NTV Telugu Site icon

రివ్యూ: కొండపొలం

గతంలో మాదిరి ఇప్పుడు నవలా చిత్రాలు తెలుగులో రావడం తగ్గిపోయింది. ఆ లోటును తీర్చుతూ, ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవలను క్రిష్ జాగర్లమూడి అదే పేరుతో వెండితెరకెక్కించారు. తొలి చిత్రం ‘ఉప్పెన’తోనే నటుడిగా గుర్తింపుతో పాటు, మంచి విజయాన్ని అందుకున్న వైష్ణవ్ తేజ్, రకుల్‌ ప్రీత్ సింగ్ జంటగా ఈ చిత్రాన్ని రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు.

కడప జిల్లాకు చెందిన కఠారు రవీంద్ర యాదవ్ (వైష్ణవ్ తేజ్) అనే కుర్రాడి కథ ఇది. పాతికేళ్ళ ఆ కుర్రాడు బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్ లో ఉద్యోగ ప్రయత్నాలు చేసి విఫలమవుతాడు. నగరంలో బతకలేక తన పల్లెకు వెళ్ళినప్పుడు తాత రోశయ్య (కోట శ్రీనివాసరావు) ఓ సలహా ఇస్తాడు. కరువు కారణంగా అల్లల్లాడుతున్న ఊరి గొర్రెల మందతో కొందరు ‘కొండపొలం’ చేస్తున్నారని, తమ గొర్రెలనూ తీసుకుని వారితో కలిసి నల్లమల అడవికి వెళ్లమని చెబుతాడు. నెల రోజుల పాటు అడవితో సహజీవనం చేశాక రవీంద్రలో ఎలాంటి మార్పు వచ్చింది, అడవి అతనికి ఏ యే పాఠాలు నేర్పింది, ఆ అనుభవంతో జీవితంలో ఎదురైన కష్టాలను ఎదుర్కొని అతను ఎలా విజయపథంలో సాగాడన్నదే ఈ చిత్ర కథ.

తానా సంస్థ నిర్వహించిన నవలల పోటీలో ‘కొండపొలం’ ప్రథమస్థానంలో నిలిచి, రెండు లక్షల రూపాయల బహుమతిని పొందింది. కథలోని అంశం, సన్నివేశాలలోని చిక్కదనం పాఠకులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే సాధారణ ప్రేక్షకుడిని సైతం అలరించేలా నవలలో లేని కథానాయిక ఓబులమ్మ పాత్రను ఈ సినిమా కోసం రచయిత సన్నపురెడ్డి సృష్టించారు. ఈ సినిమాకు సంభాషణలూ ఆయనే సమకూర్చారు. దాంతో ప్రతి పాత్రలోనూ జీవం నింపినట్టయ్యింది. ఆ పాత్రల ప్రవర్తన, వారి ఆహార వ్యవహారాలు, మాట తీరూ అంతా పోత పోసినట్టుగా ఉంది. రాయలసీమ అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చేవి ఫ్యాక్షన్ హత్యలు, ఆ నేపథ్యంలో వచ్చిన సినిమాలే. అయితే అక్కడి మనుషుల్లోనూ మానవత్వం దండిగా ఉంటుందని, పెంచుకునే పశువుల కోసం అవసరమైతే ప్రాణాలను సైతం పణంగా పెట్టేవారు ఉంటారని ఈ సినిమాలో చూపించారు. నల్లమల అడవులకు తన గొర్రెలను తోలుకు వెళ్ళిన రవీంద్ర ఒకానొక సమయంలో పెద్ద పులి నుండి గొర్రెలను కాపాడటానికి చేసే ప్రయత్నం రోమాంచితంగా ఉంటుంది. పశువులను తమ సొంత బిడ్డలుగా భావించే రైతు వాటికి తగిన గ్రాసం అందించలేక, కనీసం దాహం తీర్చలేక ఎంత మధనపడతాడో ఈ సినిమా చూస్తే అర్థమౌతుంది. పెద్దపులి బారిన పడతామని తెలిసి, గొర్రెల కోసం ప్రాణాలను పణంగా పెట్టి నెల రోజుల పాటు ‘కొండపొలం’ చేయడం అంటే మాటలు కాదు. అడవితో మనిషికి ఉండాల్సిన బంధాన్ని, పశువులకు మనుషులకు మధ్య ఉండే అనుబంధాన్ని చక్కగా చూపించాడు దర్శకుడు క్రిష్.

