NTV Telugu Site icon

Review : ఏ థర్స్ డే! (ఓటీటీ)

a thursday

‘నువ్విలా, గౌరవం, యుద్ధం, కొరియర్ బోయ్ కళ్యాణ్’ వంటి సినిమాలతో తెలుగువారికి సుపరిచితురాలు యామి గౌతమ్. తెలుగుతో పాటు ఇతర భాషా చిత్రాల్లోనూ ఆమె హీరోయిన్ గా నటించింది. ఆ మధ్య వచ్చిన ‘కాబిల్, ఉరి, బాల’ వంటి చిత్రాలు ఉత్తరాదిన యామికి నటిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. యామీ గౌతమ్ కీలక పాత్ర పోషించిన లేడీ ఓరియంటెడ్ థ్రిల్లర్ మూవీ ‘ఏ థర్స్ డే’ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ‘ఉరి’ దర్శకుడు ఆదిత్యధర్ ను వివాహం చేసుకున్న తర్వాత జనం ముందుకు వచ్చిన యామీ రెండో చిత్రం ఇది. విశేషం ఏమంటే… దీనికి ముందు సినిమా ‘భూత్ పోలీస్’ సైతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోనే స్ట్రీమింగ్ అయ్యింది.

నైనా జైస్వాల్ (యామి గౌతమ్) లాయర్. అయితే ఆమెకు టీచింగ్ అంటే ఇష్టం. అందుకే ముంబైలోని కొలాబాలో ఓ పే స్కూల్ నిర్వహిస్తూ ఉంటుంది. ఆరోగ్యం బాగోక మూడు వారాల పాటు స్కూల్ కు రాని నైనా ఒక రోజు తిరిగి స్కూల్ కు వస్తుంది. ఆ మర్నాడే ఆమె 30వ పుట్టిన రోజు కావడంతో నైనా బోయ్ ఫ్రెండ్, క్రిమినల్ లాయర్ రోహిత్ (కరన్ వీర్ శర్మ) ఫ్రెండ్స్ తో కలిసి నైట్ పార్టీ ఎరేంజ్ చేస్తానని చెబుతాడు. అందుకు అంగీకారం తెలిపిన నైనా… ఆ తర్వాత కొద్ది సేపటికే ఓ దారుణమైన నిర్ణయం తీసుకుంటుంది. తన స్కూల్ లో ఉండే 16 మంది పిల్లలను బందీలుగా చేసి, వారిని ప్రాణాలతో వదలాలంటే తన డిమాండ్స్ తీర్చాలని పోలీసులకు ఫోన్ చేస్తుంది. ఆ ప్లే స్కూల్ లో చదువుకునే నిహారిక అనే పాప బర్త్ డే కూడా ఉండటంతో నైనా కోరిక మేరకు ఆమె తల్లి డ్రైవర్ కు కేక్, కొన్ని స్నాక్స్ ఇచ్చి పంపుతుంది. అలా తన దగ్గరకు వచ్చిన ఆ డ్రైవర్ ను, అలానే తన దగ్గరే పనిచేసే సావిత్రి ( కళ్యాణీ మూలే) అనే ఆయాను నైనా బంధిస్తుంది. పోలీసులు మొదట ఇదేదో ఆకతాయిల వ్యవహారం అని భావించిన తీరా స్పాట్ కు వచ్చిన తర్వాత వారికి సీరియస్ నెస్ అర్థమౌతుంది. దాంతో స్వయంగా ఏసీపీ కేథరిన్ (నేహా ధూపియా) రంగంలోకి దిగుతుంది. అయితే… ఆమె క్రింద పనిచేసే మరో పోలీస్ అధికారి జావేద్ ఖాన్ (అతుల్ కులకర్ణి)తో తాను మాట్లాడాలని, అతన్ని కూడా స్పాట్ కు రప్పించమని నైనా… కేథరిన్ ను డిమాండ్ చేస్తుంది. చివరకు ఈ వ్యవహారం అదే రోజు ముంబైకి అధికారిక పర్యటన నిమిత్తం వచ్చిన ప్రధానమంత్రి మాయా రాజ్ గురు (డింపుల్ కపాడియా) మెడకూ చుట్టుకుంటుంది. అసలు నైనా ఎవరు? ఆమె తన పే స్కూల్ పిల్లలనే ఎందుకు బంధించింది? ఆమె డిమాండ్స్ ను ప్రభుత్వం అంగీకరించిందా? ప్రధానితో ఫేస్ టూ ఫేస్ మాట్లాడాలని కోరిన నైనా డిమాండ్ తీరిందా? పిల్లలను అడ్డంపెట్టుకుని నైనా ఆడిన ఆటకు అసలు కారణం ఏమిటీ? ఇదే మిగతా చిత్రం.

