కరోనా తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతకు ముందు స్థితికి చేరనేలేదు. ఈలోగా వచ్చిపడ్డ ఉక్రెయిన్ యుద్ధం ఆగకుండా సాగుతోంది. అది చాలదన్నట్టుగా ఉరుము లేని పిడుగులా ఊడిపడ్డ ఇరాన్ యుద్ధం.. ప్రపంచ దేశాల్ని అతలాకుతలం చేసింది. ఇప్పటికీ పశ్చిమాసియా ఉద్రిక్తంగానే ఉంది. దీంతో సరఫరా గొలుసులున్నీ తెగిపోయాయి. దీంతో పేద, ధనిక అనే తేడా లేకుండా అన్ని దేశాల్లోనూ అనిశ్చితి రాజ్యమేలుతోంది. ఏతావాతా ప్రపంచం మాంద్యం గుప్పిట్లో చిక్కుంది. కానీ ఇంత క్లిష్ట పరిస్థితుల్లోనూ మన దక్షిణాది మాత్రం సేఫ్ జోన్లోనే ఉంది. ఉన్నంతలో బతికే అలవాటు, వ్యవసాయ ఆధారిక ఎకానమీనే మనకు శ్రీరామరక్షగా నిలుస్తున్నాయి. ఇదే అంశంపై ఇవాల్టి ఛైర్మన్స్ డెస్క్ చూద్దాం.
మొదట్నుంచీ దక్షిణ భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రత్యేకంగానే ఉంది. ఏ సంక్షోభం వచ్చినా.. ఇక్కడి ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం పడిన దాఖలాల్లేవు. దానికి 2008 మాంద్యం నుంచి, కరోనా, నోట్ల రద్దు ఇలా కొన్ని ఉదాహరణలు కూడా చెప్పుకోవచ్చు. అయితే అలా ఉండటానికి ప్రధాన కారణం మన దక్షిణాది ఆర్థిక వ్యవస్థ మూలాలే అని చెప్పటానికి సందేహించాల్సిన పని లేదు. దక్షిణాది ఆర్థికవ్యవస్థకు ఇప్పటికీ వ్యవసాయమే పునాదిగా ఉంది. ఎంత క్లిష్ట పరిస్థితి వచ్చినా తిండి గింజలకు లోటు లేకపోవడమే మనకు సగం భరోసా. ఇక ఉన్నదాంట్లో బతకటం అనేది మన సంస్కృతిలోనే ఉంది. ఇక మధ్యతరగతి అలవాటుగా మార్చుకున్న కష్టపడటం, పొదుపు చేయడం.. మనకు మరో ప్రధాన బలం. అందుకే ఎలాంటి పరిణామాలు వచ్చినా తట్టుకుని నిలబడటం దక్షిణాదికి అలవాటైపోయింది.
దక్షిణాదిలోనూ మధ్యతరగతి జీవనశైలి మరింత సురక్షితంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి మధ్యతరగతికి మొదట్నుంచీ ఆడంబరాలు తక్కువే. చివరకు రెండు గదుల ఇంట్లో ఉన్నా.. రెండు గదుల్లోనూ లైట్ వేయటానికీ సందేహించే వారు ఇంకా ఉన్నారంటే నమ్మాల్సిందే. అలాగే అతిగా ఆశలు పెంచుకునే అలవాటు లేకపోవడం కూడా మిడిల్ క్లాస్‌కు వరమనే చెప్పాలి. ఈ కారణాలతోనే దేశం ప్రపంచంలో నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా వెలిగిపోయినప్పుడూ.. వారేమీ ఆశించలేదు. ఇప్పుడు విదేశీ మారక ద్రవ్యం అడుగంటిందన్న వార్తలతోనూ వారేమీ కుంగిపోవడం లేదు. సుఖాలకు పొంగిపోవడం, కష్టాలకు కుంగిపోవడం కాకుండా.. ఏం జరిగినా.. నిలకడైన జీవనశైలిని కొనసాగించడం.. తరతరాలుగా వస్తున్న అలవాటు. ఈ ధోరణే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతిపై మాంద్యం ప్రభావం లేకుండా చేస్తోంది. కేవలం ధనికులు, బిలియనీర్లపై మాత్రమే మాంద్యం కాస్త ప్రభావం చూపుతుందేమో కానీ.. దక్షిణ భారతంలో సామాన్యులపై మాత్రం దాని నీడ కూడా పడదని చెప్పడం అతిశయోక్తి కానే కాదు.
