NTV Telugu Site icon

రివ్యూ : భూమిక (తమిళ డబ్బింగ్)

Boomika Movie Review

Boomika Movie Review

అలనాటి కథానాయకుడు రాజేశ్ కుమార్తె ఐశ్వర్య రాజేశ్ కు తెలుగులో కంటే తమిళ చిత్రసీమలో వచ్చిన గుర్తింపు ఎక్కువ. గ్లామర్ డాల్ గా కాకుండా అర్థవంతమైన సినిమాలు, పాత్రలు చేస్తున్న ఐశ్వర్యా రాజేశ్‌ కు ఇటీవలే తెలుగులోనూ అవకాశాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ‘కౌసల్య కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీస్ లో నటించిన ఐశ్వర్య ‘రిపబ్లిక్, టక్ జగదీశ్, భీమ్లా నాయక్’ చిత్రాలలోనూ కీలక పాత్రలు పోషిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మొన్నటి వరకూ మూత పడిన నేపథ్యంలో ఐశ్వర్యా రాజేశ్ నటించిన ‘తిట్టం ఇరాండు’ చిత్రం సోనీ లైవ్ లో జూలై నెలాఖరులో ప్రసారం కాగా, మూడు వారాల్లోనే ఆమె ప్రధాన పాత్ర పోషిషించిన ‘భూమిక’ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ సైతం అందుబాటులో ఉంది.

గౌతమ్ (విధు) రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటాడు. అతని భార్య, సైకాలజిస్ట్ సంయుక్త (ఐశ్వర్యా రాజేశ్) అతనికి చేదోడు వాదోడుగా ఉంటుంది. ఊటీ సమీపంలో ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ నిర్మాణం కోసం గౌతమ్ తన భార్య, కొడుకుతో కలిసి అక్కడి ఓ పురాతనమైన స్కూల్ లో విడిది చేస్తాడు. గౌతమ్ సోదరి అదితి (మాధురి), స్నేహితురాలు, ప్రముఖ ఆర్కిటెక్చర్ గాయత్రి (సూర్య గణపతి) కూడా అతనికి ఈ ప్రాజెక్ట్ లో సాయం చేసేందుకు అక్కడకు వస్తారు. వీరికి సహాయంగా ధర్మన్ (పర్వేల్ నవ గీతమ్) ఉంటాడు. పగలంతా బాగానే ఉన్నా రాత్రి అయ్యే సరికీ ఆ భవంతిలో వీరి ఊహకందని సంఘటనలు జరుగుతుంటాయి. అక్కడ జరిగే పారానార్మల్ ఇన్సిడెంట్స్ కు, సమీప గ్రామంలోని వ్యక్తులకు ఏదో సంబంధం ఉందనే విషయం వారికి బోధపడుతుంది. వెంటాడే ఆత్మ నుండి, అగమ్య గోచరమైన సంఘటనల నుండి వీరు ఎలా బయట పడ్డారు? అసలు వీరికి ఎవరు? ఏ సందేశం ఇవ్వాలని భావిస్తున్నారు? అనేదే ‘భూమిక’ కథ.

