NTV Telugu Site icon

రివ్యూ : మహా సముద్రం!

maha samudram movie review

maha samudram movie review

ఎన్నో అంచనాలతో మార్చిలో జనం ముందుకొచ్చిన శర్వానంద్ ‘శ్రీకారం’ కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయింది. దాంతో అతని అభిమానులు ‘మహా సముద్రం’ పైనే ఆశలు పెట్టుకున్నారు. అలానే ఎప్పుడో ఎనిమిదేళ్ళ క్రితం ‘జబర్దస్త్’ మూవీలో నటించిన సిద్ధార్థ్, మళ్ళీ ఈ సినిమాతో తెలుగులో రీ-ఎంట్రీ ఇచ్చాడు. సో… అతనిది సమ్ థింగ్ స్పెషల్ పాత్రే అయి ఉంటుందని ఊహించుకున్నారు. వీటికంటే ప్రధానంగా ‘ఆర్. ఎక్స్. 100’ తర్వాత ఎన్ని ఆఫర్స్ వచ్చినా, కాదని డైరెక్టర్ అజయ్ భూపతి ‘మహా సముద్రం’ కథనే తీయాలని ఫిక్సయ్యాడంటే… ఏదో గొప్ప విషయం ఇందులో ఉంటుందని భావించారు. మరి వారి అంచనాలు, ఆశలకు తగ్గట్టుగానే ‘మహాసముద్రం’ ఉందా!?

స్నేహానికి ప్రాణమిచ్చే వ్యక్తులు అజయ్ (శర్వానంద్), విజయ్ (సిద్ధార్థ్). పోలీసు ఉద్యోగం సంపాదించుకుని అక్రమంగానైనా కోట్లు కూడ బెట్టాలన్నది విజయ్ కోరిక. అయితే, ఏదో ఒక చిన్న వ్యాపారమైనా చేసి నిజాయితీగా బతకాలన్నది అర్జున్ ఆశ. బట్… ఈ ప్రాణస్నేహితుల జీవితంలోకి వైజాగ్ సముద్ర తీరంలోని నేర సామ్రాజ్యానికి చెందిన చెంచు మామ (జగపతిబాబు), గూని బాబ్జీ (రావు రమేశ్‌), ధనుంజయ్ (రామచంద్రరాజు) చొరబడిన వారి ఆశలు, ఆశయాలను ఎలా పటాపంచలు చేశారన్నదే ‘మహా సముద్రం’ కథ.

తానొకటి తలిస్తే దైవం వేరొకటి తలుస్తాడని చెబుతారు. సరిగ్గా అజయ్, విజయ్ జీవితంలోనూ అదే జరుగుతుంది. ఏది కావాలని విజయ్ అనుకుంటాడో అది జరగదు. ఏది జరగకూడదని అర్జున్ భావిస్తాడో అదే జరుగుతుంది. ఊహకందని రీతిలో కథ సాగుతుంది. అయితే కథను చెప్పే క్రమంలో దర్శకుడు అజయ్ భూపతి అపరిమితమైన స్వేచ్ఛ తీసుకున్న కారణంగా ఏ పాత్రకూ సరైన న్యాయం లభించలేదు. సిద్ధార్థ్ పాత్ర మొదలైన తీరు, అది ముగిసిన విధానం మరీ తాడూ బొంగరం లేనట్టుగా ఉంది. ఆ పాత్రను ఠక్కున మాయం చేయడం, నాలుగేళ్ళ తర్వాత తిరిగి తీసుకు రావడం మరీ విడ్డూరంగా అనిపిస్తుంది.

