NTV Telugu Site icon

Gangubai Review: గంగూబాయి కఠియావాడి (హిందీ – డబ్బింగ్)

gangubai

gangubai

పదేళ్ళ క్రితం ‘స్టూడెంట్ ఆఫ్‌ ది ఇయర్’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అలియాభట్… గడిచిన దశాబ్దంలో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించింది. అయితే ఆమె చేసిన లేడీ ఓరియంటెడ్ చిత్రాలను వేళ్ళ మీద లెక్కించాల్సిందే. ‘రాజీ’ తర్వాత ఆమె నటించిన అలాంటి మరో సినిమా ‘గంగూబాయి కఠియావాడి’. ముంబైలోని అతి పెద్ద వేశ్యావాటిక కామాటిపురాలోని గంగూబాయి అనే నాయకురాలి జీవితం ఆధారంగా దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన సినిమా ఇది. అనేక సార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఫిబ్రవరి 25న జనం ముందుకు వచ్చింది.

కఠియావాడికి చెందిన గంగ (అలియాభట్)కు ఎప్పటికైనా ముంబాయి వెళ్ళి హీరోయిన్ కావాలన్నది కోరిక. ప్రేమించిన యువకుడి మాటలు నమ్మి, తల్లిదండ్రులకు చెప్పకుండా ముంబై పారిపోతుంది. అతనేమో డైరెక్ట్ గా కామాటిపూరాకు తీసుకెళ్ళి గంగను అమ్మేస్తాడు. ఆ సాలెగూడులో చిక్కుకున్న తర్వాత బయట పడటం అసాధ్యమని అతి తక్కువ సమయంలోనే గ్రహించిన గంగ వేశ్యగా మారిపోతుంది. గంగ కాస్త… గంగూగా మారుతుంది. కొద్ది రోజులకే కామాటిపూరాను హస్తగతం చేసుకుని గంగూబాయిగా ఎదుగుతుంది. ఈ ప్రయాణంలో రహీమ్ లాలా (అజయ్ దేవ్ గన్) ఆమెకు దన్నుగా నిలుస్తాడు. ఓ సాదాసీదా యువతిగా కామాటిపురాలో అడుగుపెట్టిన గంగ భారత ప్రధానిని కలిసి పడుపువృత్తిలోని మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపడటం కోసం, వారి మానమర్యాదలను కాపాడటం కోసం చేసే కృషే ఈ సినిమా.

దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ రెడ్ లైట్ ఏరియాకు చెందిన గంగూబాయి జీవిత కథను తెరకెక్కిస్తానని ప్రకటించినప్పుడు చాలామంది ఆశ్యర్యపోయారు. ఆమె జీవితంలో అంతగొప్ప సంఘటనలు ఏమున్నాయి? అనే ఆలోచనలో పడ్డారు. ఇక ఆ పాత్రకు అలియాను ఎంపిక చేశారని తెలిశాక వారి అనుమానాలు మరింత పెరిగిపోయాయి. వేశ్యావాటిక నిర్వాహకురాలి పాత్రకు అలియా ఏం ఆనుతుంది? అనే సందేహాలను అనేకమంది వ్యక్తం చేశారు. వారి అనుమానాలకు, సందేహాలకు సినిమాతో సమాధానం చెప్పాడు భన్సాలీ. గంగూబాయి జీవితాన్ని పాజిటివ్ యాంగిల్ లో తెర మీద చూపిస్తూ, తన తోటి మహిళల హక్కుల కోసం ఆమె ఏం చేసిందనే విషయాన్ని హైలైట్ చేశాడు. అలానే కామాటిపురాపై తన పట్టును పెంచుకోవడానికి, తమ పిల్లలకు విద్యాబుద్దులు నెరపడానికి ఆమె చేసిన కృషిని ప్రధానంగా చూపించాడు. దాంతో సహజంగానే గంగూబాయి పాత్రలోకి ‘హీరోయిజం’ వచ్చి చేరింది. నిజ జీవితంలో గంగూబాయి ఆ స్థాయికి చేరుకోవడానికి ఎన్నిఅకృత్యాలకు పాల్పడిందనే విషయానికి పోకుండా, తన మాట నెగ్గించుకోవడానికి ఎంతకైనా తెగించిందనేదే ప్రధానంగా చూపడంతో ఆడియెన్స్ ఆమె పాత్రతో కనెక్ట్ అయ్యారు.

