NTV Telugu Site icon

Today (26-12-22) Business Headlines: ఇండియా.. ‘ఫార్మసీ ఆఫ్‌ ద వరల్డ్‌’. మరిన్ని ముఖ్య వార్తలు.

Today (26 12 22) Business Headlines

Today (26 12 22) Business Headlines

Today (26-12-22) Business Headlines:

ఇండియా.. ‘ఫార్మసీ ఆఫ్‌ ద వరల్డ్‌’: భారతదేశం ప్రపంచ ఔషధాగారంగా ఎదిగిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. సరసమైన రేట్లు మరియు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో మందులను తయారుచేస్తూ ఇండియా.. ఫార్మసీ ఆఫ్‌ ద వరల్డ్‌ అనే ప్రత్యేక గుర్తింపు పొందిందని తెలిపారు. ఆఫ్రికా దేశాలకు 50 శాతం, అమెరికాకు 40 శాతం, బ్రిటన్‌కి 25 శాతం, గ్లోబల్‌ వ్యాక్సిన్లలో 60 శాతం, WHO ఇమ్యునిటీ ప్రోగ్రామ్స్‌కి 70 శాతం మెడిసిన్‌లను మన దేశమే అందిస్తుండటం గర్వకారణమని పేర్కొన్నారు. మెడికల్‌ టూరిజంలో వరల్డ్‌లోనే ఇండియా 10వ స్థానంలో ఉందన్నారు. ప్రతి సంవత్సరం 78 దేశాల నుంచి 20 లక్షల మంది పేషెంట్లు వస్తున్నారని వెల్లడించారు.

జర్నీ రద్దు/మార్పునకు ఫీజు లేదు

టాటా గ్రూపులోని ఎయిరిండియా.. ఫాగ్‌ కేర్‌ అనే ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. శీతాకాలం కాబట్టి మంచు కారణంగా విమాన సర్వీసులకు అంతరాయం కలిగితే ఈ అవకాశాన్ని వాడుకోవచ్చని పేర్కొంది. జర్నీని క్యాన్సిల్‌ చేసుకోవటం.. లేదా.. ప్రయాణ సమయం మార్చుకోవటం వంటివి చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు అదనంగా ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన పనిలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ సౌకర్యాన్ని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనివల్ల ఫ్లైట్‌ ప్యాసింజర్లకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించుకోవచ్చని ఎయిరిండియా అభిప్రాయపడింది.

ఓఎన్‌జీసీ బోర్డులో కీలక మార్పు

ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్‌ అండ్‌ న్యాచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ బోర్డులో కీలకమైన మార్పు చోటుచేసుకుంది. కొత్తగా.. డైరెక్టర్‌ ఫర్‌ కార్పొరేట్‌ అఫైర్స్‌-స్ట్రాటజీస్‌ అనే పదవిని ఏర్పాటుచేశారు. రెండు డైరెక్టర్‌ పోస్టులను కలిపేసి దీనికి శ్రీకారం చుట్టారు. ఆరు సర్వీసులను పర్యవేక్షించేందుకు ఇప్పటివరకు ఓఎన్‌జీసీ బోర్డులో మొత్తం ఆరుగురు డైరెక్టర్లు ఉండేవారు. అందులోని.. ఆన్‌షోర్‌ అండ్‌ ఆఫ్‌షోర్‌ ఆపరేషన్స్‌ని ఇప్పుడు ఒక్కటి చేసి ప్రొడక్షన్‌ అనే కొత్త విభాగాన్ని ఆరంభించారు. దీనికి ఒక డైరెక్టర్‌ను నియమిస్తారు. ఈ నిర్ణయం మార్చి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.

హౌజింగ్‌ లోన్‌పై క్రెడాయ్‌ రిక్వెస్ట్‌

హౌజింగ్‌ లోన్‌ ఇంట్రస్ట్‌పై పన్ను మినహాయింపు పరిమితిని ఇప్పుడున్న 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచాలని.. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా.. కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. దీనివల్ల మధ్య తరగతి ప్రజలకు చేతి ఖర్చుల విషయంలో కాస్త ఊరట లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. సంవత్సరానికి అద్దె రూపంలో వచ్చే ఆదాయంపై 20 లక్షల వరకు ట్యాక్స్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని రిక్వెస్ట్‌ చేసింది. అఫర్డబుల్‌ హౌజింగ్‌ పరిధిలోకి వచ్చే ఇళ్ల ధరల పరిమితిని 45 లక్షల పైకి పెంచాలని కూడా ప్రీబడ్జెట్‌ వినతిపత్రంలో క్రెడాయ్‌.. సెంట్రల్‌ గవర్నమెంట్‌ను కోరింది.

ప్రైవేట్ టెలికంలకి రైల్వేస్‌ ఓకే

టెలీ కమ్యూనికేషన్ల విషయంలో రైల్వే మంత్రిత్వ శాఖ.. ప్రైవేట్‌ సంస్థలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఆయా సంస్థలు.. ఇక.. ఇండియన్‌ రైల్వేస్‌ భూముల్లో సెల్‌ టవర్లను ఏర్పాటుచేసుకొని సర్వీసులు అందించనున్నాయి. ఇప్పటివరకు ఈ హక్కు రైల్వేల సొంత టెలికం సంస్థ రైల్‌టెల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు మాత్రమే ఉండేది. తన నెట్‌వర్క్‌లో 5జీ సేవల కోసం రైల్వే మంత్రిత్వ శాఖ ప్రైవేట్‌ టెలికం ఆపరేటర్లతో చర్చలు జరుపుతున్నట్లు గతంలోనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ వార్తలు వాస్తవ రూపం దాల్చటం 5జీ నెట్‌వర్క్‌కి బూస్ట్‌ లాంటి పరిణామమని నిపుణులు అంటున్నారు.

అల్యూమినియంకి ఎంతో ‘కస్టమ్‌’

అల్యూమినియం రంగానికి ఇబ్బందికరంగా మారిన పన్నులను తగ్గించాలని అసోసియేటెడ్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఆఫ్‌ ఇండియా.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అల్యూమినియం సెక్టార్‌.. ముడి సరుకు కోసం ఎక్కువ శాతం ఇంపోర్ట్స్‌ పైనే ఆధారపడుతోందని, ఈ పరిస్థితుల్లో దిగుమతి సుంకాలు అధికంగా ఉండటం ఈ రంగం ప్రగతికి ప్రతికూలంగా మారిందని పేర్కొంది. రా మెటీరియల్‌ని ఎక్కువ రేటుకు దిగుమతి చేసుకోవటం వల్ల ఫినిష్డ్‌ గూడ్స్‌ ధరలను కూడా అధికంగానే నిర్ణయించాల్సి వస్తోందని, ఫలితంగా అవి ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో పోటీ ఇవ్వలేకపోతున్నాయని వివరించింది.