Site icon NTV Telugu

Chairman’s Desk : వీసాలు, సుంకాలు, యుద్ధం..అడుగడుగునా వెన్నుపోటేనా? Trump ఎందుకిలా చేస్తున్నాడు?

Chairmens Desk

Chairmens Desk

అమెరికా అధ్యక్షుడ్ ట్రంప్ ఇండియాకు అడుగడుగునా ద్రోహమే చేస్తున్నారు. వీసాల విషయంలో కఠినంగా ఉంటున్నారు. వలసల అంశంలోనూ పగబట్టినట్టుగా వ్యవహరించారు. ఇక సుంకాలైతే చెప్పక్కర్లేదు. చివరకు కీలకమైన యుద్ధం సమయంలోనూ మనకు హ్యాండిచ్చారు. ట్రంప్ ను మొదట్నుంచీ నెత్తిన పెట్టుకున్న ఎన్నారైలకు.. వైట్ హౌస్ లో అడుగుపెట్టగానే షాకిచ్చారు ట్రంప్. అలాగే ట్రంప్ కు చాలా ప్రాధాన్యత ఇచ్చిన మోడీకి కూడా తలనొప్పులే సృష్టించారు. ఏతావాతా ట్రంప్ మిత్రుడి ముసుగు తీసేయడంతో.. భారత్ కు అసలైన ద్రోహి అని తేలిపోయింది. ఇదే అంశంపై ఇవాల్టి ఛైర్మన్స్ డెస్క్ చూద్దాం.

ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాగానే అందరికంటే ఎక్కువ సంతోషించింది భారతీయులు, అక్కడి ఎన్నారైలే. ఎందుకంటే ట్రంప్ ప్రచారంలో ఆ లెవల్లో ఇండియాని ఆకాశానికెత్తారు. భారత్ కు నిజమైన మిత్రుడిలా ఉంటానని నమ్మబలికారు. ఇదే ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికవ్వటానికి ఎన్నారైల అండ కోసం నానా పాట్లు పడ్డారు. ప్రచారంలో అమెరికా కంటే ఇండియా ప్రస్తావనే ఎక్కువగా తీసుకొచ్చారు. ఎప్పుడూ లేని విధంగా భారతీయ స్థానిక భాషల్లోనూ అమెరికాలో పోస్టర్లు దర్శనమిచ్చాయి. ట్రంప్ మాటలు నమ్మి.. భారత్ మూలాలున్న కమలా హ్యారిస్ ను కూడా కాదని.. ఎన్నారైలు ట్రంప్ కు అండగా నిలిచారు. భారత్ లో కూడా ట్రంప్ గెలిస్తే మనకు మంచిదనే చర్చ జరిగింది. కానీ అదంతా గతం. వైట్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగానే.. ట్రంప్ నిజస్వరూపం బట్టబయలైంది. కానీ ఇంతగా నమ్మి గద్దెనెక్కించినందుకు ట్రంప్.. భారత్ కు అడుగడుగునా ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ఇరకాటంలో పెట్టి శునకానందం పొందుతున్నారు. వరుసగా భారతీయుల్ని ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తీసుకుంటున్నారు. అక్రమ వలసదారులపై కఠినంగా ఉంటానంటే.. ఏవో కొన్ని దేశాలపై కన్నెర్ర చేస్తారులే అనుకున్నారు. కానీ ట్రంప్ చేసింది వేరే. ఏకంగా మన విద్యార్థులకే బేడీలు తగిలించి.. మిలటరీ విమానంలో స్వదేశానికి డీపోర్ట్ చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు. కానీ ట్రంప్ మాత్రం భారత్ మీద పగ బట్టినట్టుగా ఆ పని చేశారు. అప్పటికీ మోడీ మావాళ్లను వెనక్కుతీసుకుంటామని హామీ ఇచ్చారు. అయినా సరే ట్రంప్ మాత్రం మన విద్యార్థులకు కనీస గౌరవం ఇవ్వకుండా.. మానసికంగా క్షోభ పెట్టారు. ఇప్పటికీ భారతీయ విద్యార్థుల్ని వెంటాడి వేధించే పని చేస్తున్నారు.

