హారర్ కామెడీ చిత్రాలు తాప్సీ కి కొత్త కాదు. ఆమె తెలుగులో నటించిన ‘ఆనందో బ్రహ్మ’ చిత్రం చక్కని విజయాన్ని సాధించింది. బహుశా ఆ నమ్మకంతోనే కావచ్చు. తాప్సీ తమిళంలో ‘అనబెల్ అండ్ సేతుపతి’ చిత్రంలో నటించడానికి అంగీకరించింది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి సైతం ఇందులో ఓ ప్రధాన పాత్ర పోషించడం ఆమె అంగీకారానికి మరో కారణం కావచ్చు. కానీ ఇటు విజయ్ సేతుపతి, అటు తాప్సీ ఇద్దరూ ఈ సినిమాను గట్టెక్కించలేకపోయారు. ఈ సినిమా తెలుగు వర్షన్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
1940 సంవత్సరంలో కథ మొదలవుతుంది. అప్పట్లో వీర సేతుపతి (విజయ్ సేతుపతి) తన భార్య అనబెల్ (తాప్సీ) కోసం ఓ అద్భుతమైన భవంతిని కట్టిస్తాడు. ప్రపంచంలోని ఎనిమిది దేశాల నుండి వివిధ రంగాలకు చెందిన ఎనిమిది మంది నిపుణులను తెప్చించి తన సృజనాత్మకను జోడిస్తాడు. కొంతకాలానికి అటుగా వచ్చిన జగపతిబాబు దృష్టి ఆ భవంతి మీద పడుతుంది. దానిని చేజిక్కించుకోవడం కోసం కుట్ర పన్నుతాడు. ఇక ప్రస్తుతానికి వస్తే… ఆ రాజ ప్రసాదంపై దెయ్యాల కొంప అనే ముద్ర పడుతుంది. పౌర్ణమి రోజు అందులోకి వెళ్ళిన వారు తిరిగి ప్రాణాలతో రారనే ప్రచారం జరుగుతుంటుంది. ఆ శిధిలమైన భవంతి గురించి తెలియని రాజేంద్ర ప్రసాద్, రాధిక, తాప్సీ, సునీల్… దానిని బాగు చేయడం కోసం వస్తారు. బేసికల్ గా దొంగలైన వారి అసలు టార్గెట్ ఆ రాజ ప్రసాదంలోని విలువైన వస్తువులను దొంగిలించడం! మరి అందులోకి వెళ్ళిన ఈ దొంగల బ్యాచ్ కి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? వారు ప్రాణాలతో తిరిగి బయటకు వచ్చారా? లేదా? అసలు ఆ భవంతిలోని వెళ్లే వారు ఎందుకు హత్యకు గురి అవుతున్నారు? అనేది మిగతా కథ.
