NTV Telugu Site icon

రివ్యూ: లక్ష్య

Lakshya

Lakshya

యంగ్ హీరో నాగశౌర్య నటించిన 20వ చిత్రం ‘లక్ష్య’. కరోనా సెకండ్ వేవ్ తర్వాత వచ్చిన ‘వరుడు కావలెను’తో ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా దగ్గర అయిన నాగశౌర్య, ఈ స్పోర్ట్స్ డ్రామాతో యూత్ ను టార్గెట్ చేశాడు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నారాయణ దాస్ నారంగ్, పుస్కర్ రామ్మోహనరావు, శరత్ మరార్ నిర్మించిన ‘లక్ష్య’ ఇండియాలో తెరకెక్కిన తొలి ఆర్చరీ మూవీ కావడం విశేషం.

పార్థు (నాగశౌర్య) చిన్నప్పుడే తల్లిదండ్రులను యాక్సిడెంట్ లో కోల్పోతాడు. అప్పటి నుండి అన్నీ అతనికి తాతయ్య రఘు రామయ్యే (సచిన్ ఖేడేకర్). ఓ ఆర్చర్ గా తన కొడుకు సాధించలేదని మనవడు సాధించాలనే కోరికతో రఘురామయ్య ఉన్న ఆస్తులు అమ్మి పార్థును స్టేట్ లెవెల్ ఆర్చరీ ఛాంపియన్ ను చేస్తాడు. వరల్డ్ ఛాంపియన్ గానూ పార్థును చూడాలనుకున్న సమయంలో ఊహించని పరిణామాలతో పార్థు తప్పుదారి పడతాడు. తనలోని చెడును అతను ఎలా గెలిచాడు? విజేతగా ఎలా నిలబడ్డాడు? అందుకు అతని ప్రియురాలు రితికా (కేతిక శర్మ), పార్థసారథి (జగపతిబాబు) ఎలా బాసటగా నిలిచారన్నది మిగతా కథ.

మన దేశంలో ఎన్నో ఆటలున్నాయి. అయితే వాటన్నింటినీ స్పోర్ట్స్ గానే పరిగణిస్తారు. కానీ ఆర్చరీని మాత్రం ‘విద్య’గా సంభోదిస్తారు. దానికి ఉన్న గొప్పతనం అది. ఖర్చుతోనూ కూడుకున్న ఈ ఆట పట్ల ఇప్పుడిప్పుడే యువత ఆకర్షితమౌతోంది. ఇటీవలి కాలంలో పురుషులతో పాటు, మహిళలూ ఆర్చరీలో రాణిస్తుండం విశేషం. అయితే ఆట పరమైన అడ్డంకుల కంటే ఆటగాళ్ళ మధ్య ఉండే శత్రుత్వం ఈ సినిమాలో ప్రధానాంశంగా దర్శకుడు తీసుకున్నాడు. తన తోటి ఆటగాడి ఎదుగుదలను తట్టుకోలేక అతన్ని పక్కదారి పట్టించడం, తద్వారా ఆటను గెలవాలనుకోవడం కనిపిస్తుంది. చేసిన తప్పును తెలుసుకుని, హీరో తిరిగి సరైన ట్రాక్ లోకి రావడం, విలువిద్యలో విశ్వ విజేతగా నిలవడంతో సినిమా ముగుస్తుంది. ఈ మధ్యలో జరిగే నాటకీయ పరిణామాలు ఏమాత్రం ఆసక్తికరంగా కానీ, ఆకట్టుకునే విధంగా గానీ లేవు. ఆటగాళ్ళ మధ్య ఉండే ఇగో ప్రాబ్లమ్స్, అండగా నిలబడాల్సిన అసోసియేషన్స్ చేతులెత్తేయడం, ఓడిన ఆటగాడి జీవితం పతనావస్థకు చేరుకోవడం, చివరకు ఎవరో ఒకరి అండతో విజయం సాధించడం అనేది అనేక సినిమాలలో మనం చూసిందే. ఆ విధంగా చూస్తే ఈ కథ పాతదే కానీ ఎంచుకున్నఆట మాత్రం కొత్తది. అయితే ఓ సాదాసీదా కథను హీరో నాగశౌర్య తన భుజస్కందాలకు ఎత్తుకుని, దానిని మరో స్థాయికి తీసుకెళ్ళే ప్రయత్నం చేశాడు.

తాతయ్య చాటున పెరిగిన పార్థుగా నాగశౌర్య నటన ఆకట్టుకుంది. జీవితంలో ఎదురైన చేదు అనుభవాలతో మానసికంగా కృంగిపోయిన క్రీడాకారుడిగానూ నాగశౌర్య మెప్పించాడు. మరీ ముఖ్యంగా ఆ సమయంలో అతని మేకోవర్ థియేటర్లలో క్లాప్స్ పడేలా చేసింది. ఈ పాత్రను శౌర్య ఎంతగా మనసులోకి తీసుకున్నాడో అతని మేకోవర్ బట్టి తెలుస్తుంది. ఆ తర్వాత రెండోసారి బరిలోకి దిగేప్పుడూ భిన్నమైన రూపంలో కనిపించి మెప్పించాడు. పార్థు గర్ల్ ఫ్రెండ్ గా కేతికశర్మ (‘రొమాంటిక్’ ఫేమ్) తన పరిథి మేరకు బాగానే నటించింది. పార్థు తాతగా సచిన్ ఖడేకర్, మెంటర్ గా జగపతిబాబు ఇందులో కీలక పాత్రలు పోషించారు. బట్ట నలగని పాత్రలో సచిన్ కనిపించారు. అది కాస్తంత అసహజంగా అనిపించింది.

ఇక ద్వితీయార్థంలో వచ్చే జగపతి బాబు పాత్రను ఇంకాస్త ఎఫెక్టివ్ గా చూపించాల్సింది. ఇక హీరో ఫ్రెండ్ గా సత్య, హీరోయిన్ తల్లిదండ్రులుగా రాజశ్రీ నాయర్, వడ్లమాని శ్రీనివాస్ నటించారు. ఇతర ప్రధాన పాత్రలను భరత్ రెడ్డి, శత్రు, కిరీటి తదితరులు పోషించారు. నటీనటుల నుండి చక్కని నటనను దర్శకుడు రాబట్టినా అవసరమైన చోట ఎమోషన్స్ ను ఎలివేట్ చేయడంలో విఫలమయ్యాడు. ‘ఆస్తులు అమ్ముకున్నాను తప్ప జ్ఞాపకాలు కాదు’, ‘వాడు నిన్ను తప్పించి గెలవాలనుకున్నాడు, నువ్వు తప్పుడు దారిలో గెలవాలనుకుంటున్నావు. ఇద్దరూ ఒక్కటేగా!’ వంటి సంభాషణలు బాగున్నాయి. కాలభైరవ నేపథ్య సంగీతంతో పాటు ‘సాయా సాయా’ గీతం వినసొంపుగా ఉంది. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. కథ విషయంలో దర్శకుడు మరింత హోమ్ వర్క్ చేసి, ఇంకాస్త ఆసక్తికరంగా దీనిని తెరకెక్కించి ఉంటే నాగశౌర్య పడిన శ్రమకు తగ్గ ఫలితం దక్కేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్
ఆర్చరీ నేపథ్యం
నాగశౌర్య మేకోవర్
సాంకేతిక నిపుణుల పనితనం

మైనెస్ పాయింట్స్
స్లో నెరేషన్
ఎమోషన్స్ పండకపోవడం

రేటింగ్: 2.25/5

ట్యాగ్ లైన్: లక్ష్యానికి దూరంగా!