వలసలపై గందరగోళం కాస్త సద్దుమణిగాక.. ఉరుము లేని పిడుగులా సుంకాలు బాదేశారు. ఇక్కడ కూడా మనపై భారీ సుంకాలు ఉండవులే అనే అంచనాలు తప్పయ్యాయి. దీనిపై కూడా మనవైపు నుంచి చర్చలు, సంప్రదింపులకు ప్రయత్నాలు జరిగినా.. కనీసం ఇచ్చిన గడువు పూర్తయ్యేదాకా కూడా ఆగకుండా.. ముందే నిర్దాక్షిణ్యంగా సుంకాల మోత మోగించారు. ఫార్మాపై సుంకాల్లేవులే అని సంతోషించేలోపే.. మందుల ధరలు తగ్గించాలంటూ డెడ్ లైన్ పెట్టి ఫార్మా దిగ్గజాలకు షాకిచ్చారు. దీంతో ట్రంప్ భారత్ ను వేధించటానికే కంకణం కట్టుకున్నారని తేలిపోయింది. టారిఫ్స్‌ను.. ఆవేశపూరితమైన వాణిజ్య దౌత్య వ్యూహంగా చాలా మంది నిపుణులు చూస్తున్నారు. అయితే కేవలం భారత్‌ మాత్రమే కాకుండా.. బ్రిక్స్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలతో ఏర్పడిన గ్రూప్‌లు.. ప్రపంచంపై తమ ఆధిపత్యానికి గండికొడుతాయన్న భయం అమెరికాకు ఉందని అభిప్రాయపడుతున్నారు. అందుకే తాజాగా బ్రిక్స్‌ను.. అమెరికా, డాలర్‌కు వ్యతిరేక శక్తిగా అభివర్ణించారు. అందులో భారత్‌ ఒకటన్న ట్రంప్.. అందుకే టారిఫ్స్ విధిస్తున్నామని చెప్పారు. డాలర్‌కు ఎదురొచ్చే ఎవరినీ వదిలిపెట్టం అన్నారు.ఇక సుంకాలపై చర్చల విషయంలో కూడా ట్రంప్ తీరు ఏకపక్షంగానే ఉంది. అన్నీ అమెరికాకు అనుకూలమైన ప్రతిపాదనలే తప్ప.. ఎక్కడా ఇండియా గురించి ఆలోచిస్తున్న దాఖలాల్లేవు. పైగా భారత్ ను ఇబ్దంపెట్టే ప్రపోజల్స్ ను ఉద్దేశపూర్వకంగా ముందుకుతెచ్చి.. వాటికి అంగీకరించాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. కానీ చర్చల్లో భారత్ బృందం బెట్టు చేస్తుండటంతో.. ట్రంప్ మరింత రెచ్చిపోతున్నారు. ఏకంగా ఇండియాది డెడ్ ఎకానమీ అంటూ నోరు పారేసుకున్నారు. పైగా రష్యాతో కలిసి మునగనీయండని దురుసు వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని బృందం అమెరికాతో చర్చలు జరుపుతోంది. కానీ చర్చలు ఓ కొలిక్కి రాకుండానే ట్రంప్ నోటికొచ్చినట్టు మాట్లాడటం.. కచ్చితంగా నష్టం చేసే అంశమే. ట్రంప్ పోకడ చూస్తుంటే.. పేరుకే చర్చలు కానీ.. తనకు నచ్చినట్టే డీల్ కుదరాలనే దురాలోచన కనిపిస్తోంది. ఈ రేంజ్ లో భారత్ పై ఒంటికాలిపై లేస్తున్న ట్రంప్.. అదే సమయంలో మిగతా దేశాలతో అంత కఠినంగా ఉండటం లేదు. మరి కేవలం భారత్ మాత్రమే చేసిన పాపమేంటో ఎవరికీ అర్థం కావడం లేదు. అమెరికా చరిత్రలో మరే అధ్యక్షుడూ ఈ స్థాయిలో భారత్ పై కత్తి కట్టలేదు. చివరకు అగ్రరాజ్యంతో మనకు మంచి సంబంధాలు లేని సమయంలో కూడా ఇలాంటి పనులు ఎవరూ చేయలేదు. కానీ ఇప్పుడు భారత్ అమెరికాతో అత్యంత సన్నిహిత సంబంధాలున్న దేశాల్లో ఒకటి. అంతేకాదు అమెరికా దక్షిణాసియా విధానంలో కీలకం. చైనాకు చెక్ పెట్టడానికి కూడా భారత్ కీలకం. ఇలా భారత్ తో వ్యూహాత్మక అవసరాలున్నాయని తెలిసి కూడా ట్రంప్ ఇంత తెంపరితనం ప్రదర్శించడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏతావాతా ట్రంప్ భారత్ ను ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేస్తున్నారని తేలిపోతోంది.