అసలు మధ్యతరగతి గురించి మరో ముఖ్య విషయం చెప్పుకోవాలి. కష్టాలు మనుషులకు కాకపోతే మానులకొస్తాయా అనే సూత్రం వారు బాగా ఒంట బట్టించుకున్నారు. అందుకే ఏం జరిగినా.. నిర్లిప్తంగా తమ పని తాము చేసుకుపోతారు. ఎలాగూ అతిగా ఆశించడం, ఎక్కువగా కుంగిపోవడం ఉండదు కాబట్టి.. ఏం జరిగినా.. వారి జీవనానికి ఢోకా ఉండదు. ఇక దక్షిణాదిలో చాలా కుటుంబాల మూలాలు ఇంకా వ్యవసాయంలోనే ఉన్నాయి. దీంతో ఎలాంటి క్లిష్ట పరిస్థితి ఎదురైనా.. వ్యవవసాయం ఆదుకుంటుందనే నమ్మకం ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే ఆహారధాన్యాలకు లోటులేని స్థితి కనిపిస్తుంది. ఏ పరిస్థితుల్లో అయినా కష్టపడి పనిచేయడం, వచ్చిన ఆదాయంలో కొంత భాగం పొదుపు చేయడం మధ్యతరగతికి వెన్నతో పెట్టిన విద్య. ఈ మనస్తత్వమే ఒడిదుడుకులకు తట్టుకునే శక్తిని ఇస్తోందనే వాదన ఎప్పట్నుంచో వినిపిస్తోంది.
ఆర్థిక సంక్షోభం అనేది ఒక పరీక్ష అయితే, అందులో దక్షిణాది రాష్ట్రాలు డిస్టింక్షన్‌లో పాసవుతున్నాయని చెప్పొచ్చు. బలమైన ఐటీ బేస్, పారిశ్రామిక వైవిధ్యం, నైపుణ్యం ఉన్న యువత, దూరదృష్టి గల విధానాలు దక్షిణాదిని రక్షించాయి. ఇక మధ్యతరగతి కుటుంబాల జీవన విధానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. సాధారణ రోజుల్లో పరమ బోరింగ్‌గా కనిపించే జీవనశైలి విలువ.. ఆర్థిక అనిశ్చితి సమయంలోనే తెలుస్తుందనే అభిప్రాయాలు లేకపోలేదు.
తలసరి ఆదాయంలోనూ జాతీయ సగటు కంటే దక్షిణాది రాష్ట్రాలు ఎంతో ముందున్నాయి. ఆర్థిక సంక్షోభ సమయాల్లో పెట్టుబడిదారులు సురక్షితమైన, వేగవంతమైన వృద్ధి ఉన్న ప్రాంతాల వైపు చూస్తారు. దక్షిణాది రాష్ట్రాలు గత రెండు దశాబ్దాలుగా మౌలిక సదుపాయాల కల్పనలో రాజీ పడలేదు. 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా, అద్భుతమైన రోడ్డు, కనెక్టివిటీ నెట్‌వర్క్ ఇక్కడి సొంతం.దీనికి తోడు తెలంగాణ టీఎస్-ఐపాస్, ఆంధ్రప్రదేశ్ సింగిల్ విండో విధానం, తమిళనాడు పారిశ్రామిక ప్రోత్సాహకాలు ప్రపంచ స్థాయి సంస్థలను ఆకర్షించాయి. సంక్షోభ సమయంలోనూ ఫాక్స్‌కాన్, అమెజాన్, గూగుల్ వంటి గ్లోబల్ దిగ్గజాలు దక్షిణాదిలోనే తమ పెట్టుబడులను విస్తరించడం దీనికి నిదర్శనం.
ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కేవలం డబ్బు మాత్రమే సరిపోదు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు కావాలి. దేశంలోనే అత్యధిక సాంకేతిక విద్యాసంస్థలు, మెడికల్ కాలేజీలు దక్షిణాదిలోనే ఉన్నాయి. ఇక్కడి యువతలో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, గ్లోబల్ వర్క్ కల్చర్ ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఖర్చులు తగ్గించుకునే క్రమంలో తమ పనులను అవుట్‌సోర్సింగ్ చేస్తున్నాయి. ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఏర్పాటుకు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాలు మొదటి ఛాయిస్‌గా మారాయి. సంక్షోభంలోనూ ఇక్కడి ఐటీ, సేవా రంగాల్లో ఉద్యోగాల సృష్టి పూర్తిగా ఆగిపోకపోవడానికి ఈ నైపుణ్యమే కారణం. ఇలా తనదైన ప్రత్యేకతలతో దక్షిణాది ఆర్థికవ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లోనూ సేఫ్ జోన్లో ఉండగలుగుతోంది.
ఏదైనా ఒక రంగంపైనే పూర్తిగా ఆధారపడకపోవడమే దక్షిణాది రాష్ట్రాల అతిపెద్ద బలం. ఉత్తర భారతదేశంలోని మెజారిటీ రాష్ట్రాలు కేవలం వ్యవసాయం లేదా ఏదో ఒక సాంప్రదాయ పరిశ్రమపైనే ఆధారపడ్డాయి. కానీ దక్షిణాది అలా కాదు.తమిళనాడును ‘డెట్రాయిట్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తారు. ఆటోమొబైల్, టెక్స్‌టైల్ రంగాల్లో అది అగ్రగామి. కర్ణాటక ఐటీ మరియు స్టార్టప్‌లకు రాజధాని. తెలంగాణ ఫార్మా, ఐటీ, ఏరోస్పేస్ రంగాల్లో దూసుకుపోతోంది. ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘ తీరప్రాంతంతో ఆక్వా, పోర్ట్ ఆధారిత పరిశ్రమలు, పారిశ్రామిక కారిడార్లతో బలంగా ఉంది. కేరళ సేవా రంగం, పర్యాటకం, విదేశీ నిధుల ద్వారా స్థిరత్వాన్ని కాపాడుకుంటోంది. ఈ వైవిధ్యం వల్ల ఒక రంగం దెబ్బతిన్నా, మరో రంగం ఆర్థిక వ్యవస్థను కుప్పకూలకుండా కాపాడుతోంది. దేశ జీడీపీలో దక్షిణాది 5 రాష్ట్రాల వాటా దాదాపు 30% పైమాటే.
దక్షిణాది రాష్ట్రాలు ఒకవైపు పారిశ్రామిక వృద్ధిని సాధిస్తూనే, మరోవైపు భారీగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. ఈ సమతుల్యత వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. దీనివల్ల లోకల్ మార్కెట్‌లో డిమాండ్ తగ్గలేదు, ఆర్థిక చక్రం తిరుగుతూనే ఉంది.కానీ, ఇదే సమయంలో రాష్ట్రాల అప్పులు పెరగడం, కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా తగ్గుతుండటం దక్షిణాదికి పెద్ద సవాలుగా మారింది. జనాభా నియంత్రణ పాటించినందుకు రివార్డుకు బదులు, పన్నుల పంపిణీలో నిధులు తగ్గడంపై దక్షిణాది రాష్ట్రాలు గళమెత్తుతున్నాయి. అయినప్పటికీ, తమ అంతర్గత వనరుల ద్వారా ఈ సంక్షోభాన్ని ఇవి తట్టుకుంటున్నాయి.
ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ సామాజిక అభివృద్ధి సూచికలు కూడా ఎంతో మెరుగ్గా ఉన్నాయి. కేంద్రానికి అత్యధిక పన్నులు కడుతూ, దేశ ఆర్థిక రథాన్ని ముందుకు నడిపిస్తోంది దక్షిణాదే అనేది ఇప్పటికే రుజువైన విషయం.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంధ్యపు ఛాయలు. దేశవ్యాప్తంగా వ్యాపారాల్లో మందగమనం. కానీ దేశ దక్షిణ సరిహద్దు దాటితే సీన్ మారుతోంది. ఎక్కడ అవకాశాలు ఉన్నా వాటిని అందిపుచ్చుకోవడం కూడా దక్షిణాదికి అలవాటు. అందుకే ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా.. అందులోనే అవకాశాన్ని చూసే వైఖరి వీరికి అలవడింది. పెద్ద సంఖ్యలో ఉన్న మధ్యతరగతికి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు.. ఆర్థిక చక్రాన్ని ఎక్కడా ఆగకుండా ముందుకు నడిపిస్తుంటాయి. అందుకోసం ఎంత కష్టమైనా పడటానికి సిద్ధంగా ఉండే ధోరణి దక్షిణాదికి పెద్ద బలంగా మారింది. మొదట్నుంచీ ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూడటం మధ్యతరగతికి తెలియని విద్య. అసలు అత్యంత దుర్భర పరిస్థితుల్ని కూడా ముందే ఊహించి.. దానికి కూడా ముందే సిద్ధంగా ఉండటం.. మన పెద్దల నుంచి వచ్చిన ముందు జాగ్రత్త. ఈ జాగ్రత్తే దక్షిణాది ఆర్థిక వ్యవస్థను సురక్షితంగా ముందుకు నడుపుతోంది. మనకు తెలిసి స్వతంత్ర భారత్ చరిత్రలో దక్షిణాది ఎప్పుడూ బిత్తరచూపులు చూసిన దాఖలాలు లేవు. ఎప్పటికప్పుడు కొత్త మార్గాల్ని అన్వేషించడం, సరికొత్త ఆదాయ వనరులు సృష్టించుకోవటానికి సందేహించకపోవడమే.. ఇక్కడ ఆర్థికంగా సురక్షిత వాతవరణాన్ని పాదుకొల్పిందనడంలో సందేహం లేదు.
స్వతంత్ర భారత్ చరిత్రలో దేశం చూసిన ప్రతి పెద్ద మార్పులోనూ దక్షిణాది పాత్ర ప్రధానంగా ఉందనటానికి చరిత్రే ప్రత్యక్ష సాక్షి. చివరకు కరోనా సంక్షోభంలోనూ.. దక్షిణాది సత్తా చాటింది. లాక్‌డౌన్ ఇబ్బందుల్ని కూడా మిగతా దేశంతో పోలిస్తే.. దక్షిణాదే సమర్థంగా అధిగమించింది. కర్ణాటక గత దశాబ్దంలో సగటున 7.9% వాస్తవ వృద్ధి రేటు నమోదు చేసింది. తెలంగాణ 7.1%, ఆంధ్రప్రదేశ్ 6.9%, తమిళనాడు 6.8% వృద్ధిని సాధించాయి. 2024-25లో తమిళనాడు దేశంలోనే అత్యధిక 9.69% నిజ వృద్ధి రేటు సాధించింది. ఆంధ్రప్రదేశ్ 8.21%, కర్ణాటక 7.37%, తెలంగాణ 6.79% వృద్ధి నమోదు చేశాయి. తలసరి ఆదాయంలో కూడా దక్షిణ రాష్ట్రాలే ముందున్నాయి. తెలంగాణ తలసరి నికర రాష్ట్ర ఉత్పత్తి రూ.3.88 లక్షలు, కర్ణాటక రూ.3.81 లక్షలు, తమిళనాడు రూ.3.62 లక్షలు.. ఇవి మహారాష్ట్రను కూడా మించాయి.
ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. దక్షిణాది దేశంలోనే అగ్రగామిగా ఉన్నా.. దక్షిణాది రాష్ట్రాలు.. తమలో తామే ఆరోగ్యకరమైన పోటీ పడుతూ.. ఎప్పటికప్పుడు సరికొత్త ఎత్తులకు చేరుకోవాలనే తపనతో ఉంటాయి. అందుకు తగ్గట్టే దక్షిణాది రాష్ట్రాల ప్రజలు కూడా అభివృద్ధి కాముకులు కావడం ఉపకరిస్తోంది. అదే సమయంలో ఏదీ ఎవరి నుంచీ ఆశించకుండా.. చేతనైనంతవరకూ అన్నీ సొంత వనరులతో సమకూర్చుకోవాలనే సంస్కృతి కూడా దక్షిణాదిని ముందడుగు వేసేలా చేస్తోంది. చారిత్రకంగా దక్షిణాదికి దేశం ఇచ్చిన దాని కంటే.. దేశానికి దక్షిణాది ఇచ్చిందే ఎక్కువనేది అందరూ అంగీకరించే విషయమే.
దక్షిణాదిని కాపాడుతున్న అతిపెద్ద రక్షణ కవచం. ఇక్కడి మధ్యతరగతి ప్రజల పొదుపు మనస్తత్వం! సంపాదనలో సగానికి పైగా దాచుకునే అలవాటు ఇక్కడి కుటుంబాల సొంతం. అప్పులు చేసి విలాసాలు చేయడం కంటే, రేపటి కోసం దాచుకోవడానికే ఇక్కడి వారు మొగ్గు చూపుతారు. సౌత్ ఇండియాలో సంప్రదాయ పొదుపు మార్గాలు ఎక్కువ. బంగారంపై పెట్టుబడి, పోస్టాఫీస్ స్కీములు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మరియు ప్రభుత్వ గుర్తింపు పొందిన చిట్‌ఫండ్స్ ఇక్కడి ప్రజలకు ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తాయి. మార్కెట్ పడిపోయినా వీరి కొనుగోలు శక్తి తగ్గకపోవడానికి ఇదే కారణం. నెల జీతం రాగానే ముందు పొదుపునకు తీసి పక్కన పెడతాం. ఆ తర్వాతే ఖర్చులు. అందుకే ఎలాంటి కష్టకాలం వచ్చినా తట్టుకోగలమనే నమ్మకం ఉంది.
దక్షిణాది రాష్ట్రాల వైవిధ్యమైన ఆర్థిక వనరులు మాంద్యాన్ని దరిచేరనివ్వడం లేదు. కర్ణాటక, తెలంగాణలో ఐటీ రంగాలు బలంగా ఉంటే.. తమిళనాడులో ఆటోమొబైల్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అగ్రి-బిజినెస్, ఆక్వా రంగాలు ఉన్నాయి. దక్షిణాదిలో సాగునీటి ప్రాజెక్టులు, స్థిరమైన వ్యవసాయం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినలేదు. పట్టణాల్లో మందగమనం ఉన్నా, గ్రామీణ మార్కెట్ డిమాండ్‌ను కాపాడుతోంది . ఆర్థిక సంక్షోభాలు వచ్చినప్పుడు బ్రాండ్లు మారవచ్చు, విలాసాలు తగ్గవచ్చు.. కానీ ప్రాథమిక అవసరాల వినియోగం తగ్గదు. దక్షిణాది రాష్ట్రాలు అనుసరిస్తున్న బహుముఖ వ్యూహాలు, ప్రజల సంప్రదాయ ఆర్థిక క్రమశిక్షణే ఇవాళ దేశానికే ఒక మోడల్‌గా నిలిచింది. మాంద్యం ముంచుకొస్తున్నా.. సౌత్ మాత్రం ధీమాగా ముందుకు సాగుతోంది. ఆర్థిక మాంధ్యాన్ని ఎలా ఎదుర్కోవాలో దక్షిణాది రాష్ట్రాలు ప్రాక్టికల్‌గా చూపిస్తున్నాయి. అటు ప్రభుత్వాల పారిశ్రామిక విధానాలు, ఇటు ప్రజల పొదుపు సూత్రాలు కలిసి ఈ ప్రాంతాన్ని సురక్షిత తీరానికి చేరుస్తున్నాయి.