నటీనటుల విషయానికి వస్తే వైష్ణవ్ తేజ కళ్ళలో ఏదో తెలియని ఆకర్షణ ఉంది. చాలా వరకూ భావాలను ఆ కళ్లే పలికిస్తాయి. రవీంద్ర పాత్రలో అతను చక్కగా ఒదిగిపోయాడు. అయితే, కొన్ని సన్నివేశాలలో ఓబులమ్మ పాత్ర చేసిన రకుల్ ప్రీత్ అతన్ని డామినేట్ చేసింది. ఆమె పాత్ర తీరే అంతకావడం అందుకు ఓ కారణం కావచ్చు. పిరికి వాడైన రవీంద్రను ఆట పట్టించడం, అతనిలో ఓ పట్టుదల ఏర్పడటానికి పరోక్షంగా కారణం కావడం, తద్వారా అతనిలో ధైర్యాన్ని మేల్కొలపడం ఓబులమ్మ పాత్ర ద్వారా చేయించడంతో కథ రక్తి కట్టింది. ఇక రవీంద్రకు దిశానిర్దేశం చేసే తాత పాత్రను కోట చేశారు. ఆయనకు రాసిన సంభాషణలు బాగున్నాయి. ‘ఉప్పెన’లో వైష్ణవ్ కు తండ్రిగా నటించిన సాయిచంద్ ఇందులోనూ అతని తండ్రి గురప్ప పాత్ర చేసి మెప్పించారు. వైష్ణవ్ తో పాటు అడవిలోకి వెళ్ళే ఇతర పాత్రలలో అంథోని, హేమ, రవిప్రకాశ్, మహేశ్ విట్ట, రచ్చ రవి, అశోక్ వర్థన్ నటించారు. పలు చిత్రాలలో పోలీస్ పాత్రలు చేసి మెప్పించిన రవి ప్రకాశ్ ఇందులో అంకయ్య పాత్ర పోషించాడు. పుట్టింటికి వెళ్ళిన భార్యతో అతను జరిపే సంభాషణ గొప్పగా ఉంది. తన హావభావాలతో ఆ సన్నివేశాన్ని రవి ప్రకాశ్ రక్తి కట్టించాడు. అయితే రచ్చ రవి, అశోక్ వర్థన్ పై చిత్రీకరంచిన మాటలు కోటలు దాటే కామెడీ అంతగా పండలేదు. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను అన్నపూర్ణమ్మ, నాజర్, లోకి, శ్యామల, సుభాషిణి తదితరులు పోషించారు. దర్శకుడు క్రిష్‌, నిర్మాతలో ఒకరైనా రాజీవ్ రెడ్డి కూడా ఓ అతిథి పాత్రల్లో మెరిశారు.

