Site icon NTV Telugu

Anil Agarwal Warns: భారత్‌ను ప్రపంచం మార్కెట్‌గా చేస్తోంది.. అభివృద్ధిని కోరుకోవడం లేదు… అనిల్ అగర్వాల్ సంచలన పోస్ట్..

Anil Agarwal

Anil Agarwal

Anil Agarwal Warns: వేదాంత గ్రూప్ చైర్మన్, బిలియనీర్ వ్యాపారవేత్త అనిల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రపంచ దేశాలు భారత్‌ను ఉత్పత్తి కేంద్రంగా కాకుండా కేవలం మార్కెట్‌గా మాత్రమే చూస్తున్నాయని, భారతదేశం పురోగతిని ప్రపంచం కోరుకోవడం లేదని ఆయన తన తాజా పోస్టులో వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనిల్ అగర్వాల్, ఇటీవల వ్యక్తిగత విషాదాన్ని ఎదుర్కొన్నప్పటికీ మళ్లీ ప్రజా చర్చల్లోకి వచ్చారు. X (ట్విట్టర్)లో చేసిన పోస్టులో, భారత్ స్వావలంబన దిశగా మరింత వేగంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

దేశీయ ఉత్పత్తి, ఉపాధిపై దృష్టి అవసరం
ప్రపంచం భారత్‌ను వినియోగ మార్కెట్‌గా మాత్రమే చూడాలనుకుంటోందని, ఉత్పత్తి దేశంగా ఎదగడం కొందరికి ఇష్టంలేదని అనిల్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ఈ ఆలోచనను భారత్ తిరస్కరించాల్సిన అవసరం ఉందని, దేశీయ ఉత్పత్తిని పెంచడం ద్వారా ఉపాధి అవకాశాలు విస్తరించాలని సూచించారు. ఒకప్పుడు ఆహారం కోసం దిగుమతులపై ఆధారపడిన భారత్, నేడు స్వయం సమృద్ధి సాధించిందని, ప్రభుత్వ విధానాలు మరియు ఉద్యమాల వల్లే ఇది సాధ్యమైందని ఆయన గుర్తు చేశారు.

ఇంధన రంగంలో స్వావలంబన అత్యవసరం
భారతదేశ ఇంధన భద్రతపై కూడా అనిల్ అగర్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశానికి అవసరమైన చమురు, గ్యాస్‌లో సుమారు 90 శాతం దిగుమతులపై ఆధారపడుతున్నామని, ఇది భారత్‌ను దుర్బలంగా మారుస్తోందని అన్నారు. మూడు వైపులా సముద్రం ఉన్న దేశంగా, ఏదైనా అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఏర్పడితే ఇంధన సరఫరా తీవ్రంగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాబోయే 20 సంవత్సరాల్లో భారత్‌లో చమురు, గ్యాస్ డిమాండ్ మరింత పెరగనుందని, ఈ పరిస్థితిలో దేశీయ ఉత్పత్తిని గణనీయంగా పెంచడం తప్ప మరో మార్గం లేదని ఆయన స్పష్టం చేశారు.

‘ఏం చేయాలి?’
భారతదేశంలో అపారమైన సహజ వనరులు, ప్రతిభావంతులైన వ్యవస్థాపకులు ఉన్నారని అనిల్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇంధన రంగంలో కీలకమైన అంశం అన్వేషణ (Exploration) అని ఆయన నొక్కిచెప్పారు. 20 ఏళ్ల క్రితం అమెరికా కూడా హైడ్రోకార్బన్ దిగుమతులపై ఆధారపడిందని, కానీ అన్వేషణను ప్రైవేటు రంగానికి తెరవడం ద్వారా ఆ దేశం తన ఇంధన దృక్పథాన్ని పూర్తిగా మార్చుకుందని ఉదాహరణగా తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో ఇంధన రంగానికి సంబంధించి కేవలం కొన్ని లైసెన్సులే ఉన్నాయని, అవసరమైతే వేల సంఖ్యలో లైసెన్సులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కఠినమైన నిబంధనలను సడలించి, ఉత్పత్తిని సులభతరం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

బీహార్ నుంచి లండన్ వరకు వ్యాపార ప్రయాణం
అనిల్ అగర్వాల్ భారతదేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరు. బీహార్‌లో చిన్న స్థాయి వ్యాపారంతో ప్రారంభమైన ఆయన ప్రయాణం ముంబై మీదుగా లండన్ వరకు విస్తరించింది. మైనింగ్, లోహాలు, సెమీ కండక్టర్ల రంగాల్లో వేదాంత గ్రూప్ కీలక పాత్ర పోషిస్తోంది. ఫోర్బ్స్ రియల్‌టైమ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అనిల్ అగర్వాల్ నికర విలువ సుమారు 4 బిలియన్ డాలర్లు (రూ. 36 వేల కోట్లకు పైగా)గా అంచనా వేయబడింది.

Exit mobile version