నటీనటుల విషయానికి వస్తే… గంగూబాయి ఆకృతికి అలియా భట్ కు పొంతనే ఉండదు. అయితే గంగూబాయి పాత్రలోకి అలియా పరకాయ ప్రవేశం చేసి, ఆ లోటును ఆడియెన్స్ కి కలగకుండా చేసింది. తన ప్రతిభతో జాణతనాన్ని, జాలిగుణాన్నిచూపించి ప్రేక్షకుల మెప్పుపొందింది. నిజానికి ఈ పాత్రను వేరెవరికైనా ఇస్తే… పాత్ర కోసమైనా ద్వితీయార్థంలో కాస్తంత ఒళ్ళు పెంచేవారేమో. కానీ అలియా భట్ మాత్రం ఆహార్యంతోనూ, నటనతోనూ నెగ్గుకొచ్చేసింది. వేశ్యావాటిక నిర్వాహకురాలిగా సీమా పహ్వా సహజ నటనను ప్రదర్శించింది. కామాటిపూరాను తన చెప్పుచేతల్లో ఉంచుకునే రజియాబాయి పాత్రలో విజయ్ రాజ్ మెప్పించాడు. అజయ్ దేవ్ గన్ ది అతిథి పాత్ర అని టైటిల్స్ లో వేసినా, అంతకు మించి ప్రాధాన్యమున్న పాత్రను చేశాడు. అతని అప్పియరెన్స్ సినిమాకు చక్కని బలాన్ని చేకూర్చింది. ఇక జర్నలిస్ట్ గా జిమ్ సెరబ్, గంగ ప్రియుడిగా వరుణ్ కపూర్, కమ్లీగా ఇందిరా తివారి నటించారు. గంగూబాయిపై మనసు పడే యువకుడిగా శంతను మహేశ్వరి చక్కటి హావభావాలు ప్రదర్శించాడు. ఇటీవల విడుదలైన ‘వలిమై’లో కీలక పాత్ర పోషించిన హుమా ఖురేషీ ఇందులో గజల్ గాయనిగా మెరిసింది. ఆ గజల్ ఎంతో అర్థవంతంగానూ ఉంది.

ఇది కామాటిపురాకు సంబంధించిన కథ కావడంతో కాస్తంత మసాలాను భన్సాలీ దట్టించి ఉంటాడని ఆశ పడేవారికి నిరాశ తప్పదు. పడుపు వృత్తిలోని మహిళల ‘ఇజ్జత్’ను కాపాడాలంటూ గంగూబాయి చేసిన పోరాటాన్నిప్రధానాంశంగా తీసుకుని భన్సాలీ తీసిన ఈ సినిమా నిజంగానే వారి ఇజ్జత్ ను కాపాడే విధంగానే తెరకెక్కించాడు. అశ్లీలతకు, అసభ్యతకు తావు లేకుండా తీశాడు. అయితే… ఇందులో భన్సాలీ మార్క్ పాటలు, సంగీతం కాస్త మిస్ అయ్యాయని చెప్పాలి. హీరోయిన్ కావాలని ముంబై వచ్చిన గంగ జీవితమే ఓ సినిమాగా రూపుదిద్దుకోవడం అనేది విధి వైచిత్రి! ఇదే మాటలతో ఈ సినిమా ముగుస్తుంది!! మొత్తంగా దీన్నిసంజయ్ లీలా భన్సాలీ, అలియా భట్ షో గా చెప్పుకోవాలి.

ప్లస్ పాయింట్స్ :

అలియా భట్ నటన
ప్రొడక్షన్ వాల్యూస్
ఆలోచింప చేసే డైలాగ్స్

మైనెస్ పాయింట్స్ :

బలహీనమైన సన్నివేశాలు
ఆకట్టుకోని పాటలు

రేటింగ్: 3/5

ట్యాగ్ లైన్: అలియా… కమాల్ కియా!