‘యూ టర్న్’… దానికి ముందు ‘లూసియా’ చిత్రాలతో దక్షిణాది చిత్రసీమలో గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు పవన్ కుమార్. అతను డైరెక్ట్ చేసిన లేటెస్ట్ వెబ్ సీరిస్ ‘కుడి ఎడమైతే’. ఈ వెబ్ సీరిస్ కు క్రియేటర్ అండ్ రైటర్ రామ్ విఘ్నేష్. ఆహాలో శుక్రవారం నుండి స్ట్రీమింగ్ అవుతున్న దీన్ని పవన్ కుమార్ స్టూడియోస్ తో కలిసి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టి. వి. విశ్వ ప్రసాద్ నిర్మించారు. విశేషం ఏమంటే టైమ్ లూప్ అనే కాన్సెప్ట్ లో రూపుదిద్దుకున్న ఫస్ట్ ఇండియన్ వెబ్ సీరిస్ ఇది.
కథ విషయానికి వస్తే ఆది (రాహుల్ విజయ్) నటుడు కావాలని కలలుకనే ఓ యువకుడు. ఆర్థిక పరిస్థితులు సహకరించక పోవడంతో డెలివరీ బోయ్ గా పనిచేస్తుంటాడు. దుర్గా గౌడ్ (అమలాపాల్) ఖైరతాబాద్ సర్కిల్ ఇన్ స్పెక్టర్. నగరంలో వరుసగా జరుగుతున్న చిల్డ్రన్స్ కిడ్నాప్ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటుంది. ఫిబ్రవరి 29వ తేదీ రాత్రి దుర్గా నడుపుతున్న పోలీస్ జీప్, బైక్ పై వేగంగా వస్తున్న ఆదిని ఢీ కొడుతుంది. ఇద్దరూ చనిపోతారు. ఇదిలా ఉంటే… కిడ్నాప్ కేసుతో పాటే పార్వతి (నిత్యశ్రీ) అనే ఎయిర్ హోస్టస్ తనతో మూడు నెలల క్రితం బ్లైండ్ డేటింగ్ చేసిన బెంగళూరుకు చెందిన ఓ యువకుడి ఆచూకి కోరుతూ పోలీసులను ఆశ్రయిస్తుంది. ఫిబ్రవరి 29వ తేదీ రాత్రి తనకు యాక్సిడెంట్ జరగడానికి ముందు, పార్వతి సూసైడ్ చేసుకోవడం ఆది గమనిస్తాడు. చిత్రం ఏమంటే… ఆది, దుర్గా ఇద్దరూ కూడా మరణానంతరం టైమ్ లూప్ లో చిక్కుకుపోతారు. వారి జీవితంలో ఫిబ్రవరి 29వ తేదీ సంఘటనలే మళ్ళీ మళ్ళీ జరుగుతుంటాయి. ఈ టైమ్ లూప్ నుండి వాళ్ళు ఎలా బయట పడ్డారు? పిల్లల కిడ్నాప్ కు కారకులు ఎవరు? వాళ్ళు ఎందుకు ఆ పని చేస్తున్నారు? పార్వతితో బ్లైండ్ డేట్ చేసిన హర్ష అనే వ్యక్తి ఆచూకి తెలిసిందా? లేదా? అనేది మిగతా కథ.
క్రైమ్ థ్రిల్లర్ జానర్ కు చెందిన ‘కుడి ఎడమైతే’ వెబ్ సీరిస్ మెయిన్ గా టైమ్ లూప్ నేపథ్యంలో సాగుతుంది. ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సీరిస్ లో ఫిబ్రవరి 29వ తేదీ ఆది, దుర్గా జీవితంలో ఉదయం నుండి రాత్రి యాక్సిడెంట్ వరకూ జరిగిన సంఘటనలే పునరావృతం అవుతాయి. దాంతో ప్రతి ఎపిసోడ్ లోనూ చూసిన సంఘటనలే మళ్ళీ మళ్ళీ చూడాల్సి వస్తుంది. అది వీక్షకుల సహనానికి పరీక్షే. పైగా నాలుగు రోజులు పాటు రిపీట్ అయ్యే ఈ జర్నీలో పెద్దంత ట్విస్ట్ లు కూడా ఏం ఉండవు. కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు తప్పితే! అయితే… ఎంచుకున్న పాయింట్ లో కొత్తదనం ఉండటంతో మొదటి రెండు మూడు ఎపిసోడ్స్ ఆసక్తిని కలిగిస్తాయి. ఆ తర్వాత మూడు ఎపిసోడ్స్ లో పెద్దంత కథేమీ ముందుకు పోదు. తిరిగి చివరి రెండు ఎపిసోడ్స్ గ్రిప్పింగ్ తో సాగాయి. మరీ ముఖ్యంగా ఎనిమిదో ఎపిసోడ్ లో డైరెక్టర్ పవన్ కుమార్ సూపర్ ట్విస్ట్ ఇచ్చాడు. ఈ వెబ్ సీరిస్ లో ఇది మొదటి సీజన్ అని, మరో సీజన్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పేశారు. ఈ కిడ్నాప్స్ కు కారణం కానీ, పార్వతి బోయ్ ఫ్రెండ్ చర్యలకు రీజన్ గానీ, ప్రధాన పాత్రధారి, పోలీస్ అధికారి దుర్గా ప్రేమ వ్యవహారం గానీ డైరెక్టర్ డిస్క్లోజ్ చేయలేదు. సో… నెక్ట్స్ సీజన్ లో ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికే ఆస్కారం ఉంది.