తల్లి లాంటి ప్రకృతిని మనుషులు అభివృద్ధి పేరుతో నాశనం చేయాలని చూస్తే, ఆ ప్రకృతి ప్రకోపించి, మానవజాతి మీద కక్షతీర్చుకుంటుందనే సందేశం ఈ సినిమాలో ఉంది. నిజానికి ఇలాంటి కథాంశాలను ఇటీవల మన దర్శక నిర్మాతలు తెరకెక్కించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆ మధ్య వచ్చిన రానా ‘అరణ్య’ కథ కూడా ఇలాంటిదే. పర్యావరణాన్ని, అడవులను నాశనం చేసుకుంటూ పోతే… మనిషి మనుగడే ప్రశ్నార్థకం అవుతుందనేది ఆ సినిమాలోనూ చూపించారు. అయితే అందులో సామాజికాంశాలను బేస్ చేసుకుని కథ సాగితే, ఇందులో మాత్రం హారర్ బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు కథను నడిపాడు. ఇక ద్వితీయార్థంలో మనిషిని భూమికి ప్రతీకగా చూపడం అనేది ఆసక్తికరంగా ఉంది. మహేశ్ బాబు ‘బ్రహ్మోత్సవం’ మొదలు కొని మొన్నటి పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ వరకూ పలు చిత్రాలలో బాలనటిగా మెప్పించిన అవంతిక వందనపు ‘భూమిక’ పాత్రకు ప్రాణం పోసింది. అయితే దర్శకుడు సందేశాన్ని చెప్పడానికి ఇచ్చిన ప్రాధాన్యం కథను ఆసక్తికరంగా చూపడానికి ఇవ్వలేదు. చాలా సన్నివేశాలలో తమిళ చిత్రాలలో ఉండే అతి కనిపిస్తుంటుంది. ఐశ్వర్యా రాజేశ్ పాత్రోచితంగా నటించినా, ఆమె క్యారెక్టరైజేషన్ మీద దర్శకుడు తగినంత శ్రద్ధ చూపించినట్టు అనిపించదు. గౌతమ్ గా విధు, అతని స్నేహితురాలు గాయత్రిగా సూర్య గణపతి బాగానే చేశారు. అయితే… ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆర్కిటెక్చర్ తన స్నేహితుడు కోరగానే అతను ఎంచుకున్న ప్రదేశం, దాని ప్రాముఖ్యతలను గుర్తించకుండా వెంచర్ లో సాయం చేయడానికి ముందుకు రావడం హాస్యాస్పదంగా ఉంది. గౌతమ్ చెల్లిగా మాధురి ఫర్వాలేదనిపిస్తుంది. పర్వేల్ నవగీతమ్ తన నటనతో ఆకట్టుకున్నాడు.

సాంకేతిక నిపుణులలో పెద్ద పీట వేయాల్సిన వ్యక్తి సినిమాటోగ్రాఫర్ రాబర్టో జజారా! అడవి అందాలనే కాదు… పాడుబడిన భవంతిలోని హారర్ సన్నివేశాలనూ అద్భుతంగా అతని కెమెరా క్యాప్చర్ చేసింది. అలానే హారర్ సీన్స్ ను చంద్రశేఖర్ తన రీరికార్డింగ్ తో మరింత ఎలివేట్ చేసే ప్రయత్నం చేశాడు. వి.ఎఫ్.ఎక్స్. క్వాలిటీ అంత గొప్పగా లేదు. దర్శకుడు కార్తీక్ సుబ్బారాజు నిర్మించిన ఈ ఎకో హారర్ థ్రిల్లర్ మూవీని దర్శకుడు రతీంద్రన్ ఆర్ ప్రసాద్ తనదైన పంథాలో తెరకెక్కించాడు. కానీ దీనిని మరింత పకడ్బందీగా, ఆసక్తిరకంగా తీసి ఉండాల్సింది. మంచి సందేశాన్ని ప్రేక్షకులకు ఇవ్వడం ఎంత ప్రధానమో, అదే రీతిలో ఎక్కువ మందిని అది చేరేలా జాగ్రత్తలు తీసుకోవడమూ అంతే ప్రధానం. కానీ ఇందులో అది మిస్ అయ్యింది. అయితే హారర్, థ్రిల్లర్ మూవీస్ ను ఇష్టపడే వారికి, ప్రకృతి ప్రేమికులకు ఈ సినిమా నచ్చే ఆస్కారం లేకపోలేదు. విశేషం ఏమంటే… ఈ సినిమా విజయ్ టీవీలో ప్రసారం అయిన రోజునే నెట్ ఫ్లిక్స్ లోనూ స్ట్రీమింగ్ అయ్యింది. అలా దర్శక నిర్మాతలు చెప్పాలనుకున్న సందేశం జనాలకు ఉచితంగా చేరిందనుకోవచ్చు.

ప్లస్ పాయింట్స్

మైనెస్ పాయింట్స్

రేటింగ్: 2.25 / 5