‘అనబెల్ అండ్ సేతుపతి’ పేరుకే హారర్ కామెడీ మూవీ. ఇందులో వినోదం లేదు… భయపట్టే సన్నివేశాలూ లేవు. ఓ పురాతన భవనం, అందులో దెయ్యాలు, అక్కడి వచ్చే వారిని అవి భయపెట్టడం, మూవీ క్లయిమాక్స్ కు వచ్చే సరికీ బతుకు జీవుడా అంటూ అందులోకి వెళ్ళిన వారిలో కొందరైనా బయటపడటం… ఈ నేపథ్యంలో వందల కొద్ది సినిమాలు వివిధ భాషల్లో వచ్చేశాయి. బహుశా అందుకే కావచ్చు ఇందులో ఓ పాత్ర ‘ఇందులో కొత్తదనం ఏముంది?’ అని అంటే, మరో పాత్ర ‘కొత్త కథలు ఎక్కడ నుండి వస్తాయి?’ అని ఎదురు ప్రశ్నిస్తుంది. ఈ సినిమా చూస్తున్న వారికి దర్శకుడు దీపక్ సుందర రాజన్ ఇలా ఇన్ డైరెక్ట్ గా సమాధానం చెప్పాడని అనుకోవచ్చు. చిత్రం ఏమంటే… ఈ సినిమా చూస్తుంటే ప్రస్తుతం తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో గుర్తొస్తుంది. పది, పదిహేను మంది హౌస్ నుండి బయటకు రాలేక, అక్కడే తిని, పడుకుంటూ రకరకాల విన్యాసాలు చేస్తుండటం మనం ఈ షోలో చూస్తున్నాం. ఇది కూడా దానికి తక్కువేమీ కాదు. ఇందులోనూ రాజప్రసాదంలోని దెయ్యాలు అలాంటి పనులే చేస్తుంటాయి. ఏదో ఒక రోజున, ఎవరో ఒకరు తమకు ఆ భవంతి నుండి విముక్తి కలిగించకపోతారా? అని ఆశపడుతుంటాయి. తాజాగా ఆ భవంతిలోకి వచ్చిన రుద్ర (తాప్సీ) ద్వారా అది జరుగుతుందనే నమ్మకంతో ఆమె కుటుంబానికి మాత్రం ఎలాంటి హానీ తలపెట్టరు.
ఈ కథలో ఏ అంశం నచ్చి విజయ్ సేతుపతి, తాప్సీ డేట్స్ ఇచ్చారో తెలియదు. తాప్సీ సంగతి పక్కన పెడితే, విజయ్ సేతుపతి ఇటీవల చేస్తున్న పాత్రలు, సినిమాలు ఏమంత గొప్పగా ఉండటం లేదు. ఇందులో అతను స్క్రీన్ మీద కనిపించేది కొద్ది సేపే అయినా… అతని ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకునే మూవీ బిజినెస్ జరిగి ఉంటుంది. కానీ అతను మాత్రం ఈ మూవీ కోసం అంతగా ఎఫర్ట్ పెట్టినట్టే కనిపించదు. గత వారం వచ్చిన ‘లాభం’ కూడా విజయ్ సేతుపతి అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఇది కూడా అదే కోవకు చెందింది. ఇక తాప్సీ స్క్రీన్ మీద మేకప్ తో మేనేజ్ చేసినట్లుగా చాలా పీలగా కనిపించింది. రాధిక, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్, యోగిబాబు వంటి వారి నటన వృధా అయిపోయింది. జగపతిబాబు మరోసారి తనలోని విలనిజాన్ని ప్రదర్శించారు. ఆయన పెర్ఫార్మెన్స్ మాత్రమే కాస్తంత బాగుంది. యోగిబాబుతో సహా భవంతిలో ఉండే దెయ్యాలు చేసే తిక్క కామెడీ చికాకు పుట్టిస్తుంది. దానికి తోడు అర్థంపర్థంలేని పాటలు, డాన్సులూ మరో వైపు. వాటికి వి.ఎఫ్.ఎక్స్. ఎఫెక్ట్స్ అదనం!! ఇంతోటి సినిమాను తమిళంలో చాలదన్నట్టుగా తెలుగు, కన్నడ, హిందీ భాషల్లోనూ డబ్ చేశారు. అన్నట్టు నిర్మాతలు సుధాన్ సుందరం, జి జయరాం దీనికి సీక్వెల్ కూడా ప్లాన్ చేశారు. మరి ఈ చిత్రానికి లభిస్తున్న నిరాదరణతో మనసు మార్చుకుంటారేమో చూడాలి.
ప్లస్ పాయింట్స్
ప్రముఖ తారలు నటించడం
టెక్నికల్ వాల్యూస్
మైనెస్ పాయింట్
పాత చింతకాయ పచ్చడి కథ
ఆకట్టుకోని వినోదం
మూవీ రన్ టైమ్
రేటింగ్: 2 / 5
ట్యాగ్ లైన్: బూడిదలో పోసిన పన్నీరు!