ఇక హీరోయిన్ల పాత్రలు సైతం బేస్ లెస్ గా ఉన్నాయి. మహాలక్ష్మీ (అదితీరావు హైదరీ) పాత్రను డైరెక్టర్ కాస్తంత మనసుపెట్టి రాసుకున్నాడని మొదట్లో అనిపించినా, తన కాళ్ళ మీద తాను నిలబడాలని అనుకున్న ఆ అమ్మాయి వ్యక్తిత్వాన్ని ద్వితీయార్థంలో పలచన చేసేశాడు. ఇక స్మిత (అనూ ఇమ్మాన్యుయేల్) పాత్ర మరీ దారుణం. యాక్సిడెంట్ చేయడం, హీరో ఆదుకోవడం, ఆ తర్వాత వారి మధ్య చిగురించిన ప్రేమ, చివరిలో త్యాగం…. వీటిలో ఏ ఒక్క సంఘటన కూడా ఆకట్టుకునేలా, మనసుకు హత్తుకునేలా లేనే లేదు. అలానే విలన్ పాత్రలు సైతం పేలవంగానే ఉన్నాయి. ద్వితీయార్థంలో తన చాణక్య నీతితో ఎదుటి వారికి చుక్కలు చూపించే గూని బాబ్జీ ప్రథమార్ధంలో తమ్ముడు ముందు చేతకాని దద్దమ్మలా ఉండటం ఏమిటో అర్థం కాదు! తన స్వార్థం కోసం అజయ్ ను నేర సామ్రాజ్యంలోకి చుంచు మామ తీసుకురావడం వరకూ ఫర్లేదు కానీ అతన్ని మోసం చేయడం, దానిని హీరో గుర్తించకుండానే శుభం కార్డు పడిపోవడం సమంజసంగా అనిపించదు.

నటీనటుల విషయానికి వస్తే… శర్వానంద్ ఈ తరహా పాత్రలు గతంలో చేశాడు. స్నేహానికి ప్రాణమిచ్చే పాత్రలు, గ్యాంగ్ సర్ట్ క్యారెక్టర్స్ అతని కొత్తేమీ కాదు. సిద్ధార్థ్ తనకు ఇది రీ-ఎంట్రీ కాదని, రీ-లాంచ్ మూవీ అని చెప్పాడు. అయితే అంత సీన్ ఇందులో కనిపించలేదు. తమిళ చిత్రాలలో ఇంతకంటే బెటర్ క్యారెక్టర్స్ సిద్ధు చేశాడు. అవి తెలుగులోనూ డబ్ అయ్యాయి. అదితీరావు హైదరీ మహా పాత్రను ఆకళింపు చేసుకుని ఒదిగిపోయే ప్రయత్నం చేసింది కానీ, ఫస్ట్ హాఫ్ లో ప్రేమికుడికి ఏటీఎం కార్డ్ గా ఉండటం కరెక్ట్ గా అనిపించదు. ఇక ద్వితీయార్థంలో ఓ పాటలో తప్ప ఆమె నటనకు ఆస్కారం దక్కలేదు. ఆ పాత్ర తాలుకూ ఎమోషన్స్ ను దర్శకుడు తెరపై సరిగా ప్రెజెంట్ చేయలేదు. అనూ ఇమాన్యుయేల్ అతిథి పాత్ర చేసిందనే చెప్పాలి. పాత్రల రూపకల్పనలో బలం లేకపోయినా, జగపతిబాబు, రావు రమేశ్, రామచంద్రరాజు మేనరిజమ్స్ తో నెట్టుకొచ్చే ప్రయత్నం చేశారు. హీరోయిన్ తండ్రిగా గోపరాజు రమణ నటించారు. ఆయన పాత్ర కూడా అతిగానే ఉంది. కాస్తంత చక్కగా ఉన్న పాత్ర హీరో తల్లిగా నటించిన శరణ్యదే!