నటీనటుల విషయానికి వస్తే… అమలాపాల్ మోడర్న్ పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టేసింది. ప్రతి సన్నివేశంలోనూ చాలా చురుకుగా కనిపించింది. అదే సమయంలో పరిస్థితుల కారణంగా ఫ్రస్టేషన్ కు గురయ్యే సన్నివేశాల్లోనూ బాగా చేసింది. ఈ వెబ్ సీరిస్ కు ఆమె ప్రెజెన్స్ పెద్ద ప్లస్ పాయింట్. ఇక గత కొంతకాలంగా చక్కని నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు రాహుల్ విజయ్. ప్రముఖ ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడైన రాహుల్ కు నిజానికి ఇప్పటికే మంచి బ్రేక్ రావాల్సింది. కానీ సినిమా కథల ఎంపికలో జరుగుతున్న పొరపాటు కారణంగా ఆ బ్రేక్ రాలేదు. నాలుగేళ్ళుగా గుర్తింపు కోసం స్ట్రగుల్ అవుతున్నాడు. అతనిలోని కమిట్ మెంట్ చూసి, దర్శక నిర్మాతలూ వరుసగా అవకాశాలు ఇస్తున్నారు. ఈ వెబ్ సీరిస్ కూడా అలాంటిదే. రాహుల్ కూడా చక్కని నటన కనబరిచాడు. ఆది పాత్రలో ఒదిగిపోయాడు. ఇక ఇందులో మిగిలిన ప్రధాన పాత్రలను రవిప్రకాశ్, రుద్ర ప్రదీప్, రాజ్ మాదిరాజు, ఈశ్వర్ రచిరాజు, సూర్య శ్రీనివాస్, నిత్యశ్రీ, మేఘలేఖ తదితరులు పోషించారు. వాళ్ళందరి నటన సహజంగా ఉంది. విశేషం ఏమంటే… దర్శకుడు పవన్ కుమార్ డాక్టర్ హర్ష అనే టిపికల్ క్యారెక్టర్ లో మనకు కనిపిస్తాడు.
థ్రిల్లర్ వెబ్ సీరిస్ లకు ప్రధాన బలం నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ. ఆ రెండూ బాగున్నాయి. అయితే ఎడిటింగ్ విషయంలో మరింత శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. బేసిక్ ఎడిటింగ్ బాగానే ఉన్నా… సేమ్ సీన్స్ ను నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయడం ఈ వెబ్ సీరిస్ పై నెగెటివ్ ఇంపాక్ట్ చూపించే ఆస్కారం ఉంది. కథ ఎంతకూ ముందుకు సాగకపోవడంతో వీక్షకులకు నిరాశ కలుగుతుంది. పవన్ కుమార్, రామ్ విఘ్నేష్ ఈ విషయంలో కాస్తంత కఠినంగా వ్యవహరించి ఉండాల్సింది. కనీసం రెండో సీజన్ లో ఆ జాగ్రత్తలు తీసుకుంటారేమో చూడాలి. అయితే… అది టైమ్ లూప్ బేస్ తో సాగదు కాబట్టి… పెద్ద సమస్య ఉండకపోవచ్చు. ఆహాలో గతంలో వచ్చిన వెబ్ సీరిస్ లతో దీనిని పోల్చలేం. ఇది వాటన్నింటికంటే భిన్నమైంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి వెబ్ సీరిస్ తెలుగు వాళ్ళు చూడలేదని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఈ మధ్య ఆహాలో వచ్చిన ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ కంటే వంద రెట్లు బెటర్ వెబ్ సీరిస్ ఇది. థ్రిల్లర్ జానర్ ను ఇష్టపడే వారికి ‘కుడి ఎడమైతే’ నచ్చుతుంది. మధ్యలో ఒకటి రెండు ఎపిసోడ్స్ ను స్కిప్ చేసినా నష్టం లేదు!
రేటింగ్: 2.5 / 5
ప్లస్ పాయింట్స్
ఎంచుకున్న స్టోరీ లైన్
ఆర్టిస్టుల పెర్ఫామెన్స్
ఆకట్టుకునే క్లయిమాక్స్
మేకింగ్ వాల్యూస్
మైనెస్ పాయింట్స్
ఓవర్ ఆల్ రన్ టైమ్
సీన్స్ విపరీతంగా రిపీట్ కావడం
ట్యాగ్ లైన్: ఇట్స్ థ్రిల్లర్ టైమ్!