NTV Telugu Site icon

రివ్యూ: అత్రంగీ రే (ఓటీటీ)

Atrangi-Re

తమిళ స్టార్ హీరో ధనుష్ ఇప్పటికే బాలీవుడ్ లో ‘రాంఝనా’, ‘షమితాబ్’ చిత్రాలతో నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. ధనుష్ తో ‘రాంఝానా’ మూవీ తెరకెక్కించిన ఆనంద్ ఎల్. రాయ్ తీసి తాజా చిత్రం ‘అత్రంగీ రే’. అక్షయ్ కుమార్, ధనుష్, సారా అలీఖాన్ నటించిన ఈ ముక్కోణ ప్రేమకథా చిత్రం ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

బీహార్ లోని శివాన్ కు చెందిన రింకు (సారా అలీఖాన్) పద్నాలుగేళ్ళ వయసులోనే సజ్జద్ అలీఖాన్ (అక్షయ్ కుమార్)తో ప్రేమలో పడుతుంది. తల్లిదండ్రులను చిన్నతనంలోనే కోల్పోయిన రింకును అమ్మమ్మ, మేనమావలే పెంచుతారు. ఆమె తన ప్రియుడుతో కలిసి పారిపోవాలని చూసిన ప్రతిసారి ఏదోరకంగా పట్టుకుని ఇంటికి తీసుకొచ్చి బంధిస్తారు. ఆమె ఎవరిని ప్రేమిస్తోంది? ఎవరితో పారిపోవాలని అనుకుంటోందనేది మాత్రం వారికి తెలియదు. ఇరవై నాలుగు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎవరో ఒకరితో రింకుకు పెళ్ళి చేసి పంపేయాలని నిర్ణయించుకున్న అమ్మమ్మ… తన కొడుకులకు చెప్పి, ఓ కుర్రాడిని కిడ్నాప్ చేసి తీసుకురమ్మంటుంది. స్నేహితుడితో కలిసి శివాన్ గ్రామానికి వెళ్ళిన తమిళ బ్రాహ్మణ కుర్రాడు, మెడిసన్ చదివే విషు (ధనుష్‌)ను వాళ్ళు కిడ్నాప్ చేస్తారు. అంతేకాదు… రింకుతో అతనికి బలవంతంగా పెళ్ళి చేసి, వారిద్దరినీ ఢిల్లీ రైలు ఎక్కించేస్తారు. నిజానికి అప్పటికే విషు మందాకిని (డింపుల్ హయతీ) అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. రెండు రోజుల్లో మధురైలో అతని నిశ్చితార్థం జరగాల్సి ఉంటుంది. తప్పని పరిస్థితుల్లో రింకును పెళ్ళాడిన విషు… ఢిల్లీ చేరి, ఆమెను సజ్జద్ అలీఖాన్ చేతిలో పెట్టేసి, నిశ్చితార్థానికి మధురై వెళ్ళిపోవాలని అనుకుంటాడు. అయితే సజ్జద్ కు రింకును విషు అప్పగించాడా? టీనేజ్ లో సజ్జద్ తో ప్రేమలో పడిన రింకు… అతని గురించి తన కుటుంబ సభ్యులకు ఎందుకు చెప్పలేకపోయింది? బాల్యంలోనే రింకు తల్లిదండ్రులను ఎలా కోల్పోయింది? ఈ ప్రశ్నలకు సమాధానమే ‘అత్రంగీ రే’ సినిమా.

చూడటానికి ఇది ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా కనిపించినా… అంతకు మించిన సైకలాజికల్ డ్రామా ఇందులో ఉంది. రింకు జీవితంతో పెనవేసుకున్న కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు ఆమెను ఎలా మానసిక రోగిని చేశాయనే అంశాలు, అందులోంచి ఆమె బయటకు రావడానికి విషు, అతని స్నేహితుడు ఎమ్మెస్ (ఆశిష్ వర్మ) ఎలాంటి ప్రయత్నం చేశారనేది తెరమీద చూడాల్సిందే. ఇష్టంలేని పెళ్ళి చేసుకున్న విషు… తనకు తెలియకుండానే రింకు పట్ల ప్రేమను పెంచుకోవడం, ఆమె మనసులో తిష్టవేసుకుని కూర్చున్న సజ్జద్ అలీని తొలగించడం అనేవి ఆసక్తికరమైన సన్నివేశాలు. ఇంటి నుండి పారిపోవడానికి రింకు రైల్వే స్టేషన్ కు వచ్చినప్పుడు మొదలయ్యే ఈ సినిమా, ఆమె విషు ఒడిలోకి రైల్వేస్టేషన్ లోనే చేరడంతో ముగుస్తుంది. ఆ రకంగా రైల్వేస్టేషన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. ఇమేజినరీ లోకంలో బ్రతికే ఓ అమ్మాయి, తానే చేస్తున్నాడో తనకే అర్థంకాని ఓ మెడికో, ఎదుటి వారని తన మ్యాజిక్ తో మెస్మరైజ్ చేసే మెజీషియన్ ఈ ముగ్గురి మధ్య సాగే కథే ‘అత్రంగీ రే’!

