NTV Telugu Site icon

రివ్యూ : హీరో

సినీ, రాజకీయ కుటుంబాలతో అనుబంధం ఉన్న అశోక్ గల్లా హీరోగా అరంగేట్రం చేసిన సినిమా ‘హీరో’. ఇటు తాత కృష్ణ పేరు మోసిన స్టార్ హీరో, మేనమామ మహేశ్ బాబు ఈ నాటి మేటి హీరో. వీరి అండదండలతో పాటు, అటు తండ్రి గల్లా జయదేవ్, నాన్నమ్మ గల్లా అరుణకుమారి రాజకీయరంగంలో పేరొందినవారు. వీరి వారసుడు కాబట్టి అశోక్ గల్లా ‘హీరో’పై అందరి దృష్టి మళ్ళింది. అయితే సినిమా నిర్మాణంలో జరిగిన తీవ్ర జాప్యంతో దీనిపై జనాలకు పెద్దంత అంచనాలు లేవు.

కథ ఏమిటంటే- హీరో కావాలని కలలు కంటుంటాడు అర్జున్ (అశోక్ గల్లా). అతని తండ్రి నరేశ్ వెటర్నరీ డాక్టర్. తల్లి గృహిణి. తండ్రి అతన్ని నిరుత్సాహపరిస్తే, తల్లి మాత్రం ఎంకరేజ్ చేస్తుంది. ఇదే సమయంలో వాళ్ళ అపార్ట్ మెంట్ లోకి అద్దెకు వచ్చిన సుభద్ర (నిధి అగర్వాల్)తో ప్రేమలో పడతాడు అశోక్. జుత్తు రాలిపోతోందని ఆన్ లైన్ లో హెయిర్ ఆయిల్ ఆర్డర్ చేస్తే… దానికి బదులు ఓ తుపాకీ వస్తుంది. అంతేకాదు… ఆ తర్వాత ఓ ఫోటో పంపి, తుపాకీతో అతన్ని చంపమనే లేఖ కూడా వస్తుంది. తీరా చూస్తే ఆ ఫోటో తాను ప్రేమించే సుభద్ర తండ్రిది. అప్పటి వరకూ ముంబైలో ఉన్న సుభద్ర తండ్రి హైదరాబాద్ వచ్చి భార్యను, కూతురును తీసుకుని ఫారిన్ వెళ్ళిపోవడానికి సిద్ధపడతాడు. ఈ లోగా ప్రేమ, పెళ్ళి వంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దని కూతురుకు వార్నింగ్ ఇస్తాడు. అసలు సుభద్ర తండ్రి నేపథ్యం ఏమిటి? అర్జున్ కు కొరియర్ లో వచ్చిన పిస్టల్ వెనుక కథ ఏమిటీ? సుభద్రను ప్రేమించిన అర్జున్ కోరిక నెరవేరిందా? హీరో కావాలనుకున్న అతని ఆశలు ఫలించాయా? అదే ‘హీరో’ మిగతా కథ.

అశోక్ గల్లా అభినయంలో మంచి ఈజ్ కనిపించింది. తొలి చిత్రంలోనే రకరకాల గెటప్స్ తో అతను మెప్పించాడు. ముఖ్యంగా హీరో ఇంట్రడక్షన్ సీన్ అదిరిపోయింది. మూవీకి మంచి పునాది వేసింది. అతని జోడీగా అందాల భామ నిధి అగర్వాల్ మురిపించింది. నిజం చెప్పాలంటే నిధి ముందు కొత్త కుర్రాడు తేలిపోవాలి. కానీ, అశోక్ లోని ఎస్సెట్స్ ను వెలికి తీయడంలో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య సక్సెస్ అయ్యాడు. కథంతా రేసీగా సాగడంతో ఎక్కడా బోర్ అనేది కొట్టదు. ద్వితీయార్థంలో జగపతిబాబు ఫ్లాష్ బ్యాక్ కాస్తంత కామెడీగా ఉన్నా… నరేశ్‌ డైలాగ్ తో తమ మీద తామే సెటైర్ వేసుకుంది చిత్రబృందం. జగపతిబాబు నటన కూడా చాలా బాగుంది. ఇక ఇలాంటి పాత్రలు పోషించడం నరేశ్‌ కు కొట్టిన పిండి. అతని భార్యగా, హీరో తల్లిగా ‘కార్తీక దీపం’ ఫేమ్ అర్చనా సౌందర్య చక్కగా సరిపోయింది. హీరో స్నేహితుడిగా సత్య, సేల్స్ మెన్ గా వెన్నెల కిశోర్, క్లయిమాక్స్ లో బ్రహ్మాజీ, ‘సత్యం’ రాజేశ్‌ పండించిన హాస్యం బాగుంది. ఇతర కీలక పాత్రలను రవి కిషన్‌, మైమ్ గోపి, కౌసల్య, అజయ్, కోట తదితరులు పోషించారు. వాళ్ళంత తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు.

జిబ్రాన్ అందించిన సంగీతం మూవీకి బాగా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా రెట్రో పార్టీలో ప్లే చేసిన సాంగ్స్ థియేటర్లో కృష్ణ అభిమానులతో ఈలలు వేయించేలా ఉన్నాయి. అయితే ర్యాప్ సాంగ్ మాత్రం తమిళ వాసనలు కొట్టింది. ద్వితీయార్థంలో కథాగమానానికి అడ్డు వస్తాయనే ఉద్దేశ్యంతో ఒక్క పాట కూడా పెట్టలేదు. ఆ కొరత తీర్చుతూ రోలింగ్ టైటిల్స్ ముందు ఓ డ్యుయెట్ ను ప్లే చేశారు. ఆ సమయంలోనూ థియేటర్ నుండి ఆడియెన్స్ లేచి వెళ్ళకపోవడం విశేషం. ఇందులో పాటలను రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, రోల్ రైడా రాశారు. అలానే సమీర్ రెడ్డి, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ మూవీని మరో లెవెల్ కు తీసుకెళ్ళింది. దర్శకులు వీరశంకర్, అనిల్ రావిపూడి, ఈ సినిమా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య సైతం తెర మీద తళుక్కున మెరియడం విశేషం. మాటలూ ఆకట్టుకునేలా సాగాయి.

ఈ చిత్రానికి అశోక్ తల్లి పద్మావతి గల్లా నిర్మాత కావడం వల్ల మేకింగ్ పరంగా ఎక్కడా రాజీ పడలేదు. అయితే సినిమా రంగం, అందులోని నటీనటుల గొప్పతనాన్ని వీలైనంతవరకూ పైకి లేపుతూనే, పనిలో పనిగా కొన్ని సెటర్స్ కూడా వేశారు. ఓ కొత్త హీరో నుండి ఇలాంటి చిత్రం రావడం గ్రేట్. ఆ క్రెడిట్ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యకు వెళుతుంది. సంక్రాంతి సీజన్ లో ఫ్యామిలీస్ తో కలిసి సరదాగా ఈ వినోదాల విందును ఆస్వాదించవచ్చు.

ప్లస్ పాయింట్స్:

మైనస్ పాయింట్స్:

రేటింగ్: 3/5

ట్యాగ్ లైన్: సంక్రాంతి ‘హీరో’!