ఒకప్పుడు దేశం మొత్తానికీ పొదుపు అలవాటు ఉండేది. కానీ కాలక్రమంలో దక్షిణాది మాత్రమే ఆ పొదుపు సూత్రాన్ని వదలకుండా బలంగా పట్టుకుంది.అందుకే ఆర్థిక మాంద్యం వచ్చినా.. ఇంకే సంక్షోభం వచ్చినా.. ఇక్కడి ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలకుండా తట్టుకుని నిలబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా దేశాలకు దేశాల ఆర్థిక వ్యవస్థలు పేకమేడల్లా కుప్పకూలుతున్న వాస్తవం మన కళ్ల ముందే ఉంది. కానీ దక్షిణాదిని చూస్తే మాత్రం అసలు ప్రపంచం ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్న భావనే ఇక్కడి మధ్యతరగతిలో కనిపించదు. దీనికి ప్రధాన కారణం.. వారి పరిమిత ఖర్చులు, పొదుపు అలవాట్లే అని చెప్పటానికి సందేహించాల్సిన పని లేదు. ఏ సందర్భానికైనా, సిద్ధంగా ఉండటానికి దక్షిణాది ప్రజలు పాటించే మరో కీలక సూత్రం ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బీని ఎప్పుడూ రెడీగా ఉంచుకోవటం. అందుకే ఒకటి కాకపోతే మరో ప్రణాళిక ఎప్పుడూ వర్కవుట్ అవుతుంది. అలా దక్షిణాది ఆర్థికవ్యవస్థ కుదేలు కాకుండా ఉంటోంది.
ఇక్కడ దక్షిణాదికే ప్రత్యేకమైన ఆర్థికవ్యవస్థ ఉండటమే కాదు.. దాన్ని దశాబ్దాలుగా బలంగా నిలబెడుతూ వస్తున్న.. ఇక్కడి మధ్యతరగతి సంకల్ప బలం కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడ ఎవరూ రాష్ట్రం మొత్తం గురించి ఆలోచించలేకపోయినా.. ఎవరికి వారు తమ కుటుంబం సేఫ్ జోన్లో ఉండేలా చూసుకోవడం ప్రధాన పాత్ర పోషిస్తోంది. తద్వారా మెజార్టీ కుటుంబాలు సురక్షితంగా ఉండి.. అది ఆర్థిక వ్యవస్థకు ఎక్కడలేని భరోసాను అందిస్తోంది. ఈ భరోసా లేకే ఇవాళ చాలా దేశాల ఆర్థికవ్యవస్థలు భయం గుప్పిట్లోకి జారుకుని.. పతనమౌతున్నాయి. చిన్న ప్రతికూలతకూ తట్టుకోలేక అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా నేలచూపులు చూస్తున్న తరుణంలో.. దక్షిణాది విజయగాథ అందరికీ పాఠమే అనడంలో సందేహం లేదు.
సాధారణంగా మాంద్యం వస్తే.. ప్రపంచవ్యాప్తంగా కొన్ని పరిణామాలు సహజంగా జరుగుతాయి. కానీ దక్షిణాది మాత్రం అందులోనూ ప్రత్యేకంగా నిలబడుతోంది. ఆర్థిక సంక్షోభాలు వచ్చినప్పుడు ఐటీ రంగం కుప్పకూలుతుందనే అంచనాలను దక్షిణాది తలకిందులు చేసింది. ఐటీ సేవలకే పరిమితం కాకుండా వైవిధ్యమైన పరిశ్రమలను స్థాపించడం ఇక్కడి రాష్ట్రాలకు రక్షణ కవచంగా మారింది. దక్షిణాది రాష్ట్రాలు కేవలం సాఫ్ట్‌వేర్ మాత్రమే కాకుండా గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్లుగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్ డిజైనింగ్ హబ్‌లుగా మారాయి. అమెరికాలో సగటు కుటుంబం మూడు