NTV Telugu Site icon

రివ్యూ: క్షీరసాగర మథనం

Ksheera Sagara madhanam movie review

బ్యాక్ లాగ్స్ ను క్లియర్ చేయడానికి స్టూడెంట్స్ తపిస్తున్నట్టుగా, గతంలో తొలి కాపీని సిద్దం చేసిన నిర్మాతలు తమ చిత్రాలను ఇప్పుడు బయటపడేయడానికి ప్రయత్నిస్తున్నారు. అలా శుక్రవారం జనం ముందుకు వచ్చిన సినిమానే ‘క్షీరసాగర మథనం’. నిజానికి ఇది యేడాది క్రితం రావాల్సిన సినిమా. ఏడుగురు వ్యక్తుల జీవితంలోని భావోద్వేగాల సమ్మిళితంగా ‘క్షీరసాగర మథనం’ తెరకెక్కింది. ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మితమైన ఈ చిత్రంతో అనిల్ పంగులూరి దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో వివిధ హోదాలలో పనిచేసే స్నేహితులు ఓంకార్, యోగేశ్, గోవింద్, భరత్. వీళ్ళతో పాటు అంతే స్నేహంగా ఉంటాడు ఆ కంపెనీ క్యాబ్ డ్రైవర్ రిషి (మానస్). ఓ ప్రాజెక్ట్ పని మీద ఇండియాకు వచ్చిన ఇషిత (అక్షత సోనావానే) తన చిన్ననాటి స్నేహితుడు మహదేవ్ ను వెతికి పెట్టమని రిషి సాయం కోరుతుంది. ఇదే సమయంలో దేశంలో అరాచకాన్ని సృష్టించడానికి మనుషులను మానవ బాంబులుగా మార్చుతుంటాడో టెర్రరిస్ట్. సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసే ఈ ఐదుగురు స్నేహితులను ఇన్ స్ట్రుమెంట్ గా ఉపయోగించి, ఆ టెర్రరిస్ట్ భారీ బ్లాస్ట్ కు ప్లాన్ చేస్తాడు. వ్యక్తిగత జీవితంలో ఆటుపోటులు ఎదుర్కొని, చివరకు లైఫ్ సెటిల్ అవుతుందని భావిస్తున్నతరుణంలో జరిగిన ఈ ఊహించని ఘటన వారి జీవితాలను ఏ తీరాలకు చేర్చిందన్నది మిగతా కథ.

ఇందులోని ఐదుగురు స్నేహితులు.. ఉద్యోగరీత్యా ఒకే గూటి పక్షులే అయినా ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. వాటికి పరిష్కారాలు చూపడంతో పాటు దానికి టెర్రిరిజం ఎలిమెంట్ ను మిక్స్ చేసి, దర్శకుడు మరింత కంగాళీ చేశాడు. దాని ద్వారా కథలో టెంపో పెరుగుతుందని డైరెక్టర్ భావించి ఉండొచ్చు. కానీ మెయిన్ థీమ్ కు అది సెట్ కాలేదు. దాంతో కథలోని బిగువు సడలిపోయింది. సినిమా క్లయిమాక్స్ కు వచ్చేసరికీ ఏమౌతుందనే ఉత్సుకతకు బదులు ఇంకా పూర్తి కాదేమిటనే అసహనం ప్రేక్షకుడిలో పెరుగుతుంది. ఐదుగురు స్నేహితుల సమస్యల్లో కాస్తంత ఆసక్తికరంగా ఉంది గోవింద్, విరిత జంట కథే. విరిత పాత్రను దర్శకుడు మలిచిన తీరు బాగుంది. ఓ పర్శన్ క్యారెక్టర్ కు, వర్జినిటీకి మధ్య ఉన్న తేడాను ఆమె పాత్ర ద్వారా చెప్పించడం మూవీలో హైలైట్. మిగిలిన వారి సమస్యలు, వాటి పరిష్కారాలు పెద్దంత ఆసక్తిని కలిగించేలా లేవు.

బాల నటుడిగా గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత కొన్ని చిత్రాలలో, సీరియల్స్ లో హీరోగా నటించిన మానస్ మరోసారి తన అదృష్టం పరీక్షించుకునే ప్రయత్నం ఈ మూవీతో చేశాడు. తల్లిదండ్రులను కోల్పోయిన ఓ కొడుకుగా, ప్రియురాలు వెతుకుతోంది తననే అని తెలిసినా, ఆ మాట చెప్పలేని నిస్సహాయుడిగా చక్కగా నటించాడు. అలానే యాక్షన్ సన్నివేశాలలోనూ మెప్పించాడు. బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ పాత్ర నెగెటివ్ షేడ్స్ తో మొదలై, పాజిటివ్ గా మారడం బాగుంది. హీరోయిన్ గా నటించిన అక్షత సోనావాలే నటన ఫర్వాలేదు. మరో హీరోయిన్ చరిష్మా శేఖర్ గ్లామర్ తోనే కాదు అభినయంతోనూ ఆకట్టుకుంది. మిగిలిన పాత్రలను గౌతమ్ శెట్టి, ప్రదీప్ రుద్ర, ప్రియాంత్, మహేశ్, అదిరే అభి, శశిధర్, ఇందు తదితరులు పోషించారు. సంతోష్ షనమోని సినిమాటోగ్రఫీ అందించగా, వంశీ అట్లూరి ఎడిటింగ్ చేశారు. అజయ్ అరసడ స్వరపరిచిన ఒకటి రెండు పాటలు బాగున్నాయి. యూత్ ను ఆకట్టుకోవాలనే ఆశతో అక్కడక్కడా కాస్తంత హద్దుమీరిన సన్నివేశాలను పెట్టారు. మొత్తంగా చూస్తే… దాదాపు రెండున్నర గంటల పాటు వెండితెరపై మథనమైతే జరిగింది కానీ ఆడియెన్స్ ను సంతృప్తి పరిచే అమృతం మాత్రం వారికి దక్కలేదు.

రేటింగ్ : 2.25 / 5

ట్యాగ్ లైన్: అమృతం నాస్తి!