కరోనా సెకండ్ వేవ్ తర్వాత జనాలు థియేటర్లకు రావడానికి ఓ పక్క భయపడుతున్నా, చిన్న సినిమాలు మాత్రం విపరీతంగా విడుదలైపోతున్నాయి. ఈ వీకెండ్ లో ఏకంగా ఒక ఇంగ్లీష్ డబ్బింగ్ మూవీతో కలిపి ఏడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. విశేషం ఏమంటే… మిగిలిన సినిమాలన్నీ ‘ఎ’, ‘యుఎ’ సర్టిఫికెట్ పొందితే, కేవలం ‘మెరిసే మెరిసే’ చిత్రమే ‘యు’ సర్టిఫికెట్ పొందింది. ‘హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన ఈ చిత్రాన్ని కె. పవన్ కుమార్ దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి నిర్మించారు.
రాజమండ్రిలో బీకాం చదువుతుండే వెన్నెల (శ్వేతా అవస్తి)కి, లండన్ లో డాక్టర్ గా పనిచేసే హరీశ్ (శశాంక మండూరి)తో వివాహ నిశ్చితార్థం జరుగుతుంది. గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ కు ప్లాన్ చేస్తారు. ఈ లోగా వీసా నిమిత్తం హైదరాబాద్ లో వెన్నెల కొంతకాలం ఉంటే బాగుంటుందని హరీశ్ మదర్ కోరడంతో ఆమె బంధువుల ఇంట్లో దిగుతుంది. ఫలానా వ్యక్తి భార్య అని కాకుండా తనకంటూ ఓ ఐడెంటిటీని కోరుకుంటుంది వెన్నెల. ఓ చక్కని ఫ్యాషన్ డిజైనర్ కావాలన్నది ఆమె ఆశ. కానీ హరీశ్, అతని తల్లి ఆ ఆలోచనలను కొట్టిపారేస్తారు. అలాంటి ప్రయత్నం ఏమీ చేయొద్దని సున్నితం హెచ్చరిస్తారు. వైజాగ్ లోని పెద్ద బిల్డర్ కొడుకు సిద్ధూ (దినేశ్ తేజ్) బెంగళూర్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఓ యాప్ ను తయారు చేసే క్రమంలో ఫెయిల్ అవుతాడు. తన వల్ల ఏదీ కాదనే డిప్రషన్ లో ఉన్న సమయంలో తల్లి కోరిక మేరకు కొన్ని రోజులు ప్రశాంతంగా గడపడానికి హైదరాబాద్ లోని స్నేహితుడి దగ్గరకు వస్తాడు. అనుకోకుండా వెన్నెల, సిద్ధు మధ్య పరిచయం ఏర్పడుతుంది. అది వారి జీవితాలను ఎలా మార్చిందన్నదే ‘మెరిసే మెరిసే’ కథ.
ఉమెన్ ఎంపవర్ మెంట్ గురించి మనం రోజూ వింటూనే ఉంటాం. మహిళలకూ కొన్ని ఆశలు, ఆశయాలు ఉంటాయని, వాళ్ళు కూడా సొంత కాళ్ళ మీద నిలబడి ఏదో సాధించాలని తపన పడుతుంటారని! కానీ అలాంటి వారిని ప్రోత్సహించే వాళ్ళు మాత్రం చాలా తక్కువ. ఎవరైనా కాస్తంత తెగువ, చొరవ చూపించి, ముందుకు సాగినా, ఏదో రకంగా వెనక్కి లాగుతుంటారు. ఇక పెళ్ళి చేసుకోని వేరే ఇంటికి వెళ్ళాల్సిన అమ్మాయిలకు, గృహిణులకు అలాంటి కోరికలు, స్వతంత్రభావాలు ఉండటం పెద్ద శాపం. అలాంటి వారికి ప్రతినిధి ఇందులోని వెన్నెల! చదివింది బీకాం అయినా ఫ్యాషన్ డిజైనర్ కావాలనే తన కోరికను ఎలా నెరవేర్చుకుందనే దాని మీదనే దర్శకుడు ఎక్కువ ఫోకస్ పెట్టాడు. ఎన్నో కట్టుబాట్ల మధ్య ఆమె ఎలా సక్సెస్ అయ్యిందనేది చూపించాడు. అదే సమయంలో ఆమెకు పూర్తి అపోజిట్ గా, అన్ని సౌకర్యాలు ఉండి కూడా లక్ష్యం లేకుండా కొంతమంది కుర్రాళ్ళు ఎలా గాడి తప్పుతున్నారనే దానికి ఉదాహరణగా సిద్ధు పాత్రను చూపించాడు. అయితే… ఒకరి ప్రోత్సాహంతో మరొకరు ఎలా విజయం సాధించారనేదే క్లయిమాక్స్.