నుండి నాలుగు నెలల అత్యవసర నిధి మాత్రమే దాచుకుంటుంది. అక్కడ క్రెడిట్ కార్డు అప్పు సాధారణం. మాంద్యం వచ్చి ఉద్యోగం పోతే రెండు నెలల్లో సంక్షోభంలో పడతారు. కానీ దక్షిణాది కుటుంబం అందుకు భిన్నంగా ఉంటుంది. ఇక్కడ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్, పోస్టాఫీస్ పొదుపు ఆపదలో ఆదుకుంటాయి. ఇంకా బంగారు నిల్వలు, చిట్ ఫండ్ లు వంటివి తరతరాల అలవాట్లు. అందుకే జీతం తగ్గినా, ఉద్యోగం ఆగినా.. ఆరు నెలలు, ఒక్కోసారి సంవత్సరం కూడా మనగలిగే స్థితి ఉంటుంది. అంతకుమించి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కొచ్చి లాంటి నగరాల్లో IT నిపుణులు, ఉపాధ్యాయులు, వైద్యులు, చిన్న వ్యాపారులు స్థిరమైన ఆదాయంతో జీవిస్తారు. వీరి జీవనశైలి, స్థిరాదాయం కారణంగా ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఒడుదుడుకులు తక్కువగా ఉంటాయి. ఒకవేళ పొరపాటున తడబడ్డా.. వెంటనే నిలదొక్కుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
దక్షిణాది మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక క్రమశిక్షణ.. ఒక నిర్దిష్ట నమూనాను అనుసరిస్తుంది. మిడిల్ క్లాస్ కుటుంబాల్లో అవసరానికి మించిన వ్యయం చాలా తక్కువ. ఇల్లు, పిల్లల చదువు, ఆరోగ్య బీమా.. ఇవే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల ప్రాధాన్యతలు. సగటున ఒక్కో మిడిల్ క్లాస్ కుటుంబంపై ఈఎంఐ భారం కూడా తక్కువే. మొత్తంమీద దక్షిణాది ఆర్థిక వ్యవస్థ భద్రతను మూడు ప్రాథమిక అంశాలు కాపాడుతున్నాయి. వ్యవసాయ పునాది.. ఆహార భద్రతను నిర్ధారిస్తుంది. ఆహార భద్రత ఉన్నప్పుడు.. ఆదాయంలో హెచ్చుతగ్గులున్నా.. పెద్ద పట్టింపు ఉండదు. ఇక పొదుపు సంస్కృతి.. ఆర్థిక దెబ్బను తట్టుకునే శక్తిని ఇస్తుంది. వీటికి మించి మధ్యతరగతి సంయమనం అసలైన రక్షా కవచం. విలాసం కంటే స్థిరత్వాన్ని ఎంచుకునే జీవనశైలే దక్షిణాది ఆర్థికవ్యవస్థకు శ్రీరామరక్షగా నిలుస్తోంది. ఇంకా చెప్పాలంటే ఇది మాంద్యం కాలంలో అత్యంత విలువైన లక్షణం.
కానీ ఎన్ని సురక్షిత కవచాలున్నా.. అవేవీ వాటంతట అవి పనిచేయవు. అందుకోసం ఇప్పటిదాకా పాటిస్తూ వచ్చిన నిర్దిష్ట పద్ధతుల్ని కొనసాగించడం అత్యవసరం. ఇప్పుడిప్పుడే దక్షిణాది జీవనశైలిలోనూ మార్పులు కనిపిస్తున్నా.. అవి ఇంకా మధ్యతరగతి దాకా రాలేదు. ప్రస్తుతానికి ధనికులు, బిలియనీర్లు మాత్రమే తమ జీవనశైలి కారణంగా.. కాస్త ఇబ్బంది పడుతున్నారు. కానీ మధ్యతరగతి విలాసాల జోలికి పోకపోవడంతో.. వారి జీవన భద్రతకు ఢోకా లేదు. అయితే మధ్యతరగతి సంఖ్య ఎక్కువ కాబట్టి.. ఓవరాల్‌గా ఆర్థిక వ్యవస్థ కూడా స్థిరంగానే కొనసాగుతోంది.
