NTV Telugu Site icon

Hey Sinamika Review : హే సహనం కావాలి!

hey-sinamika

కొరియోగ్రాఫర్స్ మెగాఫోన్ పట్టడం కొత్తకాదు. బాలీవుడ్ తో పాటు సౌతిండియాలో మేల్, ఫిమేల్ కొరియోగ్రాఫర్స్ దర్శకులుగా మారి ఎన్నో సక్సెస్ ఫుల్ మూవీస్ అందించారు. చాలా ఆలస్యంగా సీనియర్ కొరియోగ్రాఫర్ బృంద సైతం ఈ బాబితాలో చేరారు. ఆమె దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘హే సినామిక’ గురువారం జనం ముందుకు వచ్చింది.

ఆర్యన్ (దుల్కర్ సల్మాన్)కు ఫుడ్ వండటం, గార్డెనింగ్ అంటే ఇష్టం. ఓ భీకర తుఫాను సమయంలో అతనికి మౌనా (అదితీరావ్ హైదరీ)తో పరిచయమవుతుంది. అది ప్రేమగా మారి వాళ్ళు పెళ్ళి చేసుకుంటారు. చూస్తుండగానే రెండేళ్ళు గడిచిపోతాయి. నోటికి తాళం వేయకుండా గడగడా మాట్లాడుతూ ఉండే ఆర్యన్ అంటే మౌనాకు నిదానంగా బోర్ కొట్టడం మొదలవుతుంది. అతను ఎంత కేరింగ్ తో ఉన్నా… ఆ ఓవర్ అటెన్షన్ ను ఆమె తట్టుకోలేకపోతుంది. కొద్ది రోజుల పాటు ఎక్కడికైనా వెళ్ళి ఒంటరిగా ఉండాలని కోరుకుంటుంది. అదే సమయంలో ఆమెకు వైజాగ్ ట్రాన్స్ ఫర్ అవుతుంది. తానొక్కతే అక్కడ నచ్చినట్టుగా ఉండొచ్చని అనుకుంటూ ఉంటే… ఆర్యన్ కూడా వెనకే వైజాగ్ వచ్చేస్తాడు. ఇదే సమయంలో వాళ్ళ ఇంటిపక్కన సైకాలజిస్ట్ డాక్టర్ మలార్ (కాజల్ అగర్వాల్)తో మౌనాకు పరిచయమవుతుంది. భర్త ఓవర్ కేరింగ్ ను తట్టుకోలేకపోతున్నానని, అతన్ని వదిలించుకోవడానికి ఏదైనా ఉపాయం చెప్పమని, అవసరమైతే అతనితో ప్రేమ నటించి, ముగ్గులోకి దింపితే ఆ వంకతో అతన్ని దూరం పెడతానని మౌనా అడుగుతుంది. మరి ఆర్యన్ కేసును డాక్టర్ మలార్ ఎలా డీల్ చేసింది? భర్త తన చేజారిపోతున్నాడని తెలిసిన తర్వాత మౌనా ఎలా రియాక్ట్ అయ్యింది? అనేది మిగతా కథ.

ఈ సినిమాకు కథను అందించింది ప్రముఖ గీత రచయిత వైరముత్తు తనయుడు మదన్ కార్కీ. కథతో పాటు స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు కూడా అతనే సమకూర్చాడు. సో… బృందా మాస్టర్ కేవలం దర్శకత్వం మాత్రమే చేశారు. ఓ రకంగా ఇది టెక్నీషియన్స్ మూవీ అని చెప్పాలి. కథలో హీరో చాటర్ బాక్స్ కావడంతో అతనికి ఆ స్థాయిలోనే డైలాగ్స్ రాశారు. అయితే ఏదో ఉబుసుపోక కబుర్లు కాకుండా అతనో మెచ్యూర్డ్ పర్శన్ కావడంతో అలాంటి సంభాషణలే అందించారు. ఈ విషయంలో మదన్ ను అభినందించాలి. తమిళ సాహిత్యం సంగతేమో కానీ తెలుగులో పాటలు చాలా చక్కగా వినసొంపుగా, అర్థవంతమైన పదాలతో సాగాయి. గోవింద్ వసంత చక్కని బాణీలే కాదు నేపథ్య సంగీతం కూడా బాగా అందించాడు. అయితే ద్వితీయార్థం ప్రారంభంలో వచ్చే ర్యాప్ సాంగ్ వేస్ట్. గతంలో దుల్కర్, నిత్యామీనన్ తో మణిరత్నం ‘ఓ కాదల్ కన్మణి’ సినిమా తీశారు. అందులోని ఓ పాట ‘హే సినామిక’ అంటూ మొదలవుతుంది. ఇది కూడా ఫీల్ గుడ్ రొమాంటిక్‌ డ్రామా కావడంతో అదే పేరును బృంద బృందం ఈ సినిమాకు పెట్టేసింది. సాంకేతిక నిపుణులలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఛాయాగ్రాహకురాలు ప్రీత జయరామన్ గురించి. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి. సి.శ్రీరామ్ మేనకోడలైన ప్రీత ఆయన వారసత్వాన్ని నిలబెట్టబోతోందని ఈ సినిమా చూస్తే అర్థమౌతోంది. క్లోజప్ షాట్స్ ను కూడా చాలా అందంగా ఓ పెయింటింగ్‌లా తెరకెక్కించింది.

సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ దుల్కర్ సల్మాన్, అదితీరావ్ హైదరీ మీదనే కథంతా సాగుతుంది. ఓ అరగంట తర్వాత కాజల్ పాత్ర ఎంట్రీ ఇస్తుంది. ఈ ముగ్గురూ కాకుండా కథానుగుణంగా మరో ఐదారు ప్రధాన పాత్రలు ఉన్నాయి. వారంతా చక్కటి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. దుల్కర్, అదితీ, కాజల్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. చేసే పాత్రలో ఒదిగిపోవడం వాళ్ళకు బాగానే అలవాటు. అయితే వచ్చిన చిక్కల్లా సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే, రన్ టైమ్ గురించే!

నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంత ప్రతిభావంతులైనా కథ బలంగానూ, చెప్పే విధానం ఆసక్తికరంగానూ లేకపోతే వాళ్ళ శ్రమ బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. అదే ఈ సినిమా విషయంలోనూ జరిగింది. నిజానికి ఆర్యన్ కు మౌనా విడాకులు ఇవ్వాలనుకోవడానికి బలమైన కారణమే ఉండదు. ఈ కాలం మహిళగా ఆమె కొంత స్వేచ్ఛను కోరుకోవడంలో తప్పులేదు. కానీ అది అతని నుండి దక్కదేమో అనే నిర్ణయానికి వచ్చేయడంలో అర్థం లేదు. తన భర్తను వలలో వేసుకోమని డాక్టర్ ను మౌనా కోరడం, ఎదురుడబ్బులిచ్చి ఆర్జే గా జాబ్ సెట్ చేయడం మరీ హాస్యాస్పందంగా ఉంది. ఆర్యన్ పాత్రను ఎంత గొప్పగా చూపించారో, అతని భార్య పాత్రను అంత లైటర్ వీన్ లో రూపొందించారు. ఇక కాజల్ పాత్ర స్వభావం ఓ సాధారణ మహిళనే తలపిస్తోంది. దుల్కర్ సల్మాన్ నుండి ఈ తరం ప్రేక్షకులు ఇలాంటి సినిమాలను ఆశించడం లేదు. అతనిలో లవర్ బోయ్ ఛాయలు ఉన్నా ‘కనులు కనులను దోచాయంటే’ వంటి గ్రిప్పింగ్ థ్రిల్లర్ మూవీస్ ను జనం కోరుకుంటున్నారు. ఇలాంటి సినిమాలు ఓ పాతికేళ్ళ క్రితం వచ్చి ఉంటే ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా కేటగిరిలో చెల్లుబాటు అయ్యేవేమో! కానీ ఇవాళ కష్టం. ఈ మూవీని ఓ గంట ట్రిమ్ చేసి, ఓటీటీలో విడుదల చేసి ఉంటే బెటర్ గా ఉండేది.

రేటింగ్: 2.25 / 5

ప్లస్ పాయింట్స్
ఆర్టిస్టుల అభినయం
టెక్నీషియన్స్ ప్రతిభ

మైనెస్ పాయింట్
కథలో కొత్తదనం లేకపోవడం
సహనాన్ని పరీక్షించే కథనం
మూవీ రన్ టైమ్

ట్యాగ్ లైన్: హే సహనం కావాలి!