UPI 123 PAY: దేశంలో డిజిటల్ విప్లవం దూసుకెళ్తోంది. మార్కెట్ లో కూరగాయల వ్యాపారులు డిజిటల్ చెల్లింపులు ఎలా చేస్తారని ప్రశ్నించిన వారందరి నమ్మకాలను వమ్ము చేస్తూ దేశంలో గత కొన్నేళ్లుగా డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ప్రకారం.. యూపీఐ ద్వారా ప్రతీ నెల రూ. 1000 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. కూరగాయల విక్రేతల నుంచి కార్పొరేట్ ఉద్యోగి వరకు భారతదేశంలో ప్రతీ వ్యక్తి డిజిటల్ చెల్లింపులకు అలవాటు పడ్డారు.
యూపీఐ చెల్లింపులను మరింత సులువు చేసేలా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI)‘ యూపీఐ 123 పే’ సేవలను తీసుకువచ్చింది. స్మార్ట్ ఫోన్లతోనే కాకుండా ఫీచర్ ఫోన్లతో కూడా యూపీఐ పేమెంట్స్ చేసేలా ఈ పద్దతిని తీసుకువచ్చింది. IVR- ఆధారిత చెల్లింపులను నిర్వహించడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
అయితే ప్రస్తుతం టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా ‘యూపీఐ 123పే’ ద్వారా డిజిటల్ చెల్లింపుల సదుపాయాన్ని అందిస్తోంది. టాటా క్యాపిటల్స్ కస్టమర్ల కోసం ఇప్పటికే అనేక చెల్లింపుల పద్దతులు ఉండగా.. ఇప్పుడు ఈ జాబితాలోకి ‘యూపీఐ 123పే’ కూడా చేరింది. మైక్రోఫైనాన్స్ కస్టమర్లు, తక్కువ మొత్తంలో చెల్లింపుకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ట్రాన్సాక్షన్స్, రుణ సేవలను పెంచుతుంది.
ఇంటర్నెట్ లేకుండా చెల్లింపులు:
యూపీఐ 123పే పద్దతి ద్వారా ఇంటర్నెట్ లేకున్నా సాధారణ ఫోన్లు, స్మార్ట్ ఫోన్ల ద్వారా కూడా చెల్లింపులు సులువుగా చేయవచ్చు. ఈ ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. ముందుగా రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి ఐవీఆర్ నెంబర్ కు కాల్ చేయాలి. ఆ తరువాత భాషను ఎంచుకోవాలి. యూపీఐకి లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాను ఎంచుకోవాలి, చివరకు యూపీఐ పిన్ ని ఎంటర్ చేయడం ద్వారా లావాదేవీలు పూర్తి చేయవచ్చు. స్మార్ట్ ఫోన్లు, ఇంతర ఫోన్లలో ఇంటర్నెట్ అందుబాటు లేని సమయంలో కూడా ఈ రకంగా చెల్లింపులు చేయవచ్చు. టాటా క్యాపిటల్స్ ఈ చెల్లింపుల ప్రక్రియను ప్రస్తుతం కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, బీహార్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు ఆరు రాష్ట్రాల్లో, 5 భాషల్లో ప్రవేశపెడుతుంది.