సాంకేతిక వర్గంలో చెప్పుకోవాల్సింది రాజ్ తోట సినిమాటోగ్రఫీ గురించి. సముద్ర తీరప్రాంతాలను, పాటలను బాగానే చిత్రీకరించాడు. చిత్రం ఏమంటే ‘ఆర్. ఎక్స్. 100’తో పాటు ఇటీవల వచ్చిన ‘ఎస్. ఆర్.కళ్యాణ మండపం’లోనూ చక్కని బాణీలు అందించిన చైతన్ భరద్వాజ్ ఈ సినిమాను మ్యూజికల్ హిట్ చేయలేకపోయాడు. ఇందులో అన్నీ టైమ్ పాస్ సాంగ్సే. ఏ ఒక్కటీ ఆకట్టుకోదు. హీరోల యాటిట్యూడ్ ను, ఫ్రెండ్ ఫిస్ ను తెలిపేది మొదటి పాట. అప్పటికే వారి మధ్య ఉన్న స్నేహం రిజిస్టర్ అయిపోయింది కాబట్టి ఆ పాట అవసరమే లేదు. ఇక రంభ పాటను ఎందుకు పెట్టారో అర్థం కాదు. సీరియస్ మూడ్ ను కాస్తంత బాలెన్స్ చేయడానికి ఆ పాట పెట్టినట్టు ఉంది. ద్వితీయార్థంలో అదితీ రావు హైదరీ మీద పాట కంటే… ఆమె మనసులో చెలరేగే భావాలను సన్నివేశాలుగా రాసుకుని ఉంటే ఆ పాత్రకు కాస్తంత న్యాయం చేసినట్టు అయ్యేది. ‘ఇంకా విశ్రాంతి రాదేమిటీ?’ అని ప్రేక్షకులు అసహనానికి గురైన తర్వాత కానీ ఇంట్రవెల్ కార్డ్ పడదు.

సెకండ్ హాఫ్ లో ఇంకా సిద్ధార్థ్ క్యారెక్టర్ ఇంకా ఎంటర్ కాదేమిటీ? అని చికాకు పడుతున్న సమయంలో ఆ పాత్ర ప్రత్యక్ష మౌతుంది. అక్కడి నుండి అయినా… సినిమా గ్రాఫ్ పైకి లేస్తుందేమోనని ప్రేక్షకులు ఆశపడుతూ ఉంటారు. కానీ టైటిల్ జస్టిఫికేషన్ అన్నట్టుగా మూవీ గ్రాఫ్ ‘మహా సముద్రం’ లోతును వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. అయితే, ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ మాత్రం ప్రొడక్షన్ విషయంలో రాజీ పడలేదని తెర మీద సన్నివేశాలనుచూస్తే అర్థమౌతుంది. థియేటర్ల నుండి బయటకు వచ్చే ప్రేక్షకుడికి ‘ఆర్. ఎక్స్. 100’ తీసిన దర్శకుడి సినిమానేనా ఇది అనే సందేహం కలగక మానదు. సినిమా చూసిన వారికి ఎందుకు ఈ కథను పలువురు రిజెక్ట్ చేశారో ఈజీగా అర్థమవుతుంది. మూడేళ్ళుగా ఈ కథతో ప్రయాణం చేస్తున్న అజయ్ భూపతి దాన్ని భుజాల నుండి దించేశాడు కాబట్టి, ఈసారైనా ఓ కొత్త కథతో, ఆసక్తికర కథనంతో వస్తాడేమో చూడాలి. ఏది ఏమైనా ‘మహా సముద్రం’ చూసిన వారు… విడుదల చేసిన వారు తప్పకుండా సముద్రంలో మునక ఖాయం.

ప్లస్ పాయింట్స్
రాజ్ తోట సినిమాటోగ్రఫీ
నిర్మాణ విలువలు

మైనెస్ పాయింట్స్
కొత్తదనం లేని కథ
ఆకట్టుకోని కథనం
పేలవమైన యాక్షన్ సీన్స్
చెప్పుకుంటూ పోతే ఎన్నో…
రేటింగ్ : 2 / 5

ట్యాగ్ లైన్ : మునక ఖాయం!