సందీప్ కిషన్ నటించిన 25వ చిత్రం ‘ఎ 1 ఎక్స్ ప్రెస్’. ‘నిను వీడని నీడను నేను’ చిత్రం తర్వాత సందీప్ కిషన్ మిత్రులతో కలిసి నిర్మించిన రెండో సినిమా ఇది. తమిళ సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిళ్ ఆది హీరోగా నటించిన ‘నెప్తే తునయ్’కు రీమేక్. సందీప్ తో కలిసి టి. జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, దయా పన్నెం నిర్మించిన ఈ స్పోర్ట్స్ డ్రామాతో డెన్నీస్ జీవన్ కనుకొలను దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
కథ విషయానికి వస్తే… యానంలో ఉండే మావయ్య (పోసాని కృష్ణమురళీ) ఇంటికి వెళ్ళిన సంజు (సందీప్ కిషన్) అక్కడి హాకీ ప్లేయర్ లావణ్యతో ప్రేమలో పడతాడు. అయితే… అక్కడి చారిత్రాత్మకమైన చిట్టిబాబు హాకీ స్టేడియంను రాష్ట్ర క్రీడామంత్రి రావు రమేశ్ ఓ కార్పొరేట్ మెడికల్ కంపెనీకి తన స్వప్రయోజనాల కోసం ధారాదత్తం చేయాలనుకుంటాడు. మరి క్రీడాకారులు ప్రాణంగా భావించే ఆ మైదానాన్ని కాపాడుకోగలిగారా? అందుకోసం సంజు ఎలాంటి సాయం చేశాడు? అనేది అసలు కథ.
నిర్మాతగా సందీప్ కిషన్ తొలి యత్నంగా హారర్ జానర్ మూవీని ఎంచుకుంటే, ఇప్పుడు స్పోర్ట్స్ డ్రామాను తీసుకున్నాడు. రొటీన్ కు భిన్నంగా ఓ కొత్త అంశాన్ని జనం ముందుకు తీసుకురావాలనుకున్న అతని ప్రయత్నాన్ని అభినందించాలి. ఈ కథలో ఉత్తేజపూరితమైన అంశం ఉన్నా… కథనం రొటీన్ గా ఉంది. క్రీడా రంగాన్ని కార్పొరేట్ సంస్థలు, రాజకీయ నేతలు శాసించడం అనేది ఎంతోకాలంగా జరుగుతున్నదే. అలానే ఈ సినిమాలోనే చెప్పినట్టు ప్రజలు ఏ ఆటను చూడాలనేది, దేనిని ప్రోత్సహించాలనేది సైతం వారి చేతిల్లోకి వెళ్ళిపోయింది. క్రికెట్ తప్పితే మరేదీ గొప్ప ఆట కాదనే భావన తీసుకొచ్చేశారు. ఈ నేపథ్యంలో హాకీ ప్రధానాంశంగా వచ్చిన ‘చెక్ దే ఇండియా’ దేశ వ్యాప్తంగా చక్కని ప్రజాదరణ పొందింది. దాని తర్వాత ఆ స్థాయి విజయాన్ని ఆ ఆట నేపథ్యంలో వచ్చిన ఏ సినిమా పొందలేదు. అందరూ ఆ చిత్ర కథ ఛాయల్లోనే సంచరిస్తున్నారు. ఇది ఒకరకంగా అలాంటిదే. క్రీడా రాజకీయాల కారణంగా మిత్రుడిని కోల్పోయిన ఓ జాతీయ స్థాయి హాకీ ప్లేయర్ తిరిగి హాకీ స్టిక్ చేతిలోకి తీసుకోవడం ఇందులోని ప్రధానాంశం.
