దేశంలో కోట్ల మంది యువత ఉదయం నిద్రలేవగానే చేసే మొదటి పని ఒకటుంది. అది జాబ్ కోసం ఇంటర్నెట్‌లో బ్రౌజింగ్ చేయడం! చదువు అయిపోయింది.. ఇప్పుడు ఉద్యోగం ఎక్కడ? డిగ్రీలు చేతిలో ఉన్నాయి కానీ అవకాశాలు కనిపించడం లేదు.
ఒకవైపు జనాభాలో యువత శాతం అత్యధికంగా ఉన్న దేశం భారత్. మరోవైపు నిరుద్యోగం, అండర్‌ఎంప్లాయ్‌మెంట్ అనే భయం. ఇదే కాంట్రాడిక్షన్ మధ్యలో ఇప్పుడు యూనియన్ బడ్జెట్ 2026 వస్తోంది. ఈ బడ్జెట్ యువతకు మరో స్కీమ్ ప్రకటించే డాక్యుమెంట్‌గా కాకుండా, నిజంగా ఉద్యోగాల దారిని చూపించే మలుపుగా మారుతుందా అన్నదే అసలు ప్రశ్న. ఈసారి ప్రభుత్వ సంకేతాలు భిన్నంగా ఉన్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ నుంచి ఇంటర్న్‌షిప్‌ల వరకు, కంపెనీలను నేరుగా జాబ్ క్రియేషన్‌లోకి లాగేందుకు కొత్త మోడళ్లపై ఆలోచన జరుగుతోంది. ఒక కోటి మంది యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు, వేల కోట్ల రూపాయల స్కిల్ ఇన్వెస్ట్‌మెంట్, ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు ఇన్సెంటివ్స్ లాంటి ప్రతిపాదనలు కనిపిస్తున్నాయి. ఇటు బిజినెస్ ప్రపంచం కూడా ఈ బడ్జెట్‌ను గమనిస్తోంది. ఎందుకంటే యువతకు ఉద్యోగం అంటే అది కేవలం సామాజిక అంశం కాదు. అదే వినియోగం, డిమాండ్, గ్రోత్‌ను ముందుకు నడిపించే ఇంజిన్.
2026 బడ్జెట్ యువతను ఖర్చు చేసే శక్తిగా, దేశాన్ని పని చేసే శక్తిగా మార్చగలిగితే అది గేమ్ ఛేంజర్ అవుతుంది. మరి ఈసారి నిజంగానే ఉద్యోగాల వరద వస్తుందా?
ఇక్కడ అసలు చర్చ మొదలయ్యేది సంఖ్యల దగ్గర కాదు.. నమ్మకం దగ్గర. ఇండియాలో ప్రతి సంవత్సరం సుమారు కోటి 20లక్షల మంది యువత జాబ్ మార్కెట్‌లోకి వస్తున్నారు. కానీ అధికారిక రంగంలో ఏర్పడుతున్న ఉద్యోగాలు ఆ సంఖ్యకు చాలా తక్కువ. అందుకే ప్రభుత్వం ఈసారి నేరుగా ఉద్యోగం ఇవ్వాలనే ఆలోచన కంటే, ఉద్యోగానికి అవసరమైన పరిస్థితులను తయారు చేయడం మీద దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది.
ఇంటర్న్‌షిప్ మోడల్ ఈ ఆలోచనకు కేంద్రబిందువు. ఇప్పటివరకు ఇంటర్న్‌షిప్ అంటే ఎంపికైన కొందరికే పరిమితమయ్యేది. ఇప్పుడు దాన్ని పెద్ద స్థాయిలో తీసుకెళ్లాలన్న ప్రయత్నం జరుగుతోంది. బిజినెస్ కోణంలో ఇది కంపెనీలకు కూడా లాభమే. కొత్తగా ఉద్యోగిని నియమించే ముందు ఒక సంవత్సరం పాటు మానవ వనరును తక్కువ ఖర్చుతో పరీక్షించుకునే అవకాశం వారికి లభిస్తుంది. కానీ ఇదే చోట ఒక ప్రమాదం కూడా ఉంది. ఇంటర్న్‌షిప్ శాశ్వత ఉద్యోగంగా మారకపోతే, అది యువతకు మరో తాత్కాలిక దశగానే మిగిలిపోతుంది.