అమెరికాతో గత మూడు దశాబ్దాలుగా భారత్ బంధం క్రమంగా బలపడుతూ వచ్చింది. అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుతూనే వచ్చింది. సోవియట్ రష్యా విచ్ఛిన్నం తర్వాత భారత్ క్రమంగా అమెరికాతో స్నేహం చేస్తూ వచ్చింది. అంతమాత్రాన రష్యాతో మైత్రిని ఎక్కడా వదులుకోలేదు. కానీ ఇప్పుడు ట్రంప్ మాత్రం అమెరికానా, రష్యానా ఏది కావాలో తేల్చుకోవాలని భారత్ కు సవాల్ విసురుతున్నారు. అదే సమయంలో ఇండియా ఎక్కడా తొణకటం లేదు. కాలపరీక్షకు నిలిచిన రష్యా స్నేహాన్ని వదులుకునే ప్రసక్తే లేదని తేల్చేసింది. దీంతో ఇక భారత్ తో పనిలేదన్నట్టుగా పాకిస్తాన్ ను చేరదీస్తున్నారు ట్రంప్. ట్రంప్ ఎన్ని జిత్తులు పన్నినా.. ఎలా తిప్పికొట్టాలో తెలుసంటున్న భారత్.. ట్రంప్ వ్యాఖ్యలకు పెద్దగా స్పందించకపోవడం.. ఆయనకు పుండు మీద కారం చల్లినట్టవుతోంది. దీంతో కల్లు తాగిన కోతిలాగా చిందులు తొక్కుతున్నారు.

ఇండియా ఎడాపెడా నోరుపారేసుకుంటున్న ట్రంప్ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారు. భారత్ ఆర్థిక వ్యసవ్థ బాగుందని ప్రపంచ బ్యాంకు కితాబిచ్చిన గంటల వ్యవధిలో ట్రంప్ డెడ్ ఎకానమీ అని వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమైంది. అలాగే అమెరికన్ ఏఐ కూడా భారత్ ఆర్థిక వ్యవస్థ విషయంలో ట్రంప్ కు పూర్తి భిన్నమైన వైఖరి తీసుకుంది. దీంతో అమెరికా అధ్యక్షుడి పరువు గంగపాలైంది. భారత్ ను చిన్నబుచ్చాలని చూస్తున్న ట్రంప్.. తన స్థాయిని తానే తగ్గించుకుని.. చివరకు అమెరికా ప్రతిష్ఠను కూడా మంటగలుపుతున్నారు.

అమెరికా ఆర్థిక వ్యవస్థ నిరాశాజనకంగా ఉన్న తరుణంలో.. ట్రంప్ భారత్ పై అక్కసు వెళ్లగక్కుతున్నారు. తన బెదిరింపులకు భారత్ లొంగటం లేదని మరింతగా రెచ్చిపోతున్నారు. తనకు అమెరికా ప్రయోజనాలే ముఖ్యమంటున్న ట్రంప్.. అదే మాట భారత్ అంటే మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. అమెరికన్లకు అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన ట్రంప్.. ఎన్నికల హామీల్ని నెరవేర్చలేక.. మిగతా దేశాలపై పడిపోతున్నారు. అమెరికాలో ట్రంప్ వచ్చిన దగ్గర్నుంచీ నిరుద్యోగం పెరుగుతోందని వాస్తవాలు చెప్పిన అధికారిని ఉద్యోగం లోంచి తీసేశారు. మొత్తం మీద ట్రంప్ కు ఓ విధానమంటూ ఏం లేదు. ఇక ఆయన నిర్ణయాలకు తలా తోకా కూడా లేదు. కేవలం తనకు నచ్చిన మాటలు వినటానికే సిద్ధంగా ఉంటున్నారు. నచ్చని మాటలే కాదు.. దేశాలూ అక్కర్లేదన్నట్టుగా ఆయన తీరు ఉంది. ట్రంప్ దుందుడుకు ధోరణి చూస్తుంటే.. ఇండియాతో కోరి కయ్యం పెట్టుకుంటున్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. ట్రంప్ వ్యవహారశైలి చూశాక.. పాముకు పోలు పోసి పెంచామని ఎన్నారైలు పశ్చాత్తాపపడుతున్నారు.

Exit mobile version