పనిలో పనిగా ఈ దేశంలో రాజకీయాల నేతల అవినీతి అక్రమాలు, వారిలో కొరవడిని సిద్ధాంత లేమి అన్నింటినీ దర్శకుడు తెరపై చూపించాడు. ఇక ద్వితీయార్థంలో అయితే… రాజకీయ నేతలు సామ దాన భేద దండోపాయాల తరహాలో… ప్రాంతం, కులం, మతంను అడ్డం పెట్టుకుని తమ పబ్బం గడుపుకోవడానికి ఎలా ప్రయత్నిస్తారో చూపించాడు. ఇక రెగ్యులర్ కమర్షియల్ సినిమాలలో జనం కోరుకునే లవ్ ట్రాక్ కూ దర్శకుడు ప్రాధాన్యం ఇచ్చాడు. వినోదానికీ చోటు కల్పించే ప్రయత్నం చేశాడు. దాంతో… క్రీడా మైదానాన్ని కాపాడుకోవాలనుకునే పాయింట్ పలచన అయిపోయింది. పైగా ఇటీవల ప్రతి స్పోర్ట్స్ డ్రామా రోమాంచితమైన ఫైనల్ మ్యాచ్ లతో పూర్తవుతోంది. ఇందులోనూ అలాంటి ఓ మ్యాచ్ నే క్లయిమాక్స్ లో పెట్టారు. ఏ సీన్ కు ఆ సీన్ బాగా తీసినా… మొత్తంగా చూస్తే సమ్ థింగ్ మిస్సింగ్ అనే భావన కలుగుతుంది. ఉత్తేజపూరితమైన సంభాషణలు, స్నేహబంధాన్ని తెలిపే సన్నివేశాలు… పాసింగ్ క్రౌండ్స్ మాదిరి వెళ్ళిపోయాయి తప్పితే… మనసుపై బలమైన ముద్రను వేయలేదు.
నటీనటుల విషయానికి వస్తే సందీప్ కిషన్ తన పాత్ర కోసం ప్రాణం పెట్టాడు. హాకీ స్టిక్ ను నటన కోసం చేతిలోకి తీసుకోవడమే కాకుండా… కొంత ప్రాక్టీస్ కూడా చేశాడు. ఆ హార్డ్ వర్క్ తెర మీద కనిపిస్తోంది. అతని స్నేహితులుగా ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ చక్కగా నటించారు. ఇప్పటికే ‘మాయవాన్’లో సందీప్ తో కలిసి నటించిన లావణ్య ఇందులో మరో సారి జోడీ కట్టింది. హాకీ క్రీడాకారిణిగా ప్రథమార్థంలో ఆమె పాత్రకు లభించిన గుర్తింపు ద్వితీయార్థంకు వచ్చే సరికీ దక్కలేదు. బట్ ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. రావు రమేశ్, పోసాని, రఘుబాబు, మురళీశర్మ తమ పాత్రలకు న్యాయం చేశారు. సత్య, మహేశ్ విట్ట వినోదాన్ని పంచే ప్రయత్నం చేశారు. ఇతర ప్రధాన పాత్రలను అభిజిత్, రవి ఆనంద్, శ్రీరంజని, భూపాల్ రాజ్, ఖయ్యుం తదితరులు పోషించారు. తమిళ చిత్రానికి స్వరాలు సమకూర్చిన హిప్ హాప్ తమిళ తెలుగు వర్షన్ కూ మ్యూజిక్ ఇచ్చాడు. అయితే ర్యాప్ హోరులో చాలా అర్థవంతమైన పదాలు చెవిని చేరనేలేదు. అమిగో పాట చిత్రీకరణ బాగుంది. సింగిల్ కింగులమ్ పెద్దంత ఆకట్టుకోలేదు. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్, కెవిన్ రాజ్ సినిమాటోగ్రఫీ ఓకే. దర్శకుడు డెన్నీస్ జీవన్ కథను ఇంకాస్తంత గ్రిప్పింగ్ గా తీసి ఉంటే బాగుండేది. ఓవర్ ఆల్ గా ‘ఎ 1 ఎక్స్ ప్రెస్’ వన్ టైమ్ వాచ్ బుల్ మూవీ.
ప్లస్ పాయింట్స్
స్పూర్తిదాయకమైన కథ
నటీనటుల నటన
పొలిటికల్ సెటైర్
మైనెస్ పాయింట్
కొత్తదనం లేకపోవడం
మనసుకు హత్తుకోని సన్నివేశాలు
రేటింగ్
2.25 / 5
ట్యాగ్ లైన్
‘నాట్ ఎ1 ఎక్స్ ప్రెస్’!