ఓ సంక్లిష్టమైన కథను వీలైనంత సులువుగా తెర మీద ప్రెజెంట్ చేయడానికి దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ ప్రయత్నించాడు. ఊహకందని మలుపులతో దీనిని ఆసక్తికరంగా చూపించాలని అనుకున్నాడు. బట్… కొన్ని సన్నివేశాలు ఆశ్చర్యానికి లోను చేస్తే, మరి కొన్ని సన్నివేశాలు మరీ ఇంత ఇల్లాజికల్ గా తీశాడేమిటీ అనిపిస్తాయి. ఇంటి నుండి రింకు పారిపోయిన ప్రతిసారి తిరిగి తీసుకొచ్చిన అమ్మమ్మ, ముక్కుమొఖం తెలియని వాడితో మూడు ముళ్ళూ వేయించేసి, ఆ కొత్త జంటను ఢిల్లీ రైలు ఎక్కించి చేతులు దులుపుకోవడంలో రీజన్ కనిపించదు. స్నేహితుడి బదులు ధనుష్‌ ను వాళ్ళు ఎలా కిడ్నాప్ చేశారో అర్థం కాదు. రింకు తల్లిదండ్రుల దారుణ హత్య వెనుకా బలమైన కారణాలు కనిపించవు. తండ్రి లాంటి భర్త దక్కాలను అనుకునే అమ్మాయిలు చాలామందే ఉంటారు. కానీ సజ్జద్ అలీని రింకు ప్రేమించడం, ఆ మాయలోంచి బయటకు వచ్చేందుకు ఎంచుకున్న సన్నివేశాలు… అందులో తండ్రీ, ప్రియుడు ఒక్కరే కావడం, అదే సమయంలో తల్లి పాత్రను సారా అలీఖాన్ తో చేయించడంతో కథను అర్థం చేసుకని, ఓ అవగాహనకు రావడానికి కాస్తంత సమయం పడుతుంది. ప్రేక్షకులకు ఓ పజిల్ ను ఇచ్చి దాన్ని దర్శకుడు సాల్వ్ చేయమన్నట్టుగా అనిపిస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే… రింకు పాత్రను సారా అలీఖాన్ చాలా చలాకీగా పోషించింది. అక్షయ్ కుమార్ ఆమె ప్రియుడు అనగానే కాస్తంత కంగారు పడే ప్రేక్షకుడు, మూవీ చివరలో దానికి కారణం తెలిసి, స్థిమిత పడతాడు. ధనుష్ ను విషు పాత్రకు ఎంపిక చేయడంలో రీజన్ ఉంది. అతను పోషించింది తమిళ కుర్రాడి పాత్ర కాబట్టి ఎక్కడా ఆడ్ గా అనిపించదు. పైగా సందర్భోచితంగా తమిళంలోనే ఆ పాత్రతో మాట్లాడించాడు దర్శకుడు. ఎప్పటిలానే ధనుష్‌ తనదైన సహజ నటన ప్రదర్శించాడు. (చిత్రం ఏమంటే ధనుష్ ఇంతవరకూ నటించిన మూడు హిందీ చిత్రాలలోనూ అతనికి జోడీగా నటవారసురాళ్లే నటించారు. ‘రాంఝానా’లో అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ నటిస్తే, ‘షమితాబ్’లో కమల్ హాసన్ కూతురు అక్షర హాసన్ నటించింది. ఇప్పుడీ సినిమాలో సైఫ్ అలీఖాన్, అమృతా సింగ్ కూతురు సారా… ధనుష్‌ తో జోడీ కట్టింది) ఇక ధనుష్‌ తల్లిదండ్రులుగా ఇందులో సంయుక్త (నిత్యా రవీంద్రన్), ఆనంద్ బాబు నటించారు. ప్రియురాలు మందాకిని పాత్రను పలు తెలుగు చిత్రాలలో నటించిన డింపుల్ హహతి పోషించింది. ఇతర ప్రధాన పాత్రలను ఇటు తమిళ, అటు హిందీ నటీనటులు చేశారు. ఎ. ఆర్. రెహమాన్ అందించిన సంగీతం బాగానే ఉంది. కానీ ఆయన స్థాయిలో ఒక్క పాట కూడా లేకపోవడం ఓ రకంగా మైనెస్సే! థియేటర్లలో విడుదలై ఉంటే ‘అత్రంగీ రే’కు ఎలాంటి స్పందన వచ్చేదో చెప్పలేం కానీ… ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతోంది కాబట్టి… ఓ సారి చూసేయొచ్చు.

ప్లస్ పాయింట్స్
నటీనటుల సహజ నటన
ఎంచుకున్న కథ
సాంకేతిక నిపుణుల పనితనం

మెనెస్ పాయింట్స్
బలహీనమైన కథనం
ఆకట్టుకోని సన్నివేశాలు

రేటింగ్ : 2.5/5

ట్యాగ్ లైన్: సైకలాజికల్ డ్రామా!