NTV Telugu Site icon

Aadavallu Meeku Johaarlu Review : అవుట్ డేటెడ్!

AMJ

ఈ మధ్య కాలంలో శర్వానంద్ కు ఏమంత కలిసి రావడం లేదు. అతను ఏ జానర్ మూవీ చేసినా ప్రజలు ఆదరించడం లేదు. కాస్తంత భిన్నంగా ఉండే కథలను ఎంపిక చేసుకుంటున్న శర్వానంద్ ఈసారి ఫ్యామిలీ ఆడియెన్స్ ను టార్గెట్‌ చేస్తూ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ మూవీ చేశాడు. రైటర్‌ టర్డ్న్ డైరెక్టర్‌ కిశోర్‌ తిరుమలతో ఈ చిత్రాన్ని సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు.

చిరంజీవి (శర్వానంద్‌) ది ఉమ్మడి కుటుంబం. అతని తండ్రి, వారి తమ్ముళ్ళు అంతా ఒకేచోట ఉంటారు. అయితే తండ్రీ, చిన్నాన్నలది బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజికే. ఆ ఇంట్లో డామినేషన్ అంతా లేడీస్ దే. చిరు తల్లి ఆదిలక్ష్మి (రాధిక). ఆమె తోడికోడళ్ళు పద్మమ్మ (ఊర్వశి), శాంతి (సత్య కృష్ణన్‌), శారద (రాజశ్రీ నాయర్), గౌరి (కళ్యాణీ నటరాజన్‌). ఆ ఇంటి వారసుల్లో చిరు ఒక్కడి మగపిల్లాడు. మిగిలిన అందరికీ ఆడపిల్లలే. దాంతో అందరూ అతన్ని తమ సొంత కొడుకుగానే చూసుకుంటారు. అంతమంది ఆడవాళ్ళ మధ్య పెరిగిన చిరు సహజంగా స్త్రీ పక్షపాతి. బ్యాడ్‌ లక్‌ ఏమంటే తన తల్లికి, చిన్నమ్మలకు నచ్చిన అమ్మాయినే పెళ్ళి చేసుకోవాలని చిరు అనుకుంటాడు. బట్ వాళ్ళకు ఎవరూ ఒక పట్టాన నచ్చరు. చూస్తుండగానే చిరుకి 36 సంవత్సరాలు వచ్చేస్తాయి. ఒకసారి అనుకోకుండా ఆటోలో పరిచయమైన ఆద్య (రశ్మిక మండన్న)తో చిరు ప్రేమలో పడతాడు. ఆమె కూడా తనను ఇష్టపడుతోందని తెలుసుకుంటాడు. తన ప్రేమను ఆమెకు చెబుదామని అనుకునేంతలో ‘మా అమ్మకు పెళ్ళి అనే దాని మీద సదాభిప్రాయం లేదు. ఆమెను కాదని నేను ఏమీ చేయలేను’ అని ఆద్య స్పష్టం చేస్తుంది. ఆమె తల్లి వకుళ (ఖుష్బూ)ను చిరు అండ్‌ ఫ్యామిలీ ఎలా ఒప్పించారు, వీళ్ళ పెళ్ళికి ఎలా శుభం కార్డు పడిందన్నదే మిగతా కథ.

నాన్న కోసం, అమ్మ కోసం ప్రేమను త్యాగం చేసే కథాంశాలతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఎప్పుడో రెండు మూడు దశాబ్దాల క్రితం నాటి కథాంశాన్ని తీసుకుని, ఈ తరానికి చెప్పాలని దర్శకుడు కిశోర్‌ తిరుమల ప్రయత్నించాడు. కానీ కథ, కథనాల్లో కొత్తదనం లేకపోవడంతో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. సిట్యుయేషనల్ కామెడీకి చక్కని ప్రాధాన్యం ఇచ్చారు. మరీ ముఖ్యంగా ఇంట్రర్వెల్‌ బ్యాంగ్‌ ఫుల్‌ ఫన్నీగా సాగింది. అయితే ప్రధమార్థం అంతా చిరు పెళ్ళి ప్రయత్నాల నేపథ్యంలో సాగడంతో సరదాగా ఫర్వాలేదనిపించింది కానీ ద్వితీయార్థంలో విడిపోయిన ప్రేమ జంటను కలపడం, వకుళ నేపథ్యం తెలుసుకుని చిరు కుటుంబం కరిగిపోవడం వంటి సీన్స్ తో భారంగా కదిలింది. దర్శకుడు కిశోర్‌ తిరుమల బేసికల్ గా మంచి రచయిత కావడంతో మాటలతో ఎదుటి వ్యక్తిలో పరివర్తన చేసుకొచ్చే ప్రయత్నం చేశాడు. దాంతో ఆ సన్నివేశాలలో బలం లేకుండా పోయింది. పెళ్ళి చేయకుండా ఉంటే చాలు కూతురు బాగుంటుందని వకుళ పాత్ర భావించడంలో అర్థం లేదు. అలానే తల్లి, చిన్నమ్మల మాటకు విలువనిస్తూ హీరో… అన్ని సంవత్సరాల పాటు అవివాహితుడిగా ఉండటంలోనూ పెద్దంత రీజన్ కనిపించదు. ఏదేమైనా ఓ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ను తీయాలని దర్శకుడు అనుకున్నాడు. అదే చేశాడు.

నటీనటుల విషయానికి వస్తే… శర్వానంద్‌ నటన సహజంగా ఉంది. అయితే కొన్ని సందర్భాలలో కామెడీ కోసం అతి చేసిన దాఖలాలు ఉన్నాయి. రష్మికా మండన్న స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. కొన్ని సన్నివేశాలు ‘గీత గోవిందం’ను గుర్తుకు తెప్పించాయి. రాధిక, ఊర్వశి, ఖుష్బూ సీనియర్‌ నటీమణులు. వాళ్ళు ఆ యా పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. ‘వెన్నెల’ కిశోర్‌, సత్య, ప్రదీప్ రావత్ కామెడీ పండించే ప్రయత్నం చేశారు. కొంతవరకూ సక్సెస్ అయ్యారు. ఇతర పాత్రల్లో సత్య కృషన్, రాజశ్రీ నాయర్‌, కళ్యాణీ నటరాజన్, ఝాన్సీ, రజిత, బెనర్జీ, గోపరాజు రమణ, రవిశంకర్‌ తదితరులు కనిపిస్తారు. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన బాణీలలో ఒకటి రెండు మాత్రమే ఆకట్టుకున్నాయి. నేపథ్య సంగీతం ఓకే. సుజిత్‌ సారంగ్‌ సినిమాటోగ్రఫీ, ఎ. శ్రీకర ప్రసాద్‌ ఎడిటింగ్‌ వర్క్ బాగుంది. నిర్మాణం విషయంలో నిర్మాత సుధాకర్‌ చెరుకూరి ఎక్కడా రాజీ పడలేదు. క్లీన్ ఎంటర్‌ టైనర్‌ కావడమే ఈ సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్‌.

రేటింగ్‌: 2.5 / 5

ప్లస్ పాయింట్స్
ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్
టెక్నీషియన్స్ పనితనం
ఆకట్టుకునే కామెడీ
నిర్మాణ విలువలు

మైనెస్ పాయింట్స్
పేలవమైన కథ, కథనం
ఊహకందే ముగింపు
సన్నివేశాలు బలంగా లేకపోవడం

ట్యాగ్ లైన్: అవుట్ డేటెడ్!