ఈ సినిమాను చూస్తుంటే దర్శకుడు పవన్ కుమార్ మీద శేఖర్ కమ్ముల ప్రభావం బాగానే పడిందనిపిస్తుంది. కథ కూడా కొంతలో కొంత ‘ఆనంద్’ మూవీ ఛాయల్లో సాగుతుంది. అలానే క్లయిమాక్స్ లోనూ హీరో మల్టీమిలియన్ కొడుకు అనే విషయాన్ని రివీల్ చేయకుండా ‘ఫిదా’ మూవీని ఉదాహరణగా చూపించి ముగించాడు. ఎంచుకున్న కథ మంచిదే కానీ ప్రథమార్ధం చాలా సాఫీగా సాగిపోతుంది. కథ ఎంతకూ ముందుకు పోదు. ఓ చిన్న కాన్ ఫ్లిక్ట్ ను తీసుకుని సాగతీసిన భావన కలుగుతుంది. తల్లి పట్ల వెన్నెలకు ఉండే ప్రేమను మాటల్లో కాకుండా సన్నివేశాలలో చూపించి ఉండాల్సింది. అయితే ద్వితీయార్థంలో అసలు కథ మొదలు కావడంతో కాస్తంత ఊపందుకుంది. చివరకు ఓ చక్కని సందేశంతో కథకు ముగింపు పలికారు. కూతురు భావాలను గౌరవించి, మద్దత్తు పలికేలా తండ్రి పాత్రను మలచడం బాగుంది.
ఇప్పటికే రెండు సినిమాలలో నటించాడు దినేశ్ తేజ్. ముఖ్యంగా ‘హుషారు’ మూవీ అతనికి మంచి సక్సెస్ ను ఇచ్చింది. ఇందులోనూ సిద్ధు పాత్రను చక్కగా పోషించాడు. వెన్నెల పాత్రలో శ్వేతా అవస్తి చక్కగా ఒదిగిపోయింది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రను కాటలిన్ గౌడ పోషించింది. ఇదే రోజు విడుదలైన ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ మూవీలోనూ ఆమెది కీ రోల్. ఇలా కొత్త అమ్మాయి సినిమాలు ఒకే రోజు రెండు రిలీజ్ విశేషం! ఇందులో ఇతర ప్రధాన పాత్రలను శశాంక్ మండూరి, సంజయ్ స్వరూప్, గురురాజ్, బిందు, సంధ్యా జనక్, మణి, నానాజీ తదితరులు పోషించారు. నగేశ్ బానెల్ సినిమాటోగ్రఫీ మూవీకి హైలైట్. కార్తిక్ కొడగంగ్ల సంగీతం బాగుంది. ముఖ్యంగా ‘కనులతో రచించు కావ్యాలలో… ‘ పాట వినసొంపుగా ఉంది. మహేశ్ ఎడిటింగ్ కూడా ఓకే. కానీ ఫస్ట్ హాఫ్ సీన్స్ ను కాస్తంత ట్రిమ్ చేసి ఉండాల్సింది. అక్కడక్కడా కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ సెన్సార్ కత్తెర నుండి చిత్రంగా బయట పడిపోయాయి. భారీ అంచనాలను పెట్టుకోకుండా చూస్తే ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ కొంతలో కొంత మెప్పించే ఆస్కారం ఉంది.
రేటింగ్: 2.5 / 5
ప్లస్ పాయింట్స్
<ul>
<li>ఎంచుకున్న పాయింట్
నటీనటులు నటన
సాంకేతిక నిపుణుల పనితనం </li>
</ul>
మైనెస్ పాయింట్
ఫ్లాట్ గా సాగే కథనం
ఆసక్తి కలిగించని ప్రథమార్ధం
ట్యాగ్ లైన్: మెరిసే ప్రయత్నం!