స్కిల్ డెవలప్‌మెంట్ విషయంలో కూడా ఇదే సవాలు. ఏఐ, డ్రోన్లు, గ్రీన్ ఎనర్జీ లాంటి పదాలు వినడానికి ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ మార్కెట్‌కు అవసరమైన స్కిల్స్, ట్రైనింగ్ ఇచ్చే క్వాలిటీ మధ్య గ్యాప్ ఉంటే ప్రయోజనం ఉండదు.
గతంలో స్కిల్ ప్రోగ్రామ్‌లు సర్టిఫికేట్‌ల వరకే ఆగిపోయాయన్న విమర్శ ఉంది. ఈసారి ఐటీఐల అప్‌గ్రేడేషన్, వోకేషనల్ ల్యాబ్‌లు నిజంగా పనిచేస్తేనే గ్రామీణ యువతకు దీని ఫలితం అందుతుంది. ఉద్యోగాలు సృష్టించేందుకు కంపెనీలకు ఇన్సెంటివ్ ఇవ్వడం మరో కీలక అంశం. నెలకు 3000 రూపాయల ఇన్సెంటివ్ వినడానికి చిన్న మొత్తంలా అనిపించినా, పెద్ద సంస్థలకు ఇది నియామక వ్యయాన్ని తగ్గించే అంశం. కానీ చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఈ స్కీమ్‌ను ఉపయోగించగలవా అన్నదే అసలు ప్రశ్న. ఒకవేళ పేపర్‌వర్క్ ఎక్కువైతే, స్కీమ్ కేవలం పెద్ద కంపెనీలకే పరిమితం అవుతుంది.
ఇటు ముద్ర లోన్లు, స్టార్టప్ సపోర్ట్ విషయానికి వస్తే, యువతలో ఆసక్తి పెరుగుతోంది కానీ రిస్క్ కూడా అంతే. స్వయం ఉపాధి అంటే కేవలం లోన్ ఇవ్వడం కాదు. మార్కెట్ యాక్సెస్, మెంటార్షిప్, డిమాండ్ ఉన్న రంగాల్లోనే పెట్టుబడి పెట్టే గైడెన్స్ అవసరం. లేకపోతే లోన్ భారం యువతపై మరో ఒత్తిడిగా మారుతుంది.
మరోవైపు ఇండియా ఏఐ మిషన్ లాంటి ప్రోగ్రామ్‌లు భవిష్యత్తు వైపు దృష్టి పెడుతున్నాయి. కానీ ఇక్కడ కూడా ఒక నిజం ఉంది. దేశంలో ఏఐ ఉద్యోగాలు పెరుగుతున్నా, అవి ఇంకా పరిమిత సంఖ్యలోనే ఉన్నాయి. అందుకే ట్రైనింగ్ ఇచ్చే స్కిల్, ఇండస్ట్రీకి అవసరమైన స్కిల్ ఒకే దారిలో ఉండాల్సిన అవసరం ఉంది. మొత్తానికి బడ్జెట్ 2026 యువతకు ఒక హామీ ప్యాకేజ్ కాదు. ఇది ఒక పరీక్షా మోడల్. ప్రభుత్వం వ్యవస్థను నిర్మించాలనుకుంటోంది. యువత ఆ వ్యవస్థలోకి ప్రవేశించాలనుకుంటోంది. మధ్యలో మార్కెట్, కంపెనీలు, అమలు యంత్రాంగం కలిసి పనిచేయకపోతే ఈ ప్రయత్నం అర్థాంతరంగా ఆగిపోతుంది. అందుకే ఈ బడ్జెట్‌ను యువత సంఖ్యలతో కాదు.. ఫలితాలతో అంచనా వేయాలి.
ఒక సంవత్సరం తర్వాత ప్రశ్న ఇదే అవుతుంది. ఎంతమంది ఇంటర్న్‌లకు నిజమైన ఉద్యోగాలు వచ్చాయి? ఎంతమంది ట్రైనింగ్ తీసుకున్న యువత మార్కెట్‌లో నిలబడ్డారు? అప్పుడే ఈ బడ్జెట్ నిజంగా గేమ్ ఛేంజరా కాదా అన్నది తేలుతుంది.
ALSO READ: ఇళ్ల ధరలు తగ్గుతాయా? బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న మిడిల్‌క్లాస్