ఈ వ్యవస్థలోని నిర్లక్ష్య వైఖరి మీద కన్నెర్ర చేసే సామాన్యుల కథలతో చాలానే సినిమాలు వచ్చాయి. ఓ పెద్దాయన తనకు జరిగిన అన్యాయం పట్ల ప్రభుత్వం, అధికారులు సరిగా స్పందించక పోవడంతో వారి అటెన్షన్ ను పొందడానికి ఆడిన డ్రామాతో 2008లో ‘ఎ వెడ్నెస్ డే’ సినిమా వచ్చింది. ఇప్పుడీ సినిమాలో ఓ అబల తనకు జరిగిన అన్యాయాన్ని దేశ ప్రజల దృష్టికి, ప్రధాని దృష్టికి ఎలా తీసుకెళ్ళిందనే దాన్ని దర్శకుడు బెహజాద్ కంబాట చూపించాడు. కథ విషయంలో ఈ రెండు సినిమాలకు వ్యత్యాసం ఉన్నా, రివేంజ్ తీర్చుకోవడానికి రెండు చిత్రాలలోని ప్రధాన పాత్రధారులు ఒకేలా రియాక్ట్ అయ్యాయి. అందులో సిటీలోని ప్రధాన ప్రదేశాలను బాంబ్ బ్లస్ట్ చేస్తున్నానని ప్రభుత్వాన్ని బెదిరిస్తే… ఇందులో ప్లే స్కూల్ పిల్లలను అడ్డం పెట్టుకుని కథానాయిక కథను నడిపిస్తుంది. అయితే ప్రధానమంత్రి డైరెక్ట్ గా ఓ కిడ్నాపర్ నివాసానికి వెళ్ళి కలవడం, పోలీసులు చివరి నిమిషం వరకూ మౌన ప్రేక్షకుల మాదిరిగా ఉండిపోవడం వంటివి కాస్తంత సిల్లీగా అనిపిస్తాయి. అలానే ఇందులో చాలానే లూప్ హోల్స్ ఉన్నాయి. అయితే దర్శకుడు బెహజాద్ కంబట్… సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ చక్కని టెంపోను మెయిన్ టైన్ చేయడంతో… ఆ లోటు పాట్లు పెద్దంత పట్టించుకోదగ్గవిగా అనిపించవు. పోక్సో యాక్ట్ ను 18 సంవత్సరాల లోపు వాళ్ళకే పరిమితం చేశారని, నిజానికి డెబ్బై ఏళ్ళ వృద్ధురాళ్ళూ సైతం అత్యాచారాలకు గురవుతున్నారని, అలాంటి తప్పుడు పనులు చేసే వారికి ఉరిశిక్ష ఒక్కటే కరెక్ట్ అని చెబుతుంది నైనా జైస్వాల్.

నటీనటుల విషయానికి వస్తే, యామీ గౌతమ్ లో మంచి నటి ఉంది. ఆ విషయం మరోసారి ఈ సినిమా ద్వారా నిరూపితమైంది. క్షణాలలో తన ఎక్స్ ప్రెషన్స్ ను మార్చుతూ ఈ కథను బాగానే రక్తి కట్టించింది. ఆ మధ్య ఓ బిడ్డకు జన్మనిచ్చిన నేహా ధూపియా ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే ఇందులోని ఏసీపీ కేథరిన్ పాత్రను చేసింది. ముఖంలో పెద్దంత ఎక్స్ ప్రెషన్స్ పలకకపోయినా ఆమె పోషించిన పాత్రకు ఉన్న వెయిటేజ్ కారణంగా ఆమెకూ మంచి మార్కులే పడ్డాయి. ఇక జావేద్ ఖాన్ గా మరోసారి తన అద్భుతమైన నటనను అతుల్ కులకర్ణి ప్రదర్శించాడు. ప్రధానమంత్రిగా తెర మీద ద్వితీయార్థంలోనే కనిపించినా డింపుల్ కపాడియా కారణంగా ఆ పాత్రకు ఓ హుందాతనం వచ్చింది. ఇతర ప్రధాన పాత్రలను కరణ్ వీర్ శర్మ, కళ్యాణీ మూలే, ఆది ఇరానీ, బోలోరామ్ దాస్, శుభాంగీ లత్కర్, దివ్యజ్యోత్ కౌర్ తదితరులు పోషించారు. కథంతా ఒక్కరోజులో జరిగేది కావడంతో ఆసక్తికరంగానూ, ఉత్కంఠభరితంగానూ ఉంది. ఈ ఆపరేషన్ జరిగే సమయంలో వర్షం పడుతూ ఉండటంతో ప్రేక్షకులు ఓ రకమైన కొత్త అనుభూతికి లోనవుతారు. అనూజ్ రాకేశ్ ధావన్ సినిమాటోగ్రఫీ బాగుంది, అలానే రూషిన్ దలాల్, కైజాద్ గేర్డా నేపథ్య సంగీతం చక్కగా ఉంది. బెహజాద్ కంబాట అర్థవంతమైన కథను రాసుకున్నా, అది ‘ది వెడ్నస్ డే’ పోకడలో సాగడంతో అనుకరణ అనే భావన చూసే ప్రేక్షకుడికి కలుగుతుంది. అయితే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది కాబట్టి, పైగా ఒక కాజ్ గురించి తీసిన సినిమా కారణంగా ఒకసారి చూడటంలో తప్పులేదు.

రేటింగ్ : 2.75/5

ప్లస్ పాయింట్స్
నటీనటుల నటన
ఎంచుకున్న కథ
నేపథ్య సంగీతం

మైనెస్ పాయింట్స్
‘ది వెడ్నెస్ డే’ పోకడలో సాగడం
బలహీనమైన సన్నివేశాలు

ట్యాగ్ లైన్: రివేంజ్ డ్రామా!