Eggs Prices: గతంలో రూ. 6, రూ. 7 లకు దొరికే ‘కోడిగుడ్డు’ ధర ఇప్పుడు రూ. 8కి చేరింది. అయితే, ఇలా ఎందుకు పెరుగుతున్నాయని సాధారణ వినియోగదారుడి మదిలో ఒక ప్రశ్న మాత్రం ఉత్పన్నమవుతోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో, నగరాల్లో ఎగ్స్ రేట్లు పెరిగాయి. దీనికి ముఖ్యంగా, చలి కాలమే కారణమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్-జనవరి మధ్య గుడ్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో ప్రొటీన్ రిచ్ ఫుడ్స్‌కు డిమాండ్ ఉంటుంది. స్కూల్ హాస్టల్స్, రోడ్ సైడ్ తిరుబండారాల షాపులు, ఇళ్లలో గుడ్ల వినియోగం పెరిగింది.
ప్రస్తుత పరిస్థితుల్లో కోడిగుడ్ల రేట్లు జనవరి చివరి వరకు ఇలాగే ఉండే అవకాశం ఉంది. ఫిబ్రవరి నుంచి డిమాండ్ తగ్గుతుంది. దీంతో ధరలు కూడా దిగి వచ్చే అవకాశం ఉంది. అయితే, గతంలోలాగా రూ. 5 లేదా రూ. 6కు ఎగ్స్ వచ్చే పరిస్థితి మాత్రం ఉండచపోచ్చు. ఇతర ప్రొటీన్ పుడ్స్‌తో పోలిస్తే ఎగ్స్ అందరికి అందుబాటులో ఉంటాయి. దీంతోనే వీటికి డిమాండ్ అధికంగా ఉంది.
సరఫరా పెరిగినా, సరిపోవడం లేదు:
గతేడాదితో పోలిస్తే దేశంలో ఎగ్స్ సరఫరా స్థిరీకరించబడింది. అయినా కూడా అనేక ప్రాంతాల్లో కొరత నమోదైంది. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా పెరగలేదు. గత రెండేళ్లలో అనేక చిన్న, మధ్యతరహా యూనిట్లు దీర్ఘకాలిక నష్టాల వల్ల మూతపడ్డాయి. దీనికి తోడు కోళ్ల దాణాలో ముఖ్యమైన మొక్కజొన్న, సోయాబీన్ ధరలు పెరిగాయి. దీనికి వాతావరణ కారణాలు, అధిక ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం వంటివి కారణం అవుతున్నాయి. ఫౌల్ట్రీ రైతు ఖర్చుల్లో కోళ్ల దాణాకే ఎక్కువగా 60 శాతం కన్నా ఎక్కువ వాటా కలిగి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో, కోడిగుడ్ల ధరలు రూ. 6.5 నుంచి రూ. 7 కన్నా తక్కువగా ఉంటే రైతులకు ఆర్థికంగా స్థిరంగా ఉండవని పరిశ్రమ వర్గాలు సూచిస్తున్నాయి.
రవాణా ఖర్చులు, ఎగ్స్ కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడటం కూడా ధరలు పెరగడానికి కారణం అవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, తూర్పు భారతదేశంలోని చాలా రాష్ట్రాలు దక్షిణ భారతదేశం నుంచి కోడిగుడ్ల సరఫరాపై ఆధారపడ్డాయి. రవాణా ఖర్చులు, ఇంధన ధరలు, లాజిస్టిక్స్ అడ్డంకులు వల్ల రిటైల్ మార్కెట్లకు సరఫరా చేరే సమయానికి గుడ్డుకు 20 నుండి 40 పైసలు పెరుగుతున్నాయి. ఈ కారణాల వల్ల ఎగ్స్ ధరలు పెరుగుతున్నాయని ఫౌల్ట్రీ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నారు.