దక్షిణాది ఆర్థిక వ్యవస్థ ప్రత్యేకత, ఇక్కడి మధ్యతరగతి జీవనశైలి గొప్పతనం గురించి ఇన్ని మాటలు అక్కర్లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ప్రపంచ మార్కెట్ తుపాను వచ్చినా.. దక్షిణాది రైతు కుటుంబం తన పొలంపై ఆధారపడగలదు. ఇది బయటి నుంచి వచ్చే సంక్షోభాలకు సహజంగా అడ్డుపడే ఓ తిరుగులేని రక్షణ గోడ. అందుకే దక్షిణాది తలసరి ఆదాయం కూడా ఎప్పుడూ పురోగమన దశలోనే ఉంటుంది. తలసరి ఆదాయంలో తెలంగాణ జాతీయ సగటుకు 193 శాతం. కర్ణాటక 181 శాతం, తమిళనాడు 171 శాతం, కేరళ 152 శాతం అయితే ఆంధ్రప్రదేశ్ 131 శాతంగా ఉంది. చివరకు దక్షిణాది రాష్ట్రాల భవిష్యత్తు అంచనాలు కూడా మెరుగ్గానే ఉండటం ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ ఏడాది నుంచి 2030 మధ్య దక్షిణాది రాష్ట్రాలు సగటున 6.8 శాతం వృద్ధి నమోదు చేస్తాయని విశ్లేషణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇది జాతీయ సగటు కంటే దాదాపు ఒక శాతం అధికం.
ఇటీవలి కాలంలో దక్షిణాది రాష్ట్రాలు రెండంకెల వృద్ధిరేటు లక్ష్యంగా పోటీపడి పనిచేస్తున్నాయి. పెట్టుబడుల కోసం దేశవ్యాప్తంగా ఉండే పోటీ ఓ ఎత్తైతే.. దక్షిణాది రాష్ట్రాల మధ్య పోటీ మరో ఎత్తు. చివరకు ఓ రాష్ట్రంలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన పరిశ్రమల్ని తమవైపు ఆకర్షించటానికి కూడా దక్షిణాది రాష్ట్రాలు గట్టిగా కృషి చేస్తాయి. అలా చూసుకుంటే.. ఒక్కసారి దక్షిణాదికి వచ్చిన ఏ పెద్ద పెట్టుబడి అయినా.. దశాబ్దాల పాటు ఇక్కడే స్థిరంగా ఉంటుంది. తద్వారా ఈ ప్రాంతం ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. ఆర్థిక వనరుల్లో వైవిధ్యం కూడా ఉంటుంది. తాము ఇప్పటిదాకా ఎక్కడ బలంగా ఉన్నామో, ఇంకేం చేస్తే బలహీనతల్ని అధిగమిస్తామో ఎప్పటికప్పుడు సరిచూసుకోవటం సగటు దక్షిణాది మధ్యతరగతి కుటుంబానికి ఉన్న అలవాటు. ఈ అలవాటు చాలా సాధన మీద కానీ సాధించలేనిది. కానీ దక్షిణాది మధ్యతరగతి మాత్రం అలవోకగా ఈ అలవాటును తమలో ఇముడ్చుకుంది.
దక్షిణాది రాష్ట్రాలు ఎంతో కష్టపడి తమ ఆర్థిక వ్యవస్థల్ని నిర్మించుకున్నాయి. పునాదుల్ని పదిలంగా కాపాడుకుంటున్నాయి. అందుకు తగ్గట్టే ఇక్కడి మధ్యతరగతి కుటుంబాలు ఆర్థిక చక్రానికి ఇరుసుగా మారుతున్నాయి. ఓవైపు ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిణామాల్ని అంచనా వేస్తూనే.. మరోవైపు తమ వ్యక్తిగత జీవనానికి, కుటుంబ భద్రతకు ఇబ్బంది లేకుండా చూసుకోవడంలో దక్షిణాది మిడిల్ క్లాస్ ఆరితేరింది. ఆ విషయం ఎప్పటికప్పుడు నిరూపితమౌతూనే ఉన్న సత్యం. ఈ నైజమే దక్షిణాదిని ప్రపంచ మాంద్యం పరిస్థితిలోనూ.. సురక్షితంగా ఉంచుతోందని వేరే చెప్పాల్సిన పని లేదు. ఇదీ ఈ వారం ఛైర్మన్స్ డెస్క్. మరో అంశంపై విశ్లేషణతో మళ్లీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.
