Site icon NTV Telugu

Zomato: 225 సిటీల్లో నిలిచిపోనున్న జొమాటో సేవలు..కారణం ఇదే..

Zomato

Zomato

Zomato: పుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫామ్ జొమాటో తన మూడో త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. కంపెనీ ఆదాయం 75 శాతం పెరిగింది. గతేడాది డిసెంబర్ త్రైమాసికంలో రూ. 1,112 కోట్లు కాగా.. ఈ ఏడాది డిసెంబర్ త్రైమాసికంలో రూ.1,948 కోట్లు ఆదాయం వచ్చింది. అయితే నష్టాలు మాత్రం 450 శాతం పెరిగాయి. గతేడాది డిసెంబర్ త్రైమాసికంలో రూ. 63 కోట్లు ఉండగా.. ఈ ఏడాది రూ.345 కోట్ల నష్టాలు చవిచూసింది. మునుపటి క్వాటర్లీ ఫలితాలతో పోల్చుకుంటే వినియోగదారుల లావాదేవీలు పడిపోయాయి. ఆర్థిక సంవత్సరం 2023 రెండో త్రైమాసికంలో జొమాటో మొత్తం 17.5 మిలియన్ల లావాదేవీలను కలిగి ఉంది. ఇది మూడో త్రైమాసికంలోకి రాగానే 17.4 మిలియన్లకు పడిపోయింది. అక్టోబర్ నుంచి ఫుడ్ డెలివరీ వ్యాపారంతో మందగమనాన్ని చూస్తున్నట్లు జొమాటో వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్ కనిపిస్తోందని.. అయితే టాప్-8 నగరాల్లో అంతకన్నా ఎక్కువగా ఉందని తెలిపింది.

Read Also: Turkey Earthquake: టర్కీ భూకంప విధ్వంసం.. 300 కిలోమీటర్ల పొడవు పగుళ్లు.. శాటిలైట్ చిత్రాల్లో గుర్తింపు..

ఇదిలా ఉంటే వ్యాపారంతో తగ్గుదల కారణంగా ఖర్చులను తగ్గించుకునే పనిలో పడింది జొమాటో. 225 నగరాల్లో తన సేవలను నిలివేసింది. చిన్న నగరాల నుంచి తమ సర్వీసుల నుంచి నిష్క్రమించినట్లు తెలిపింది. ఈ నగరాలపై తాము పెట్టిన పెట్టుబడి అనుకున్న సమయంలో వచ్చేలా లేదని.. గత కొన్ని త్రైమాసికాలుగా ఈ నగరాల్లో వ్యాపారం సరిగా జరగడం లేదని జొమాటో తెలిపింది. జొమాటో తన ఆదాయాలను వేగంగా పెంచుకోగలుగుతున్నప్పటికీ.. బ్లింకిట్ కొనుగోలు చేసిన తర్వాత, దాని నష్టాలు, ఆదాయ వృద్ధిని మించిపోయాయి. ఫుడ్ డెలివరీ వాల్యూమ్ సాపేక్షంగా ఏడాదికి 25 శాతం పెరగాలి. కానీ అలా జరగకపోవడంతో 225 నగరాల నుంచి జొమాటో నిష్క్రమిస్తోంది.

Exit mobile version