేసుకుని చక్కని హావభావాలు పలికించాడు. నాట్యాచారుడిగా ఆదిత్య మీనన్, ఆలయ ధర్మకర్తగా ‘శుభలేఖ’ సుధాకర్, హీరోయిన్ తల్లిదండ్రులుగా భానుప్రియ, అప్పాజీ అంబరీశ నటించారు. నృత్య కళాకారిణి రుక్మిణి విజయ్ కుమార్, సుప్రియ ఐసోలా అతిథి పాత్రల్లో మెరిశారు.

కథను ఇంకాస్తంత విస్తారంగా రాసుకుని, మరింత ఆసక్తికరంగా తెరకెక్కించి ఉంటే బాగుండేది. అలానే కాదంబరి వృత్తాంతాన్ని ముందే రివీల్ చేయకుండా ఉండాల్సింది. నిజానికి ఈ చిత్రానికి ‘నాట్యం’ అనే పేరుకంటే ‘కాదంబరి’ అనే పేరు పెడితే, ప్రేక్షకులలో కొంత ఉత్సుకత పెరిగేది. ఏదేమైనా సంప్రదాయ నృత్యాన్ని, అందులో గొప్పతనాన్ని వెండితెరపై ఆవిష్కరించాలి అనుకున్న సంధ్యారాజు బృందాన్నిఅభినందించాలి. కళల పట్ల ఆసక్తి, అనురక్తి ఉన్న ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది.

ప్లస్ పాయింట్స్
నృత్య ప్రధాన చిత్రం కావడం
ప్రధాన తారాగణం నటన
సాంకేతిక విలువలు

మైనెస్ పాయింట్
ఆసక్తికరంగాలేని ప్రథమార్థం
ఊహకందే ముగింపు
బిగువు లేని కథనం

ట్యాగ్ లైన్: నాట్య పోషణ!

Show comments