సాంకేతిక నిపుణులలో కథ, మాటలు అందించిన సన్నపురెడ్డికి అగ్రతాంబులం ఇవ్వాలి. ‘ఏ భాషలో మాట్లాడినా అది గుండెను చేరుతుంది. కానీ మాతృభాషలో మాట్లాడితే మనసుకు చేరుతుంది’, ‘అడవికి చుట్టంచూపుగా వెళ్ళాలి అంతేకానీ చెట్లు నరకడం, జీవాలను చంపడం చేయకూడదు’, ‘అవతలి వాళ్ళ చెప్పులో కాలు పెడితే కానీ తెలియదు అందులో ఎన్ని ముళ్ళు ఉన్నాయో’ వంటి మాటలు హృదయాన్ని తాకుతాయి, ఆలోచింప చేస్తాయి. ఇలాంటి సంభాషణలను సినిమాలో అనేకం ఉన్నాయి. అలానే కీరవాణి ఈ చిత్రాన్ని తన సంగీతంతోనూ, జ్ఞానశేఖర్ తన కెమెరా పనితనంతోనే దీనిని దృశ్యకావ్యంగా మలిచే ప్రయత్నం చేశారు. ఈ సినిమా కోసం కీరవాణి ఏడు పాటలను స్వరపరిచారు. అందులో మూడు పాటలకు ఆయనే సాహిత్యాన్నీ అందించారు. ‘నీలో నాలో నీలో నాలో’ అనే పాట కాస్తంత రొమాంటిక్‌గా సాగింది. సీతారామశాస్త్రి రాసిన రెండు పాటలు ఉత్తేజాన్ని, ఉద్వేగాన్ని కలిగిస్తాయి. చంద్రబోస్ రాసిన రెండు పాటలు అడవి అందాలను, దానితో మనిషికి ఉండే బంధాలను తెలిపాయి. ‘చెట్టెక్కి పుట్టు తేనె తెచ్చా మామా’ పాట చిత్రీకరణ చాలా బాగుంది. అయితే… ప్రథమార్థంలో సాగినంత వేగంగా కథ ద్వితీయార్థంలో సాగలేదు. కొన్నిచోట్ల గ్రాఫ్ కాస్తంత కిందకు దిగింది. ఈ విషయంలో ఎడిటర్ శ్రవణ్ కటికనేని కాస్తంత శ్రద్ధ చూపి ఉండాల్సింది.

అడవి నేపథ్యంలో తెలుగులో చాలానే చిత్రాలు వచ్చాయి. అందులోని జంతువులను వేటాడే వేటగాళ్ళ మీద, అడవి సంపదను దోచుకునే స్మగ్లర్ల మీద, అడవిలో ఉండే గిరిజనులను వేధించే అధికారుల మీద కూడా వచ్చిన సినిమాలు ఉన్నాయి. అయితే… పశువులను కాసుకోవడం కోసం అడవికి వెళ్ళే గొర్రెల కాపరులు, నెలల తరబడి అక్కడే ఉండే వారి జీవన పద్థతి, అరణ్యం నేర్పిన పాఠాలతో జనారణ్యంలో ఓ యువకుడు ఉన్నత స్థానానికి చేరుకోవడం అనే అంశాలపై ఏ చిత్రమూ రాలేదు. ఆ రకంగా చూసినప్పుడు ‘కొండపొలం’ యువతలో ఆత్మ విశ్వాసాన్ని నింపేదిగా కనిపిస్తుంది. ఇలాంటి సినిమాను రూపొందించిన దర్శకుడు క్రిష్‌ ను, నిర్మాతలు రాజీవ్ రెడ్డి, సాయిబాబును అభినందించాలి. ప్రకృతితో, తోటి జీవులతో మనిషి మమేకం కావాలి తప్పితే, తన స్వార్థం కోసం వాటిని నాశనం చేయకూడదనే చక్కని సందేశం ఉందీ ‘కొండపొలం’లో. కమర్షియల్ గా ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని సాధిస్తుందనేది పక్కన పెడితే, ఓ మంచి సినిమాను చూసిన అనుభూతిని అయితే ప్రేక్షకులకు అందిస్తుంది.

ప్లస్ పాయింట్స్
కథలోని కొత్తదనం
అడవి నేపథ్యం కావడం
ఆలోచింప చేసే మాటలు
కీరవాణి సంగీతం

మైనెస్ పాయింట్స్
నిదానించిన ద్వితీయార్థం
ఆశించిన స్థాయిలో లేని వి.ఎఫ్.ఎక్స్
కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువ ఉండటం

రేటింగ్: 3 / 5

ట్యాగ్ లైన్: అడవి నేర్పే పాఠాలు!