NTV Telugu Site icon

రివ్యూ: ‘క్లైమాక్స్’ మూవీ

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు చిత్రసీమలో అనేకానేక భిన్నమైన పాత్రలు చేస్తూ వస్తున్నారు. కథానాయకుడిగా అవకాశం రావాలే కానీ ఇప్పటికీ సై అంటున్నారు. అలా ఆయన నటించిన తాజా చిత్రం ‘క్లైమాక్స్’. దాదాపు పదేళ్ళ క్రితం దర్శకుడు భవానీ శంకర్‌… రాజేంద్ర ప్రసాద్ తో ‘డ్రీమ్’ మూవీని తెరకెక్కించాడు. ఆ చిత్రానికి అంతర్జాతీయంగా పలు అవార్డులు వచ్చాయి. ఇప్పుడు ఆ దర్శకుడే మరోసారి రాజేంద్ర ప్రసాద్ హీరోగా ‘క్లైమాక్స్’ మూవీని తెరకెక్కించాడు. కరుణాకర్ రెడ్డి, రాజేశ్వరరెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ శుక్రవారం విడుదలైంది.

విజయ్ మోదీ (రాజేంద్ర ప్రసాద్) ఓ బిజినెస్ మాగ్నెట్. అతనికి ఇద్దరు భార్యలు, వారికి ఇద్దరు పిల్లలు. వయసు పైబడినా అమ్మాయిలంటే అతనికి కాస్తంత ఆసక్తి. అనివార్య కారణాల వల్ల తన సొంత భవంతిని వదిలి ఫైవ్ స్టార్ హోటల్లో గడుపుతుంటాడు. రాష్ట్ర మంత్రికి అతను బినామీ అని కూడా ప్రచారం జరుగుతుంటుంది. వ్యాపార వేత్తగా కోట్లు గడించినా… తగినంత పేరు ప్రఖ్యాతులు దక్కడం లేదనే బాధ విజయ్ మోదీని కుదురుగా నిలబడ నీయదు. దాంతో రియల్ ఎస్టేట్ రంగంలోకి, సినిమా నిర్మాణంలోకి అడుగుపెడతాడు. తానే హీరోగా సినిమాలూ నిర్మిస్తాడు. తన వినైల్ పోస్టర్స్ తో నగరాన్ని నింపేస్తాడు. అలాంటి విజయ్ మోదీ జీవితంలోకి ఓ అందమైన అమ్మాయి ప్రవేశిస్తుంది. కేవలం ఒకే ఒక్క రాత్రి అతని గదిలో గడుపుతుంది. తెల్లవారు ఝూమున చూస్తే విజయ్ మోదీ హత్యకు గురవుతాడు. ఈ హత్య చేసింది ఎవరు? అలాంటి అవసరం ఎవరికి ఉంది? ఈ మర్డర్ మిస్టరీని ఎలా ఛేదించారు? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా.

ఇందులో తాను హీరోను కాదని, తనది విలన్ పాత్ర అని విజయ్ మోదీ పాత్రతోనే దర్శకుడు చెప్పిస్తాడు. తన అవకాశ వాదాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం కూడా అతనెప్పుడు చేయడు. ఇలాంటి కథలు తెలుగులో కాస్తంత తక్కువే వచ్చాయి. నిజం చెప్పాలంటే… రాజేంద్ర ప్రసాద్ లాంటి పాపులర్ నటుడు ఇలాంటి కథలు చేయలేదు. అలాంటిది ధైర్యం చేసి ఆయన ఈ పాత్ర చేయడం విశేషమే. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను సాషా సింగ్, నాగరాజు, శ్రీరెడ్డి, పృథ్వీరాజ్, శివశంకర్ మాస్టర్, రమేశ్ తదితరులు పోషించారు. మరికొన్ని పాత్రలను కొత్తవారు చేశారు. అయితే… ఈ మర్డర్ మిస్టరీ మూవీ క్లయిమాక్స్ ఊహకు అందేవిధంగా ఉంది. అందరూ అనుకున్నటే పతాక సన్నివేశం ఉన్నా… చివరలో దర్శకుడు ఊహకందని మరో ట్విస్ట్ ను ఇవ్వడం బాగుంది. 

రాజేంద్ర ప్రసాద్ గెటప్ చూస్తే… మన ప్రధాని నరేంద్ర మోదీ గుర్తొస్తారు. కానీ ఈ క్యారెక్టర్ కు బేస్ ఆర్థిక నేరాలతో ఈ దేశం వదిలి పారిపోయిన నీరవ్ మోదీ. బ్యాంకుల దగ్గర కోట్ల రూపాయలను అప్పుగా తీసుకుని, జల్సా చేసే వ్యాపారవేత్తగా రాజేంద్ర ప్రసాద్ బాగా నటించారు. ఆయన బాడీ లాంగ్వేజ్ సైతం ఇందులో గమ్మత్తుగా ఉంది. ఇక భవ్యగా సాషాసింగ్, ఆమె తండ్రిగా నాగరాజ్, మోదీ హత్యకేసును విచారించే అధికారిగా రమేశ్ చక్కగా నటించారు. రాజేశ్‌, నిద్వాన సంగీతం బాగుంది. అలానే ఫోటోగ్రఫీ కూడా. ఈ మూవీ కథలో పెద్దంత బలం లేదు. ఓ చిన్న పాయింట్ తీసుకుని దర్శకుడు భవానీ శంకర్ 90 నిమిషాల నిడివి ఉన్న సినిమాగా తెరకెక్కించాడు. అలానే చాలా సన్నివేశాలు తేలిపోతాయి. ప్రేక్షకులను ఆకట్టుకోవు. నిజానికి ఇలాంటి సినిమాలకు కేవలం క్లైమాక్స్ బాగుంటే సరిపోదు. ప్రారంభం నుండి ముగింపు వరకూ ప్రేక్షకులను సీటులో కూర్చోపెట్టే టెంపో ఉండాలి. ఇందులో అది కొరవడింది. ఇలాంటి సినిమాలను థియేటర్లలో విడుదల చేసే కంటే… ఓటీటీలో రిలీజ్ చేస్తే బెటర్. అక్కడ ఉచితంga సినిమాను చూస్తారు కాబట్టి… పెద్దంత పెయిన్ ఫీల్ కారు!

ప్లస్ పాయింట్స్

రాజేంద్ర ప్రసాద్ నటన
ఆకట్టుకునే నేపథ్య సంగీతం
సినిమాటోగ్రఫీ, సీజీ వర్క్
క్లైమాక్స్ లోని ట్విస్ట్

మైనెస్ పాయింట్స్

పేలవమైన కథ, కథనాలు
కొరవడిన నిర్మాణ విలువలు 

రేటింగ్
2 / 5

ట్యాగ్ లైన్
‘క్లైమాక్స్’ బాగుంటే సరిపోదు!