ప్రధానిగా పదకొండేళ్లు పూర్తిచేసుకున్న మోడీ.. మరోసారి గెలుపు దిశగా ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే వరుసగా మూడుసార్లు కేంద్రంలో అధికారం దక్కించుకున్న బీజేపీ.. నాలుగోసారి పవర్లోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది. మన దేశంలో నాలుగోసారి వరుస గెలుపు అంత తేలిక కాదనే వాదన ఉన్నా.. మోడీకి, బీజేపీకి కొన్ని సానకూలతలు లేకపోలేదనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో ప్రతికూలతల సంగతేంటనే ప్రశ్నలూ లేకపోలేదు. మరి పొలిటికల్ బాహుబలిగా ఎదిగిన మోడీ.. తన ఛరిష్మాను మరో నాలుగేళ్లు నిలబెట్టుకుంటారా..? ప్రజల్ని మరోసారి ఆకట్టుకోవటానికి ఆయన దగ్గరున్న అస్త్రాలేంటి.. అసలు ఇప్పటిదాకా మోడీని తిరుగులేని నేతను చేసిన అంశాలేంటి..? ఇదే అంశంపై ఇవాల్టి ఛైర్మన్స్ డెస్క్ చూద్దాం.
తొలి విడతలో కొత్తకొత్తగా సాగిన మోడీ ప్రయాణం.. రెండో విడతకు వచ్చేసరికి పూర్తిస్థాయి సాధికారతను సొంతం చేసుకుంది. 2014లో బీజేపీకి సింగి ల్ గా 282 సీట్లు వస్తే.. 2019లో ఏకంగా 303 సీట్లు రావడం.. మోడీ ఛరిష్మాను పార్టీలో, దేశంలో మరింత పెంచింది. గతంలో కంటే పెరిగిన సీట్లతో మోడీలోనూ రెట్టించిన ఉత్సాహం వచ్చింది. దీంతో ఎప్పట్నుంచో ఉన్న అజెండాలో పనులు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్లారు. ఈ ఫలితాలు ఇచ్చిన ఊపులోనే.. మోడీ రెండో విడత తొలి వంద రోజుల్లోనే ఆర్టికల్ 370ని రద్దు చేశారు. దీనికి విపక్షాల నుంచి కూడా అనుకున్నంత వ్యతిరేకత రాలేదు. పైగా వ్యతిరేకించిన కాంగ్రెస్ లోనూ భిన్నస్వరాలు వినిపించడం బీజేపీకి కలిసొచ్చింది. ఇక ఆర్టికల్ 370 రద్దు చేస్తే.. ఏదో జరిగిపోతుందనే ఆందోళనల్ని ఆయన ఖాతరు చేయలేదు. అందుకు తగ్గట్టుగానే ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు జరగకపోవడం మోడీ ప్రతిష్ఠను బాగా పెంచింది. శ్రీనగర్ లాల్ చౌక్ లో తొలిసారి జాతీయ జెండా ఎగిరిందని, కశ్మీర్ కు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని బీజేపీ విపరీతంగా ప్రచారం చేసింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో ఉగ్ర కార్యకలాపాలు తగ్గుముఖం పట్టినట్టుగా గణాంకాలు చాడటం కూడా మోడీ ఇమేజ్ కు ప్లస్సైంది. ఆ తర్వాత జమ్ముకశ్మీర్ రాష్ట్ర పునర్వ్యవస్థీరణ క్రతువు కూడా నిరాటంకంగా పూర్తైంది. కశ్మీర్లో గవర్నర్ పాలనపై మొదట్లో విమర్శలు వచ్చినా.. ఆ తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో ఓటర్ల ఉత్సాహం అందరికీ ఓ నమ్మకాన్ని తెచ్చింది. గవర్నర్ పాలనలో కశ్మీర్లో వ్యాపార, వాణిజ్యాలు కూడా కాస్త పుంజుకోవడం, జీవనోపాధి మెరుగుపడటం.. స్థానికులకూ కాస్త ఊరట ఇచ్చింది.
ఇక ట్రిపుల్ తలాక్ రద్దు అంశం కూడా బీజేపీకి రాజకీయంగా కలిసొస్తున్నట్టు తేలిన దశ కూడా ఇదే. కొన్ని రాష్ట్రాల్లో ముస్లిం మెజార్టీ నియోజకవర్గాల్లోనూ బీజేపీ గెలవడం మిగతా పార్టీల్ని ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత కొన్ని తటస్థ సంస్థల పరిశీలనలో ముస్లింలలోనూ బీజేపీ ఏర్పడ్డ ఓటు బ్యాంకు గురించి అందరికీ తెలిసింది. దీన్ని బీజేపీ ఓటు బ్యాంకు అనడం కంటే మోడీ ఓటు బ్యాంకు అనాలనే వాదన కూడా వినిపించింది. బీజేపీకి ఓటు బ్యాంకు విషయంలో చారిత్రకంగా కొన్ని పరిమితులున్నాయి. కానీ మోడీ ఆ హద్దులన్నీ చెరిపేశారని, దేశవ్యాప్తంగా కుల,మతాలకు అతీతంగా ఆయన ఓట్లు తెచ్చుకోగలుగుతున్నారని ఎన్నికల పండితులు కూడా ఒప్పుకున్న సందర్భమది. అంతగా రెండో విడతలో మోడీ ప్రభ వెలిగిపోయింది. మోడీ ఉచ్ఛ స్థితిలో ఉండగా.. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఓటముల్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. పైగా ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీకి డిఫాల్ట్ గా ఫేవరెట్ గా భావించే సంస్కృతి మొగ్గతొడిగింది.
ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లేలోగానే అయోధ్యలో రామమందిర నిర్మాణం తొలిదశ పూర్తి చేశారు మోడీ. ఈ సందర్భాన్ని దేశవ్యాప్తంగా పండగలా చేసుకున్నారు. మోడీ హయాంలో హిందూ మతానికే పూర్వవైభవం వచ్చిందనే స్థాయిలో చర్చ జరిగింది. ఈ దెబ్బతో హిందువుల ఓట్లన్నీ సంఘటితమై.. బీజేపీ మరింత బలపడుతుందనే అంచనాలు వచ్చాయి. అతి పెద్ద రాష్ట్రం యూపీలో బీజేపీ రాజకీయ సుస్థిరతను సాధించడంతో మోడీకి తిరుగులేకుండా పోయింది. రెండో విడతలో దేశమంతా మోడీ షో నడిచిందనే చెప్పాలి.
కానీ రెండో విడత పూర్తయ్యే సమయానికి బీజేపీ క్యాడర్లో కనిపించని నిర్లిప్తత ఆవరించింది. పై నుంచి చూస్తే అంతా బాగానే ఉంది. కానీ ఎన్నికలకు కావాల్సింది ఇంకేదో మిస్సైందనే భావన లోలోపల కనిపించింది. ఇదే సమయంలో కొందరు సీఎంల ఎంపిక విషయంలో భిన్నాభిప్రాయాలు వచ్చాయి. అవేవీ రచ్చకెక్కకపోయినా.. అంతర్గతంగా బీజేపీలో కొంత ఇబ్బందిని సృష్టించాయనే చెప్పాలి. దీంతో బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో గ్రూపులు తయారయ్యాయి. ఈ సంగతి పూర్తిస్థాయిలో అధిష్ఠానం దాకా వెళ్లకపోవడం.. ఎన్నికల సన్నద్ధతను కొంత మేర దెబ్బకొట్టిందని తర్వాత తేలింది. మొత్తం మీద ఎదురులేని అధికారంతో రెండో విడత పాలన ప్రారంభించిన మోడీ.. దాన్ని అదే స్థాయిలో పూర్తిచేసుకోలేకపోయారనే చెప్పాలి.. చివరకు వచ్చేసరికి తెలియకుండా ఏర్పడ్డ బలహీనతలు.. 2024 ఎన్నికల్లో బీజేపీకి నష్టం చేశాయి. తిరుగులేదనుకున్న యూపీలో 30 సీట్లు పోవడం.. చిన్న విషయం కానే కాదు. అలాగే బలమైన ఉత్తరాది రాష్ట్రాల్లో కొన్నిచోట్ల బీజేపీని సొంత పార్టీలో గ్రూపులే ఓడించాయనే చేదు నిజం ఆలస్యంగా వెలుగుచూసింది. పార్టీకి ప్రతిష్ఠగా నిలిచిన అయోధ్యలో బీజేపీ ఓడిపోవడం మరింత షాక్.
నిజానికి బీజేపీలో అంతర్గత బలహీనతలు అప్పటికప్పుడు బయటపడలేదు. కొన్నాళ్ల ముందుగానే సంకేతాలు కనిపించాయి. కానీ అప్పుడు తిరుగులేని అధికారం అనుభవిస్తున్న బీజేపీ.. వాటిని అంత సీరియస్ గా తీసుకోలేదనే వాదన వినిపించింది. తర్వాత ఆ చిన్న విషయాలే పెద్దవయ్యాయి. చివరకు వస్తాయనుకున్న 400 సీట్లు రాకపోగా.. కేవలం 240 సీట్లకే పరిమితం అవ్వాల్సి వచ్చింది. తొలి విడతలో పార్టీ సీఎంలతోనూ తేడా రాకుండా చూసుకున్న మోడీ.. పార్టీలో కూడా సమష్టి నిర్ణయాలు ఉండేలా జాగ్రత్తపడ్డారు. కానీ రెండో విడతకు వచ్చేసరికి.. సీఎంలతో వ్యవహారంలో తేడా వచ్చిందనే కామెంట్లు వచ్చాయి. అలాగే ఏ నిర్ణయమైనా మోడీ, అమిత్ షా మాత్రమే తీసుకుంటున్నారనే భావన బలపడింది. చివరకు గడ్కరీ లాంటి సీనియర్లు కూడా బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయడం.. పార్టీలో అసలేం జరుగుతోందనే ప్రశ్నల్ని క్యాడర్లో రేకెత్తించింది. చివరకు ఆరెస్సెస్ తోనూ అంటీముట్టనట్టుగా ఉండటం.. సంఘ్ పరివార్ లోనూ అసంతృప్తికి కారణమైంది. అసలు ఆరెస్సెస్ అవసరం బీజేపీకి లేదన్నట్టుగా పార్టీ జాతీయ అధ్యక్షుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా కలకలం రేపాయి. కొన్ని విషయాల్లో మోడీ పాత్ర ఏమీ లేకపోయినా.. ఆయనకు తెలిసే అంతా జరుగుతుందనే ప్రచారం గట్టిగా జరిగింది. ఇది కూడా మోడీ ఇమేజ్ కు నష్టం చేసింది. ఇలా ఒక్కొక్కటిగా మోడీ బలాలు దూరం కావడం.. ఆయన వ్యక్తిగత ఛరిష్మాను కూడా కాస్త దెబ్బతీసింది. ఈ కారణంగానే అనుకున్నన్ని సీట్లు రాలేదనే చర్చ జరిగింది.
